బిజినెస్

ఆశించినట్లే ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు లాంటి సంస్కరణలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో పాటు జిఎస్‌టి అమలుతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోకి భారీ మొత్తంలో నగదు వచ్చి చేరుతోందని ఆయన అన్నారు. బర్కిలీ ఇండియా కాన్ఫరెన్స్‌కు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలకోపన్యాసమిస్తూ, దేశంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ‘ఎంతో మంది ప్రజలకు, ప్రత్యేకించి యువజనులకు మనం సేవలను అందించాల్సి ఉందన్న విషయాన్ని మరువకూడదు. కనుక దేశ వృద్ధిరేటు మళ్లీ పుంజుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నా’ అని జైట్లీ పేర్కొన్నారు. వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు న్యూయార్క్, బోస్టన్ నగరాల్లో కార్పొరేట్ ప్రముఖులతో భేటీ అయ్యేందుకు దాదాపు వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న జైట్లీ సోమవారం ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రభుత్వం పట్ల యువతలో ఆకాంక్షలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, తమకు సరైన సేవలు అందడం లేదన్న భావన వారిలో ఉందని, దీంతో తాము కాలంతో పోటీపడుతూ పరుగులు తీయాల్సి వస్తోందని జైట్లీ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగాలని భారత్ భావిస్తున్నట్లయితే రానున్న ఒకటి, రెండు దశాబ్దాల పాటు అభివృద్ధిలో దేశం మరింత వేగవంతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
స్వచ్ఛ భారత్, వస్తు, సేవల పన్ను అమలు, పెద్ద నోట్ల రద్దు లాంటి సంస్కరణలు క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులను తీసుకురాలేకపోతున్నాయని కొంత మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని జైట్లీ తోసిపుచ్చారు. ఈ సంస్కరణల వలన దీర్ఘకాలంలో మాత్రమే ప్రయోజనాలు ఉంటాయని, వాటి కోసం దేశం ఎదురు చూడాలని? మీరు చెబుతున్నారా? లేక ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న సమస్యలను ఎలాగైనా తగ్గించాలని చెబుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సంస్కరణలన్నింటి వలన స్వల్పకాలిక ప్రయోజనాలు కూడా ఒనగూడుతాయన్న విషయం కొద్ది నెలల వ్యవధిలోనే రుజువు అవుతోందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వలన దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతో పాటు భారీ మొత్తంలో నగదు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోందని, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను మరింత ముందుకు తీసుకొచ్చిందని చెప్పారు.