బిజినెస్

ప్రమాదపుటంచున పాపికొండల విహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ప్రమాదాలు చెప్పిరావు.. అలక్ష్యం వహిస్తే అమ్యూలమైన ప్రాణాలు మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా నదీ ప్రయాణాల్లో ఇది మరింత అవసరం. తాజాగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీపట్నం వద్ద కృష్ణాగోదావరి సంగమ ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదం గోదావరి జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించింది. బోటు ప్రయాణాలకు గోదావరి నది అత్యంత ప్రసిద్ధి. ముఖ్యంగా పాపికొండల విహారయాత్ర బోటు ప్రయాణాలకు పెట్టింది పేరు. గోదావరి నదిలో ప్రయాణిస్తూ పాపికొండల అందాలను తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం నిత్యం పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తుంటారు. ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ విహారయాత్ర సాగుతుంది. ఈ సమయంలోనే నదిలో నీరు పుష్కలంగా బోట్ల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. దీనితో ఏటా ఈ ఐదు నెలల్లో సుమారు మూడు లక్షల మంది వరకు ప్రయాణాలు సాగిస్తారని అధికారిక అంచనా. దేశం మొత్తంమీద ఇంత పెద్ద సంఖ్యలో నదీ ప్రయాణాలు సాగే మార్గం ఇంకోటి లేదంటే అతిశయోక్తికాదు.సుమారు 50 వరకు చిన్నా పెద్దా బోట్లు నిత్యం పర్యాటకులను తరలిస్తుంటాయి. ఇందులో 25 నుండి 150 సీటింగ్ సామర్థ్యం కలిగిన బోట్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాంతం నుంచి నిత్యం ఈ బోట్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన నదీ ప్రయాణంపట్ల అవసరమైన జాగ్రత్తలు మాత్రం కరవవుతున్నాయనే విమర్శలు నిత్యం వినిపిస్తుంటాయి. ఇప్పటివరకు గోదావరి నదిలో భారీ ప్రమాదం ఏదీ జరగకపోయినా, ఇసుక దిబ్బలకు తగులుకుని, సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తి నది మధ్యలో బోట్లు నిలిచిపోయిన ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇబ్రహీంపట్నం ప్రమాదం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది.
సీజనులో మూడు లక్షల మంది పర్యాటకులు వస్తారంటే పాపికొండల యాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగివుందో అర్థంచేసుకోవచ్చు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.30-40 కోట్ల వ్యాపారం కావడంతో సహజంగానే అనారోగ్యకర పోటీ ధోరణి పెరిగిపోతోంది.
సాధారణంగా సంఖ్యను బట్టి, సదుపాయాలను బట్టి పర్యాటకులకు నచ్చిన లాంచీలను బుక్ చేసుకుంటారు. కానీ తీరా బోటు ఎక్కే సమయం వచ్చేసరికి మనం బుక్ చేసుకున్నది ఉండదు. ఇదేమిటని అడిగితే అసోసియేషన్ సీరియల్‌ను బట్టి అప్పటికి ఏ బోటు వరుసక్రమంలో వస్తే దాన్ని పంపిస్తారు. ఈక్రమంలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్నా కండిషన్‌లోలేనిది కూడా రావొచ్చు. ఇలా వచ్చినపుడు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం వుందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎక్కడ పడవ ప్రయాణానికైనా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో లైసెన్స్ తీసుకునే అవకాశంవుంది. గోదావరిలో పడవ ప్రయాణానికి లైసెన్సుల జారీకి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ పర్యవేక్షణంలో అవసరమైన లైసెన్స్‌లు జారీ, పర్యవేక్షణ జరుగుతుంది. కానీ కమిటీ సమావేశం కావడం అరుదుగా జరుగుతుంది. అలాగే ఏదైనా సంఘటన జరిగినపుడు స్పందించడం తప్ప నిత్యం పర్యవేక్షించాల్సిన జల వనరుల శాఖ యంత్రాంగం అరకొర పర్యవేక్షణతోనే సరిపెడుతోందనే విమర్శలున్నాయి.
ప్రభుత్వం గోదావరి నది ప్రయాణానికి సంబంధించి కొన్ని విధి విధానాలను రూపొందించింది. సురక్షిత ప్రయాణానికి మార్గదర్శకాలను, అమలు చేసేందుకు క్రమబద్ధీకరణ కమిటీని నియమించారు. క్రమబద్ధీకరణ అధారిటీ పర్యవేక్షణలో ఇటు పర్యాటక శాఖ బోట్లు, ప్రైవేటు బోట్లు భద్రతా ప్రమాణాలతో నడిపే విధంగా మార్గదర్శకాలు రూపొందించారు. పోలీసు శాఖ ఎటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా పర్యవేక్షించాల్సివుంది. అటవీ శాఖ యంత్రాంగం నిర్ధేశిత ప్రాంతాల్లోనే బోట్లు ఆపే విధంగా, అటవీ ప్రాంతం కాలుష్యం కాకుండా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎక్కబడితే అక్కడ పాడేయకుండా చూడాల్సివుంది. ఇక లైసెన్స్‌లన్నీ జల వనరుల శాఖ మాత్రమే ఇవ్వాల్సివుంది. నదికి వరదలు వచ్చి, ప్రమాదకరంగా మారే సమయం, నీటి లభ్యత తక్కువగా ఉండి ఇసుక దిబ్బలు తగిలే సమయంలో బోట్ల ప్రయాణాలను నియంత్రిస్తుంది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాత్రం బోట్లకు, లాంచీలకు జెట్టీల వంటి వౌలిక సదుపాయాలు కల్పించాల్సివుంది. అయితే ఈ విభాగాలన్నీ నిత్యం సక్రమంగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయా అంటే ప్రశ్నార్థకమే. ముఖ్యంగా ఎప్పటికపుడు లాంచీల సామర్ధ్యాన్ని పరిశీలిస్తూ లైసెన్స్‌లు మంజూరు చేయాల్సివుంది. క్రమబద్ధీకరణ అధారిటీ విధివిధానాల ప్రకారం బోట్లను నడుపుతున్నారో లేదో నిత్యం పరిశీలించాల్సివుంది. సామర్ధ్యానికి మించి పర్యాటకులను ఎక్కించిన సందర్భంలోనూ, అదనపు టిక్కెట్లు వసూలుచేస్తున్నపుడు రెగ్యులేటరీ అధారిటీ లైసెన్స్‌లను రద్దుచేసేందుకు కూడా అవకాశంవుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ రెగ్యులేటింగ్ అధారిటీ కమిటీ సమావేశం విధిగా ప్రతీ మూడు నెలలకొకసారి జరగాల్సివుంది. ఈ టూరిజం బోట్లకు లైసెన్స్‌లు, రెన్యువల్ చేయడం, సాంకేతిక ప్రమాణాల ప్రకారం సరంజామా అంతా వుందా లేదా అనే అన్ని విషయాలను జల వనరుల శాఖ బోట్ సెక్షన్ యంత్రాంగం పరిశీలించాల్సివుంది. సీటింగ్ విధానం, సాంకేతిక సామర్ధ్యం కూడా నిత్యం పర్యవేక్షించాల్సివుంది. కానీ ఇదేవీ పట్టించుకుంటున్న దాఖలాలుండటంలేదు. ఇబ్రహీంపట్నం ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా అధికార యంత్రాంతం ఈ వ్యవహారాలపై దృష్టిసారించాల్సివుంది. లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది.
బీమా సౌకర్యం ఉండాలి
నిత్యం వేల సంఖ్యలో ప్రయాణాలు సాగించే పాపికొండలు విహార యాత్రలో పర్యాటకులకు బీమా సౌకర్యం కల్పించాలనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఒక్కో టిక్కెట్ నుంచి సామూహికంగా బీమా వసూలుచేసే విధానాన్ని అమలు చేయాలనే డిమాండు ఎప్పటి నుంచో వుంది. కానీ అధికారులు ఈ దిశగా పట్టించుకున్న దాఖలాలు కన్పించడం లేదు.