బిజినెస్

గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న స్వయం సహాయక సంఘాలకు చెందిన 71 లక్షల మంది మహిళా సభ్యుల కుటుంబాలకు నెలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సేవలు అందించేందుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. ప్రస్తుతం డ్వాక్రా మహిళలు అనుసరిస్తున్న జీవనోపాధి పద్ధతులను పటిష్టపరచడానికి, వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన రంగంలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇచ్చి వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఇకపై టాటా ట్రస్ట్ విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మంగళవారం సిఎంవోలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యనిర్వహణ అధికారి కృష్ణమోహన్, టాటా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటరమణన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తమ సహాయ సహకారాలు అందుకుంటున్న 450 మంది భాగస్వాముల అనుభవాలను సేకరించి వాటిలో ఉత్తమ పద్ధతులను, సాంకేతికతను పరిశీలించి రాష్ట్రంలోనూ ఆ విధానాలను టాటా ట్రస్ట్ ప్రవేశపెట్టనుంది. వ్యవసాయ రంగంలో సన్న, చిన్నకారు, కౌలు రైతుల కుటుంబాల ఆదాయాలను పెంచడానికి పలు మార్గాలను అనుసరించి, ఆదాయాన్ని పెంచుకునేలా దోహదపడనుంది. ఇందుకోసం ముందుగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో తమ విధానాలను ఆచరణలోకి తీసుకురానుంది. పశుపోషణపై ఆధారపడిన 30 లక్షల మంది మహిళల కుటుంబాలకు అదనపు ఆదాయం రావడానికి పశుసంవర్థకశాఖతో కలిసి టాటా ట్రస్ట్ పనిచేయనుంది. ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పంచాయతీలో ఒక మహిళా సభ్యురాలు చొప్పున మొత్తం 12,500 మందిని పశుమిత్రలుగా నియమించి వారి ద్వారా ఆయా గ్రామాల్లో పశుపోషణకు కావాల్సిన అన్ని సేవలు అందించనుంది. పశువులకు ప్రాథమిక వైద్యం, దాణా సరఫరా, టీకాలు వేయడం వంటివి చేస్తూ పాల ఉత్పత్తిని పెంచేందుకు ‘పశుమిత్ర’ సేవకులు సాయపడతారు. ఇంకా కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి చిన్న చిన్న పాలీ హౌస్‌ల ఏర్పాటు, తేనెటీగలు, పెరటి కోళ్ల పెంపకానికి కావాల్సిన పథకాలను తీసుకువచ్చేలా సెర్ప్‌కు టాటా ట్రస్ట్ మార్గదర్శనం చేయనుంది. తీర ప్రాంతం, సాంప్రదాయ మత్స్యకారులకు కావాల్సిన రుణ సదుపాయం, బీమా, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే విషయంలో మత్స్యశాఖతో కలిసి వెలుగు సిబ్బంది పనిచేస్తారు. అదే విధంగా వ్యవసాయేతర వ్యాపారాల్లో ఉపాధి పొందుతున్న మొత్తం 13.12 లక్షల మంది మహిళలకు రుణ సదుపాయం, బీమా కల్పనతో సహా వ్యాపార మెలకువలు నేర్పించేందుకు ప్రపంచ కార్మిక సంస్థ, కుదుంబశ్రీ సహకారాన్ని సెర్ప్ తీసుకోనుంది. చేనేత, హస్త కళలు, చేతివృత్తులపై ఆధారపడిన మహిళల కుటుంబాలకు కావాల్సిన కొత్త నైపుణ్యాలు, సరికొత్త డిజైన్లను నిఫ్ట్-టాటా ట్రస్ట్ సహకారంతో సామాజిక పారిశ్రామికవేత్తల ద్వారా అండగా నిలవనుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టాటా ట్రస్ట్ సంయుక్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు సెర్ప్ ప్రణాళికలు రూపొందిస్తోంది. సమావేశంలో మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, టాటా ట్రస్ట్ ప్రతినిధులు, వ్యవసాయశాఖ కార్యదర్శి రాజశేఖర్, మత్స్య-పశు సంవర్ధక శాఖ కార్యదర్శి మన్మోహన్‌సింగ్, మత్స్యశాఖ కమిషనర్ శంకర్ నాయక్, సెర్ప్ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, సిఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.