బిజినెస్

జిఎస్‌టిపై అపోహలొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 2: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుంటున్న జిఎస్‌టిని శుక్రవారం అర్ధరాత్రి చారిత్రక పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా పరిచయం చేసినది తెలిసిందే. అయితే 130 కోట్ల జనాభా, 2 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను కలిగిన యావద్భారతావనికి ఏకైక పన్ను జిఎస్‌టిపై ప్రజల్లో ముఖ్యంగా వ్యాపారుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. దీనే్న ఇప్పుడు తొలగించే ప్రయత్నం చేశారు రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా. జిఎస్‌టిపై నెలకొన్న అపోహాలేమిటి? అసలు నిజాలేమిటీ అన్నదానిపై అధియా ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధానంగా ఏడు నిజానిజాలను వెల్లడించారు. వాటిని ఒక్కసారి పరిశీలిస్తే..
1. అపోహ: కంప్యూటర్/ఇంటర్నెట్ ద్వారానే అన్ని బిల్లులు లేదా ధరల పట్టీ జనరేట్ చేసుకోవాలి
వాస్తవం: బిల్లులను మాన్యువల్ (రాత పూర్వకంగా)గా కూడా జనరేట్ చేసుకోవచ్చు
2. అపోహ: ఇంటర్నెట్ లేనిదే జిఎస్‌టి క్రింద వ్యాపార నిర్వహణ సాధ్యం కాదు
వాస్తవం: జిఎస్‌టి నెలసరి రిటర్న్ దాఖలు సమయంలో మాత్రమే ఇంటర్నెట్ అవసరం
3. అపోహ: ప్రాథమిక (ప్రొవిజనల్) ఐడి ఉన్నా.. వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తుది (ఫైనల్) ఐడి కోసం ఆగాల్సిందే
వాస్తవం: వ్యాపారాన్ని మొదలు పెట్టేందుకు ప్రొవిజనల్ ఐడి కూడా మీ తుది జిఎస్‌టిఎన్ నెంబర్‌గా ఉపయోగపడుతుంది
4. అపోహ: ఓ వాణిజ్య ఉత్పత్తి గతంలో పన్నుల నుంచి మినహాయించబడితే ఇప్పుడు దాన్ని అమ్మేందుకు తక్షణమే కొత్త రిజిస్ట్రేషన్ (నమోదు) అవసరం
వాస్తవం: ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాన్ని కొనసాగించవచ్చు. అయితే 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
5. అపోహ: ప్రతి నెలా మూడు రిటర్న్స్ దాఖలు చేయాలి
వాస్తవం: మూడు భాగాలతో ఒక రిటర్న్ మాత్రమే ఉంటుంది. మొదటిది డీలర్ దాఖలు చేస్తే, మిగతా రెండు భాగాలు కంప్యూటర్ ద్వారా వాటంతటవే దాఖలవుతాయి
6. అపోహ: చిన్నచిన్న డీలర్లు కూడా జిఎస్‌టి రిటర్న్‌లో ధరల పట్టీవారీగా వివరాలను పొందుపరచాలి
వాస్తవం: రిటైల్ వ్యాపారంలోని అలాంటి చిన్నచిన్న డీలర్లు మొత్తం అమ్మకాలను ఒక్క పట్టిక (సమ్మరీ)లోనే దాఖలు చేయవచ్చు
7. అపోహ: ఇంతకుముందున్న వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)తో పోల్చితే జిఎస్‌టి రేట్లు అధికంగా ఉన్నాయి
వాస్తవం: ఎక్సైజ్ సుంకం, ఇతరత్రా పన్నులు ఇంతకుముందు వేర్వేరుగా ఉండేవి. ఇప్పుడు జిఎస్‌టిలో అవన్నీ కలిసిపోయాయి కాబట్టి ఎక్కువగానే కనిపిస్తుంది
జిఎస్‌టిపై ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అధియా.. ప్రజలను, వ్యాపారులను ఈ సందర్భంగా కోరారు. ‘జిఎస్‌టి అమలుపై ఆందోళన అక్కర్లేదు. పెద్ద ఎత్తున ఐటి వనరులనూ సమకూర్చుకోవాల్సిన పనిలేదు. రిటైలర్లేగాక, హోల్‌సేల్ వ్యాపారులకూ భారీ సాఫ్ట్‌వేర్ అవసరం లేదు. ప్రభుత్వమే ఉచిత సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది.’ అని స్పష్టం చేశారు. మొత్తానికి అంతా జిఎస్‌టిని భూతద్దంలో చూసి భయపడుతున్నారన్నారు.
ఒకే దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను నినాదంతో దేశవ్యాప్తంగా శనివారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పరోక్ష పన్నుల విధానంలో 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు కలిపి నాలుగు శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు. 5, 12, 18, 28 రేట్లలో ఈ పన్నులను వేయగా, బంగారానికి ప్రత్యేకంగా 3 శాతం పన్నును విధించారు. విద్య, వైద్యం, తాజా కూరగాయలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ తదితర 16 వేర్వేరు పన్నులను జిఎస్‌టిలో కలిపేశారు. దీనివల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతుండగా, జిఎస్‌టి అమలును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో తొలి ఐదేళ్లు నష్టపరిహారం కూడా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే లగ్జరీ, ఆరోగ్యానికి హానికరం చేసే ఉత్పత్తులపై 43 శాతం వరకు అదనంగా పన్ను భారాన్ని మోపింది మోదీ సర్కారు.

చిత్రం.. హస్ముఖ్ అధియా