బిజినెస్

ఉపాధి హామీ పథకం పనుల గ్రౌండింగ్‌లో తూ.గో. నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జిజిఎస్) పనుల గ్రౌండింగ్‌లో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉపాధి హామీ పనులను జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ఈ రికార్డు లభించింది. రాష్ట్రంలో భౌగోళికంగా పెద్ద జిల్లాగా, వ్యవసాయపరంగా అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరిలో ఉపాధి హామీ పథకం ఆరంభం నుండి పనులు భారీగానే జరుగుతున్నాయి. తొలుత ఇరిగేషన్, వ్యవసాయ పనులకే పరిమితమైన ఉపాధి హామీని కాలక్రమంలో అన్ని శాఖలకూ విస్తరించారు. ఫారం పాండ్స్, వర్మీ కంపోస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్, శ్మశాన వాటికల్లో వసతుల కల్పన, సిసి రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, ఉద్యానవన శాఖ పనుల్లో ఉత్తమ ఫలితాలను సాధించడం ద్వారా జిల్లా తాజాగా రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించింది. సరాసరి వేతనాలు చెల్లింపులోనూ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పనులను సకాలంలో పూర్తిచేయడంలో రాష్ట్రంలో జిల్లాకు రెండవ స్థానం లభించింది. సిసి రోడ్ల నిర్మాణం, గృహ నిర్మాణం, పంట కుంతల ఏర్పాటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి హామీలో ప్రాధాన్యత కల్పించారు. ఉపాధి హామీ పథకంలో 75రోజుల నుండి 100రోజుల ఉపాధిని జిల్లాలో 30వేల కుటుంబాలు పొందుతున్నాయి. అలాగే 50 నుండి 75 రోజులు పనులు పొందిన కుటుంబాలు 23వేల వరకు ఉన్నాయి. వీరందరికీ నూరు రోజులు పని కల్పించే లక్ష్యంతో పనుల కల్పనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేశామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. అటవీ శాఖ, పశు సంవర్ధక శాఖ, గిరిజన ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజిమెంట్ తదితర పనులను ఉపాధి హామీ పథకం సహకారంతో విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా జిల్లాలో గతంలో ఉపాధి హామీ పథకం అమలులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్టు సామాజిక తనికీ (సోషల్ ఆడిట్)లో వెలుగుచూసింది. అక్రమాలకు బాధ్యులైన అధికారులు, సిబ్బంది, తపాలా శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్టు అనేక సందర్భాలలో ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ ఈ పథకం అమలులో అక్రమాలకు అంతులేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని వివిధ మండలాల్లో పథకం అమలులో అవకతవకలు జరుగుతున్నట్టు ఉన్నతాధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్టవేసి, పనులను పారదర్శకంగా, మరింత సమర్ధవంతంగా చేపడితే జిల్లాకు మరింత పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశముంది.