బిజినెస్

విశాఖలో సముద్ర ఉత్పత్తుల అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 14: విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు వేదిక కానుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోగల సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ఎంపెడా) ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నగరానికి ప్రత్యేకత ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్), ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) విజయవంతంగా నిర్వహించిన ఘనత దక్కించుకుంది విశాఖపట్నం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక సదస్సు నిర్వహించాలని ఎంపెడా నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు కలిగిన విశాఖలో ఈ సదస్సు నిర్వహించడం ద్వారా నవ్యాంధ్రకు మేలు చేకూర్చినట్టవుతుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ భావించింది. ఈ మేరకు ఎంపెడా చైర్మన్ జయాతిలక్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం శనివారం నగరంలో పర్యటించింది. కలెక్టర్ ఎన్ యువరాజ్ సారథ్యంలో ఈ బృందం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి అనువైన వేదిక కోసం అనే్వషించింది. గతంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన ఎపిఐఐసి మైదానం, నెహ్రూ స్టేడియం, పోర్టు కళావాణి ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, ఎయు ఇంజనీరింగ్ కళాశాల మైదానంతోపాటు పోతినమల్లయపాలెం క్రికెట్ స్టేడియం సమీపంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌ను ఈ బృందం పరిశీలించింది. స్టాల్స్ ఏర్పాటుతోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులతో నిర్వహించే చర్చలకు అనువైన వేదికలను ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించింది. కాగా, పోర్టు స్టేడియంలో వసతుల వివరాలను డిప్యూటీ చైర్మన్ హరనాథ్ ఈ బృందానికి వివరించారు. వేదికలకు సంబంధించిన వివరాలు, ఇతర అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎంపెడా చైర్మన్ జయాతిలక్ అధికారులకు తెలిపారు. ఎంపెడా బృందంతో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుకుమార్, ఎంపెడా కార్యదర్శి బి శ్రీకుమార్, రాష్ట్ర సముద్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పద్మనాభం, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు కోటేశ్వరరావు స్థలాల పరిశీలనలో పాల్గొన్నారు.