బిజినెస్

త్వరలో పీడీఎస్ ద్వారా చిరుధాన్యాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: రేషన్ దుకాణాలతో పాటు మధ్యాహ్న భోజనం లాంటి పథకాల ద్వారా చిరు ధాన్యాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే.పట్నాయక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చిరు ధాన్యాలకు ‘న్యూట్రీ సిరియల్స్’గా ప్రచారం కల్పించి దేశవ్యాప్తంగా వాటి వినియోగాన్ని పెంపొందించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన తెలిపారు. ‘చిరు ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)తో పాటు మధ్యాహ్న భోజనం లాంటి పథకాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. చిరు ధాన్యాలను పీడీఎస్ పరిధిలోకి తీసుకురావాలని నీతి ఆయోగ్ కూడా సూచించింది’ అని పట్నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇతర తృణ ధాన్యాలతో పోలిస్తే చిరు ధాన్యాలు చాలా బలవర్ధకమైనవని, ఉదాహరణకు రాగుల్లో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుందని, అందుకే చిరు ధాన్యాలకు ‘న్యూట్రీ సిరియల్స్’గా ప్రచారం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. అయితే ప్రస్తుతం దేశంలో చిరు ధాన్యాల దిగుబడి చాలా తక్కువగా ఉందని ఆయన స్పష్టం చేశారు. వీటి ఉత్పత్తిని పెంచేందుకు అధిక దిగుబడులను ఇచ్చే రకాలను సాగు చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఈ విషయమై కృషి చేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఇకార్) త్వరలోనే కొన్ని రకాలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నామని పట్నాయక్ తెలిపారు. అలాగే చిరు ధాన్యాలను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడం కూడా ప్రస్తుతానికి సమస్యగానే ఉందని, కనుక విస్తృత పరిశోధనలు నిర్వహించి వాటి నిల్వ కాలాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.