బిజినెస్

ఆక్వా రంగాన్ని కుదిపేస్తున్న వాతావరణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 11: వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఎప్పుడు భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడో, మరెప్పుడు వరుణుడు ఆగ్రహించి ముంచెత్తుతాడో తెలియక ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని కుదిపేసిన ఉష్ణోగ్రతల ప్రభావానికి చాలామంది ఆక్వా రైతులు నష్టపోగా, ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలకు మిగిలిన రైతులు కూడా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
వరి పంట మాదిరిగానే ఆక్వా రంగం విషయానికి వస్తే చేప, రొయ్యల పంటలకు వాతావరణ ప్రభావం ఎక్కువే. నిర్ణీతకాలంలో అన్నదాత దుక్కులు దున్ని విత్తనాలు చల్లకపోతే వాతావరణం ప్రభావం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చేపలు, రొయ్యల చెరువుల విషయంలోనూ అంతే. శీతాకాలం సీజన్ ముగియగానే వెంటనే చెరువులను ఖాళీ చేసుకుని మరో పంటకు ముందుకు వెళ్లాలి. అయితే సీడ్ ఇబ్బందులు, వేద్దామా..వద్దా అనే అనుమానాలతో సాగుకు ముందుకు రావడంలేదు రైతులు. తీరా సీడ్ తెచ్చుకుని మంచి కౌంట్‌లు చెరువులో వేసుకునేసరికి వేసవి ఎండలు ప్రారంభమవుతున్నాయి. దీంతో వాటిని కాపాడుకునేందుకు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే చేతి చమురు వదిలించుకోవాల్సిందే. తాజాగా గత కొద్ది రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా చేపలు తేలిపోయి, రొయ్యలు మట్టిలో కలిసిపోయిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇంతటి వేడి వాతావరణం నుండి ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అనూహ్య మార్పు కారణంగా చెరువులో ఆక్సిజన్ తగ్గిపోయి ఉన్న చేపలు, రొయ్యలు చనిపోతున్నాయి. దీంతో రైతుల ఆక్రోశానికి అంతులేకుండాపోయింది. ఈ పరిస్థితి అంచనావేసి, ముందుజాగ్రత్తగా పట్టుబడి చేస్తుంటే ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు. ఇదే పరిస్థితుల వల్ల ఏటేటా భారీగా నష్టపోతున్నామని ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రొయ్యలకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది. వైరస్ ప్రభావంవల్ల ఎగుమతులు సన్నగిల్లాయని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో 30 కౌంట్ రొయ్యల ధర కిలోకు 800 నుండి ఒక్కసారిగా 480 రూపాయలకి పడిపోయింది. ఇక 40 కౌంట్ 380 రూపాయలు, 50 కౌంట్ 280 రూపాయలు, 60 కౌంట్ ధర 260 రూపాయలు పలుకుతోంది. ఇక చేప విషయానికి వస్తే దేశీయ మార్కెట్‌లో కిలో 100 నుండి 120 రూపాయలకి పైగా ధర పలికే కట్లా రకం చేప సుమారు 80 రూపాయలు, శీలావతి దాదాపు 90 రూపాయలు మాత్రమే పలుకుతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అతలాకుతలమవుతున్నారు.
కోల్డు స్టోరేజీ సౌకర్యం కల్పించాలి
కాగా, ఆక్వా ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి కోల్డు స్టోరేజీల సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. వీటివల్ల ధర లేకపోయినా పట్టుబడి చేసిన రొయ్యలు, చేపలను కోల్డు స్టోరేజీల్లో భద్రంచేసుకుని, ధర పెరిగాక అమ్ముకునే సౌలభ్యం కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.