బిజినెస్

పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

214 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్
9,800 పాయింట్లు దాటిన నిఫ్టీ

ముంబయి, అక్టోబర్ 3: రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన సమీక్ష ఒకవైపు, స్థానికంగానూ, అంతర్జాతీయంగానూ నెలకొన్న సానుకూల పరిణామాలు మరొకవైపు మంగళవారం స్టాక్ మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. గత కొన్ని రోజులుగా మందకొడిగా సాగిన షేర్లు పుంజుకున్నాయి. వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ మంగళవారం లావాదేవీలు ముగిసే సమయానికి 214 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ కూడా బెంచ్‌మార్కు అయిన 9,800 పాయింట్లకు ఎగువనే ముగిసింది. ఆటోమొబైల్ షేర్లు పుంజుకోవడం మార్కెట్‌కు ఊతాన్నిచ్చింది. బుధవారం నాడు ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆశావహ పరిస్థితులు కేంద్రీకృతమయ్యాయి. స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. ముఖ్యంగా వృద్ధిరేటుకు ఊతాన్నివ్వడానికి ఇటు పరిశ్రమ, అటు ప్రభుత్వం వడ్డీరేట్లను తగ్గించాలని రిజర్వు బ్యాంకును డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వృద్ధిరేటు గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 5.7 శాతం దిగువకు చేరుకుంది.
కాగా, మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని అందుపుచ్చుకున్న బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు 1.79 శాతం మేరకు పుంజుకున్నాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, ఆర్‌ఐఎల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ షేర్లు కూడా 2.72 శాతం మేర పుంజుకున్నాయి. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బిఎస్‌ఇలో అడుగు పెట్టింది. జారీ ధరపై 4.75 శాతం ప్రీమియంతో మొదలైన ఈ షేరు వివిధ దశల్లో ఊగిసలాడి 708 రూపాయల వద్ద ముగిసింది.

కొత్త ఎస్-క్రాస్‌కు బుకింగ్‌లు ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: దేశంలోని ఆటోమొబైల్ సంస్థల్లో అతిపెద్దదైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఈ వారం మార్కెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న తమ ‘ఎస్-క్రాస్’ కొత్త వెర్షన్ కార్ల అమ్మకాల కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 280 పైగా ఉన్న తమ నెక్సా షోరూముల్లో ఎక్కడైనా రూ.11 వేలు చెల్లించి కొనుగోలుదారులు కొత్త ఎస్-క్రాస్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని ఎంఎస్‌ఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.3 లీటర్ల డీజిల్ ఇంజన్‌తో లభ్యమయ్యే కొత్త ఎస్-క్రాస్ మోడల్ వివిధ ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుందని ఎంఎస్‌ఐ తెలిపింది. ఎంఎస్‌ఐ గతంలో ఎస్-క్రాస్ వాహనాన్ని 1.6 లీటర్ల డీజిల్ ఇంజన్‌తో కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇకమీదట ఈ వాహనం అందుబాటులో ఉండదని ఎంఎస్‌ఐ స్పష్టం చేసింది. 2015 ఆగస్టులో ఎస్-క్రాస్ వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన ఎంఎస్‌ఐ ఇప్పటివరకూ దేశీయంగా 52 వేలకు పైగా యూనిట్లను అమ్మడంతో పాటు మరో 4,600 పైగా యూనిట్లను ఎగుమతి చేసింది.

టెలికామ్ ఆపరేటర్లకు
త్వరలో కొత్త నిబంధనలు

జియో ఎఫెక్ట్‌తో ట్రాయ్ కసరత్తు * మార్కెట్ వర్గాలతో సంప్రదింపులకు యోచన

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: టెలికామ్ మార్కెట్‌లో పూర్తిస్థాయి వాణిజ్య సేవలను ప్రారంభించడానికి ముందు తమ సేవలను పరీక్షించుకునే కొత్త మొబైల్ ఆపరేటర్లకు త్వరలో స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించాలని మార్కెట్ నియంత్రణా సంస్థ ట్రాయ్ (టెలికామ్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) యోచిస్తోంది. ఇందులో భాగంగా ట్రాయ్ టెలికామ్ మార్కెట్ వర్గాలతో త్వరలో సంప్రదింపులు ప్రారంభించాలని భావిస్తోంది. గత ఏడాది కొత్తగా మార్కెట్‌లో ప్రవేశించిన రిలయన్స్ జియో టెలికామ్ రంగంలో పెను సంచలనాలను సృష్టిస్తుండటంతో ట్రయల్ సర్వీసులకు స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వాణిజ్య పరంగా సేవలను ప్రారంభించడానికి ముందు తమ సేవలను పరీక్షించుకునే విషయంలో కొత్త ఆపరేటర్లు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో స్పష్టంగా నిర్దేశించాలని ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి పలు సంస్థలు డిమాండ్ చేస్తుండటంతో ఈ నిబంధనలను రూపొందించడంపై ట్రాయ్ దృష్టి సారించింది. కొత్త ఆపరేటర్లు తమ సేవలను ఎంత కాలం పరీక్షించుకోవాలి, ఆ సమయంలో ఎంతమంది ఖాతాదారులను చేర్చుకునేందుకు అనుమతించాలి, ఆ సేవలను ఉచితంగా అందించేందుకు అనుమతించాలా? వద్దా? అనే అంశాలతో పాటు పలు ఇతర అంశాలపై స్పష్టమైన నియమ నిబంధనలను రూపొందించాలని ట్రాయ్ భావిస్తున్నట్లు ఈ పరిణామాలతో సంబంధమున్న ఇద్దరు ఉన్నతాధికారులు వివరించారు.