బిజినెస్

నగరాల్లో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, అక్టోబర్ 3: జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ఆసియా ఖండంలోని నగరాల్లో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజు రోజుకూ మరింతగా పెరుగుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని, ఇది సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు మంగళవారం హెచ్చరించింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేసింది. ఆసియాలోని మొత్తం జనాభాలో దాదాపు సగం మంది నగరాల్లోనే నివసిస్తున్నారని, పట్టణీకరణ వేగవంతమవడంతో దాదాపు 65.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు తన తాజా అధ్యయన నివేదికలో పేర్కొంది. అయితే దాదాపు 25 కోట్ల మంది జనాభా ఉన్న ఆసియా తూర్పు ప్రాంతంతో పాటు పసిఫిక్ ప్రాంతాలు ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలకు నెలవుగా ఉన్నాయని, ప్రత్యేకించి చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో ఇటువంటి పెద్దపెద్ద మురికివాడలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య పెరుగుతున్న అసమానతలపై తమ అధ్యయనాల్లో దృష్టి సారించామని, అయితే నగర ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు మరింత ఎక్కువగా ఉండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలతో పాటు గృహ వసతి, ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడంతో నగరాలకు వలసపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, దీంతో పట్టణ ప్రాంతాల్లోని ధనికులు, పేదల మధ్య ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరుగుతున్నాయని ఆసియా ఖండంలో ప్రపంచ బ్యాంకుకు వైస్-ప్రెసిడెండ్‌గా వ్యవహరిస్తున్న విక్టోరియా క్వాక్వా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అసమానతలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మనం ఇప్పటికే ఇటువంటి అశాంతిని చూస్తున్నామని ఈ అధ్యయన నివేదికకు ముఖ్య రచయితగా వ్యవహరించిన ప్రపంచ బ్యాంకు అర్బన్ స్పెషలిస్టు జూడీ బెకర్ హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు చౌక ధరలో నాణ్యమైన గృహ వసతి, ప్రభుత్వ రవాణా లాంటి వౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వారికి సరైన ఉపాధి అవకాశాలు లభించేలా చూసేందుకు పాలకులు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేసింది. మంగోలియా రాజధాని ఉలాన్ బటోర్‌లో ప్రభుత్వ రవాణా వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటంతో అక్కడి అల్పాదాయ ప్రజలు తమ నెలవారీ ఖర్చులో 36 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని బస్సు చార్జీలకే వెచ్చించాల్సి వస్తోందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అలాగే ఇండోనేషియాలోని నగరాల్లో నివసిస్తున్న జనాభాలో 27 శాతం మందికి, ఫిలిప్పీన్స్‌లో 21 శాతం మందికి శానిటేషన్ వసతులు అందుబాటులో లేవని ప్రపంచ బ్యాంకు తమ నివేదికలో తెలిపింది.

వచ్చే ఏడాది రూ.20 వేల కోట్లు
సమీకరించనున్న పవర్ గ్రిడ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో నాన్-కన్వర్టబుల్ బాండ్లను జారీ చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల నిధులను సమీకరించుకునేందుకు ప్రభుత్వ రంగంలోని నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తమ వాటాదారుల నుంచి అనుమతి పొందింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో సెక్యూర్డ్/అన్‌సెక్యూర్డ్, నాన్-కన్వర్టబుల్, నాన్-క్యుములేటివ్/క్యుములేటివ్, రిడీబబుల్, ట్యాక్సబుల్/ట్యాక్స్-ఫ్రీ డిబెంచర్లు/బాండ్లను జారీ చేయడం ద్వారా 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్ నుంచి రూ.20 వేల కోట్ల నిధులను సమీకరించుకునేందుకు గత నెల 19వ తేదీన జరిగిన తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి (బిఎస్‌ఇ)కి తెలియజేసింది. దాదాపు 20 విడతలు/ఆఫర్లలో సమీకరించనున్న ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ క్యాపెక్స్ (పెట్టుబడుల వ్యయ) అవసరాలతో పాటు అనుబంధ సంస్థలకు రుణాలను సమకూర్చేందుకు, ఇతర ఆర్థిక అవసరాలకు ఉపయోగించడం జరుగుతుందని నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ పెట్టుబడుల వ్యయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.