బిజినెస్

పోటీతత్వంలో భారత్‌కు 40వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రపంచ పోటీతత్వ సూచీ (గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్)లో భారత్ 40వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలో గత ఏడాదితో పోలిస్తే భారత్ ఒక స్థానం దిగజారింది. 137 దేశాలున్న ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటిస్థానంలో ఉండగా, అమెరికా, సింగపూర్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) బుధవారం ఈ జాబితాను విడుదల చేశారు. గత ఏడాది 30వ స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది 40వ స్థానానికి దిగజారగా, ఆసియాలో మన దేశానికి ప్రధాన పోటీదారయిన చైనా 27వ స్థానంలో ఉంది. అయితే గత రెండేళ్లతో పోలిస్తే భారత్ అభివృద్ధి దిశగా పురోగమిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. అనేక రంగాల్లో ముఖ్యంగా వౌలిక సదుపాయాలు (66వ ర్యాంక్) ఉన్నత విద్య, శిక్షణ (75) సాంకేతిక సన్నద్ధత (107) రంగాలు మెరుగుపడ్డం ఈ రంగాల్లో ఇటీవలి కాలంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగిన విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీల సూచీలో ముఖ్యంగా తలసరి ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ వినియోగం, మొబైల్ ఫోన్, బ్రాడ్‌బ్యాండ్ చందాలు, పాఠశాలల్లో ఇంటర్నెట్ లభ్యత విషయాల్లో భారత్ ఎంతో మెరుగుపడిందని ఆ నివేదిక తెలిపింది.

అయితే భారత్‌లో వ్యాపారం జరపడానికి అవినీతి అది పెద్ద సమస్యగా ఉంటోందని ప్రైవేట్ రంగం ఇప్పటికీ భావిస్తోందని ఈ నివేదిక పేర్కొంది.
బ్రిక్స్ దేశాల్లో చైనా, రష్యా భారత్‌కన్నా పైస్థాయిలో ఉన్నాయి. చైనా 27వ స్థానంలో ఉండగా, రష్యా 38వ స్థానంలో ఉంది. కాగా, ఈ కూటమిలోని మిగతా దేశాలయిన దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు వరసగా 61, 80వ స్థానంలో ఉన్నాయి. అయతే దక్షిణాసియాలో మాత్రం మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత భూటాన్ (82వ స్థానం), శ్రీలంక (86), నేపాల్(88), బంగ్లాదేశ్ (99), పాకిస్తాన్ (115వ స్థానం)లో ఉన్నాయి. కాగా, టాప్ టెన్‌లో స్థానం సంపాదించిన దేశాల్లో నెదర్లాండ్స్ (4వ ర్యాంక్), జర్మనీ (5), హాంకాంగ్ (6), స్వీడన్(7), బ్రిటన్(8), జపాన్(9), ఫిన్లాండ్(10) ఉన్నాయి.

ఏపీకి పదెకరాల
ఎయిర్ పోర్ట్ అథారిటీ స్థలం

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ పరిసర
గ్రామాలకు రహదారి ఇక సుగమం
ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: రాజమండ్రి విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు రహదారి ఏర్పాటు చేసేందుకు అవసరమైన 10.25 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత ఎయిర్ పోర్ట్ అథారిటీ రాజమండ్రి విమానాశ్రయం వద్ద ఉన్న 10.25 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి ఇంతే మొత్తంలో భూమిని మరోచోట తీసుకుంటుంది. రాజమండ్రి విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించేందుకు ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. రాజమండ్రి విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న ఈ భూమిని ఇచ్చినందుకు ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోచోట 10.25 ఎకరాల భూమిని భారత ఎయిర్ పోర్ట్ అథారిటీకి కేటాయిస్తుంది. రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు కూడా ఇది తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

బెస్ట్ ప్లేస్ టు వర్క్‌లో
గూగుల్ టాప్

రెండో స్థానంలో బిహెచ్‌ఈఎల్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రపంచంలోనే పేరొందిన జాబ్‌సైట్ ‘ఇన్‌డీడ్’ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో అత్యుత్తమైన 50 పని చేసేందుకు అనుకూలమైన కార్యాలయాలను గుర్తించినట్లు వెల్లడించింది. వీటిలో ప్రథమ స్థానంలో గుగూల్, రెండో స్ధానంలో బిహెచ్‌ఈఎల్, మూడో స్ధానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నిలిచిందని ఇన్‌డీడ్ నిర్వహించిన సర్వేలో తెలిపింది. లక్షలాది మంది ఉద్యోగుల సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించినట్లు ఇన్‌డీడ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ శశికుమార్ తెలిపారు. కంపెనీల సమీక్షలు ఉద్యోగార్థుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే విలువ, వారితో ప్రవర్తించే తీరు కూడా వెల్లడిస్తాయని స్పష్టం చేశారు. టెక్ ఎంప్లాయర్స్‌గా ఉన అమెజాన్ 4, ఇంటెల్ 6, ఐబిఎం 8, సిస్కో 11 స్ధానాల్లో ఉన్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ వర్క్ ప్రదేశాల్లో తాము నాలుగో స్థానం సంపాదించుకోవడం సంతోషంగా ఉందని అమెజాన్ హెచ్‌ఆర్ ఏపిఏసి డైరక్టర్ రాజ్ రాఘవన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

వంద కోట్లతో హైదరాబాద్‌లో ‘కెమోగ్రూప్’ ప్లాంట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఫార్మా రంగంలో పేరొందిన బహుళజాతి కంపెనీ కెమో గ్రూప్ హైదరాబాద్‌లో కెమో ఇండియా ఫార్ములేషన్స్ ప్లాంట్‌ను ప్రారంభించినున్నట్లు వెల్లడించింది. టాబ్లెట్లు, కాప్లెట్స్, హార్డ్‌జెలాటిన్ క్యాప్సూల్స్, పెలెట్స్‌తోసహా నోటిద్వారా తీసుకునే ఘన మోతాదుల అభివృద్ధి, ఉత్పత్తిని కెమో చేపడుతుందని ఆ గ్రూప్ ఇండస్ట్రియల్ డివిజన్ మేనేజింగ్ డైరక్టర్ లుకాస్ సిగ్‌మాన్ తెలిపారు. కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా ఈ నూతన ప్లాంట్ ఏర్పాటు, అంతర్జాతీయంగా రోగులకు అందుబాటు ధరల్లో ఔషదాలను అభివృద్ధి చేయాలనేది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. కొత్త ప్లాంట్ ఏర్పాటుతో అంతర్జాతీయంగా ఉన్న 15 ప్లాంట్లకు చేరుతుందని చెప్పారు. రక్తపోటు, గుండె, మధుమేహం, ఇతర మందులకు సంబంధించిన థెరపాటిక్ డ్రగ్ ఉత్పత్తుల అభివృద్ధి, ఉత్పత్తిని ఇక్కడ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సిగ్‌మాన్ వెల్లడించారు. ప్లాంట్ నిర్మాణానికి తొలి పెట్టుబడిగా రూ.100 కోట్లు కావాల్సి ఉంటుందని తెలిపారు.

స్టాండర్డ్ చార్టర్డ్ అల్టిమేట్ క్రెడిట్ కార్డ్

హైదరాబాద్, సెప్టెంబర్ 27: స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అల్టిమేట్ క్రెడిట్ కార్డును మార్కెట్‌లో అత్యుత్తమ రివార్డు పాయింట్ విలువతో ఆవిష్కరించింది. ఈ కార్డు నామమాత్రపు ఫీజు రూ.5వేల ధరతో లభిస్తుందని ఆ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ ఇండియా కంట్రీ హెడ్ శ్యామ్‌లాల్ సక్సేనా తెలిపారు. నిర్ధేశిత ట్రావెల్ పోర్టల్‌పై మొదటి మూడు నెలలపాటు ఈ కార్డు వినియోగించడం ద్వారా 10 వేల రూపాయల క్యాష్ బ్యాక్ పొందగలరని ఆయన తెలిపారు.

స్టీల్‌ప్లాంట్ సేల్స్ టర్నోవర్
రూ.12,706 కోట్లు

గాజువాక, సెప్టెంబర్ 27: పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారం మెరుగైన ఉత్పత్తి, ఉత్పాదకతలపై తగిన వృద్ధిని నమోదు చేస్తూ నిలకడగా ముందుకు సాగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 12,706 కోట్ల రూపాయలను సేల్స్ టర్నోవర్‌ను సాధించి, 4 శాతం వృద్ధిని నమోదు చేసిందని సంస్థ సిఎండి పి.మధుసూదన్ ప్రకటించారు. విశాఖ ఉక్కులో బుధవారం వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు కనబర్చిన పని తీరును సమీక్షించారు. హాట్‌మెటల్ 10 శాతం, సేల్‌బుల్ స్టీల్, పిన్సిడ్‌స్టీల్ 17శాతం వృద్ధితో కర్మాగారం వ్యాప్తంగా 11శాతం ప్రగతిని కనబర్చిందని మధుసూదన్ తెలిపారు. బ్లాస్ట్‌పర్నెస్ విభాగంలో షట్‌డౌన్ పనులు ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు మెరుగైన పని తీరును సాధించిందన్నారు. కోకింగ్ కోల్ ధరలు అనూహ్యంగా 200శాతం పెరిగి పోవడం సంస్థపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ఉత్పత్తులు వ్యయ నియంత్రణ, ఇతర పొదుపు చర్యలను చేపట్టిన సంత్పాలితాలను సాధించామన్నారు. కర్మాగారంలోని మెరుగైన ఉత్పత్తి, ఉత్పాధకతను సాధించి మరింత ఉత్తమ ఫలితాలను సాధించే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని విభాగాల్లోని వృద్ధి సాధించడంపై దృష్టి సారించామన్నారు. ఈ సమావేశంలో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ డైరెక్టర్ మహావీర్ ప్రసాద్, విశాఖ ఉక్కు డైరెక్టర్లు పి.సి.మహాపాత్రో, ఆర్‌పి చౌదరి, వివి వేణుగోపాలరావు, సునీల్ గుప్తా, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.