బిజినెస్

పొగాకు ఉత్పత్తిలో ‘ప్రకాశం’ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 19: పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పొగాకు శాతాన్ని పరిశీలిస్తే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 65 శాతం పొగాకు ఉత్పత్తి అవుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్ పరిధిలో మొత్తం 13 పొగాకు వేలం కేంద్రాలు ఉండగా, అందులో ఒంగోలు 1,2, వెల్లంపల్లి 1,2, టంగుటూరు 1,2, కొండపి, కందుకూరు 1,2, పొదిలి 1,2, డిసిపల్లి, కలిగిరి బోర్డు వేలం కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఒక్క చీరాల మినహా అన్ని ప్రాంతాలలో రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు.
ఈ పొగాకు పంట వలన ప్రకాశం జిల్లాలో 32 వేల రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయ. వేలాది మంది కార్మికులకు ఈ పొగాకు పంట ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలో మొత్తం 32 వేల మంది పొగాకు రైతులు ఉండగా, బ్యార్నీలు 25 వేల 391 వరకు ఉన్నాయి. జిల్లాలో నల్లరేగడి నేలలు, తేలిక నేలల్లో పొగాకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో 48 వేల 205 హెక్టార్లలో రైతులు పొగాకు పంటను సాగుచేస్తున్నారు. పొగాకు పంటపై కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి ఎక్సైజ్ డ్యూటీ పేరుతో 19 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అయితే ప్రభుత్వానికి ఇంత ఆదాయాన్ని ఇస్తున్న పొగాకు రైతు కష్టాల కడలిలో మునిగితేలుతూ ఇబ్బందులు పడక తప్పటం లేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రతి రెండు లేక మూడు సంవత్సరాలకు పొగాకు ఉత్పత్తి సరిగా కాకపోవడం లేదా ఒకవేళ పొగాకు పంట ఉత్పత్తి జరిగినప్పటికి పొగాకు పంటకు సరిగా గిట్టుబాటు ధరలు రాకపోవడం లాంటి కారణంగా పొగాకు రైతు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నాడు.
ఏదైనా ఒక సంవత్సరం రైతుకు బాగా గిట్టుబాటు ధరలు వచ్చాయి అనుకొని రైతు సంతోషపడితే ఆ తరువాత సంవత్సరం ఎదో ఒక రూపంలో నష్టాలు రావడంతో అంతకు ముందు వచ్చిన ఆదాయంతోపాటు, మరింత నష్టాలు వచ్చి ఆ నష్టాన్ని పూడ్చుకోవడం రైతుకు పరిపాటిగా మారిపోయంది. పంట సాగుచేసేందుకు తెచ్చిన అప్పులు కూడా తిరకపోవడంతో ఒక్కోసారి పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అయనప్పటికీ జిల్లాలో ఎక్కువమంది రైతులు పొగాకు పంటపైనే జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ పంటను రైతులు సాగుచేస్తే ఆ పంటలకు కూడా గిట్టుబాటు ధరలు రాకపోవడంతో రైతులు తిరిగి పొగాకు పంటనే సాగు చేయాల్సి వస్తోంది. అంతేగాక ఇక్కడి నేలలు పొగాకు పంట సాగుకు అనుకూలం కావడంతో రైతులకు నష్టాలు వచ్చినప్పటికి తిరిగి మరుసటి సంవత్సరం పొగాకు పంటనే ఎక్కువ మంది రైతులు సాగుచేయటం జరుగుతోంది. యేటేటా పొగాకు ఉత్పత్తి ఖర్చులు అధికంగా పెరుగుతున్నప్పటికీ రైతులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగుచేస్తున్నారు. తీరా వేలం కేంద్రాలలో వ్యాపారులు కుమ్మక్కై పొగాకు ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేయటం వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అయతే గిట్టుబాటు ధరలు రాని సమయంలో రైతులకు మద్దతుగా నిలిచి ఆందోళన చేస్తే మాత్రం కాస్త ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నా రని, ఆ తరువాత వ్యాపారులు మళ్లీ సిండికేట్ అయ్యి ధరలు తగ్గించడం సహజంగా మారిందని పొగాకు రైతు సంఘాలు విమర్శిస్తున్నాయ. పొగాకు బోర్డు అధికారులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ ప్రతినిధులు రైతుల పక్షాన తగిన మేరకు స్పందించకపోవడం కారణంగానే పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఆశించిన మేరకు రావడం లేదని అంటున్నారు. రైతు పరిరక్షణకు గాను 1975లో పొగాకు బోర్డు ఏర్పడింది. అయితే బోర్డు అధికారులు ఏ మేరకు గిట్టుబాటు ధరలు ఇప్పించగలుగుతున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదిలాఉండగా ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో పొగాకు పంట ఉత్పత్తి తగ్గింది. ఒంగోలు రీజియన్ పరిధిలో సుమారు 81 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు లక్ష్యంగా నిర్ణయించగా, దాదాపు 70 మిలియన్ కేజీల ఉత్పత్తే జరిగినట్లు బోర్డు అధికారుల ద్వారా సమాచారం. జిల్లాలో ఈ ఏడాది మార్చి 15న వేలం కేంద్రాలు ప్రారంభమై ఈ నెల 8న ముగిశాయి.
కాగా, పొగాకు ధరలు బాగా వచ్చినప్పటికి పంట దిగుబడి తగ్గటంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. జిల్లాలోని నల్లరేగడి పరిధిలోని కొండపి వేలం కేంద్రంలో ఒక కేజి మేలిమి రకం పొగాకు అత్యధికంగా 203 రూపాయల ధర పలికి చరిత్ర సృష్టించింది. తేలిక నేలల పరిధిలోని కలిగిరి వేలం కేంద్రంలో మేలిమి రకం పొగాకు ఒక కేజికి గరిష్ఠంగా 199 రూపాయల ధర పలకడం జరిగింది. మొత్తంగా నల్లరేగడి నేలల్లో మేలిమి రకం పొగాకు ఒక కేజికి సగటు ధర 116.98 రూపాయలుండగా, అదే తేలిక నేలల్లోని మేలిమి రకం పొగాకు ఒక కేజికి సగటు ధర 117.46 రూపాయలుగా నమోదైంది. జిల్లాలోని నల్లరేగడి నేలల్లో వేలం కేంద్రాలు ముగిసేనాటికి మొత్తం 32.3 మిలయన్ కేజీల పొగాకు కొనుగోళ్లు జరగగా, తేలిక నేలల్లోని వేలం కేంద్రాలలో మొత్తం 25.2 మిలియన్ కేజీల పొగాకు కొనుగోళ్లు జరిగాయ. నల్లరేగడి, తేలిక నేలల పరిధిలోని వేలం కేంద్రాలలో కలిపి మొత్తం 57.5 మిలియన్ కేజీల పొగాకును రైతుల అమ్ముకోగలిగినట్లు ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్ పరిధిలోని వేలం కేంద్రాల ఆర్‌ఎంలు జి ఉమామహేశ్వరరావు, జి రత్నసాగర్ తనను కలిసిన ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. మరోవైపు ఇంకా రైతుల వద్ద అదనంగా పండించిన పొగాకు కొంత ఉందని, ఆర్డర్స్ ఇచ్చిన తరువాత ఈ పొగాకును అపరాధ రుసుముతో కొనుగోలు చేయిస్తామని బోర్డు ఆర్‌ఎంలు తెలిపారు.
ఏదిఏమైనప్పటికి పొగాకు పంట కోసం ప్రభుత్వం ఒక స్థిర నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా వేలం కేంద్రాల కొనుగోళ్ళలోకి దించి పొగాకు రైతులకు నష్టాలు రాకుండా చూడాలి. అలాగే గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకునే బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు ప్రజాప్రతినిధులపై, బోర్డు అధికారులపైనాఉంది.

చిత్రాలు.. ప్రకాశం జిల్లాలో పొగాకు సాగులో నిమగ్నమైన రైతులు
*మొక్కల నుంచి పొగాకును సేకరిస్తున్న మహిళ