బిజినెస్

ఎయిర్ ప్యూరిఫయర్ల హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశ రాజధానితో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోతోందన్న హెచ్చరికలే ఇందుకు కారణం. ఈ హెచ్చరికలతో బెంబేత్తుతున్న ప్రజలు ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు. వాయు కాలుష్యం నుంచి రక్షించడంలో ఇటువంటి ఉత్పత్తులు ఎంత సమర్ధంగా పనిచేస్తాయన్న దానిపై వైద్యులతో పాటు నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత రెండు మూడు రోజుల్లో తమ ఎయిర్ ప్యూరిఫయర్లకు గిరాకీ ఎన్నో రెట్లు పెరిగిందని షియోమీ, యురేకా ఫోర్బ్స్, బ్లూ ఎయిర్, పానాసోనిక్ ఇండియా, హనీవెల్, షార్ప్ లాంటి సంస్థలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీలో గణనీయంగా పెరిగిపోయిన వాయు కాలుష్యం నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంలో ఇటువంటి ఎయిర్ ప్యూరిఫయర్లు, మాస్కులు ఎంత మేరకు సమర్ధవంతంగా పనిచేయగలుగుతాయో చెప్పేందుకు అవసరమైన క్లినికల్ గణాంకాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవని వైద్యులతో పాటు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాయు కాలుష్యం నుంచి ప్రజలకు ఎన్-95 మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లు పూర్తిస్థాయి రక్షణ కల్పించలేవని, కనుక ఈ సంక్షోభాన్ని తొలగించేందుకు దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్, ప్రముఖ పల్మనాలజిస్టు రణ్‌దీప్ గులెరియా ఉద్ఘాటించారు. అయినప్పటికీ చైనా సంస్థ షియోమీ ప్రవేశపెట్టిన ‘మి ఎయిర్ ప్యూరిఫయర్-2’ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. మిడాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ సంస్థల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చిన మి ఎయిర్ ప్యూరిఫయర్-2 అమ్మకాలు కేవలం గత 24 గంటల వ్యవధిలోనే ఎనిమిది రెట్లు పెరిగాయని షియోమీ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా, ఢిల్లీతో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో వాయు కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతుండటంతో గత రెండు మూడు రోజుల్లో తమ ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, గత వారంలో జరిపిన అమ్మకాల కంటే ఇవి దాదాపు 50 రెట్లు ఎక్కువని, దీంతో గత నెలతో పోలిస్తే ఈ నెలలో తమ అమ్మకాలు మూడు రెట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నామని బ్లూఎయిర్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. అలాగే గత కొద్ది రోజుల నుంచి తమ ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగినట్లు పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ సయ్యద్ మూనిస్ అల్వీ, యురేకా ఫోర్బ్స్ ఎండి, సిఇఓ మర్జిన్ ఆర్.ష్రాఫ్, 3ఎం ఇండియా పర్సనల్ సేఫ్టీ డివిజన్ మేనేజర్ నందకుమార్, షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ డివిజన్ ప్రెసిడెంట్ కిషాలే రే, హనీవెల్ హోమ్స్ అండ్ బిల్డింగ్ టెక్నాలజీస్ ఇండియా జనరల్ మేనేజర్ సుధీర్ పిళ్లై తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎయిర్ ప్యూరిఫయర్లు వాటి ఫీచర్లను బట్టి రూ.9 వేల నుంచి 36 వేల రూపాయల ధరకు లభ్యమవుతున్నాయి.

చిత్రం..అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్-2