బిజినెస్

కొరవడిన బ్యాంకుల సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో బ్యాంకులు ప్రభుత్వానికి, ప్రజలకు సహకారం అందించడం లేదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన ఎస్‌ఎల్‌బిసి సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వివిధ కార్పోరేషన్లు, పరిషత్తుల ద్వారా స్వయం ఉపాధి పనులకోసం యువతీ యువకులకోసం సబ్సిడీ ఇస్తోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కార్పోరేషన్లు, ఇతర కార్పోరేషన్లు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తదితర సంస్థల ద్వారా ప్రభుత్వ నిధులు ఇస్తోందన్నారు. సమాజంలో స్వయం ఉపాధికోసం ముందుకు వచ్చే ఒక్కో వ్యక్తికి అవసరమైన మొత్తం యూనిట్ ఖరీదులో సబ్సిడీ 30 శాతం నుండి 75 శాతం వరకు ఇస్తున్నామన్నారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన మిగతా కొద్ది మొత్తాన్ని బ్యాంకర్లు రుణంగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, కిందిస్థాయిలో బ్యాంకు శాఖల మేనేజర్లు ఇవ్వడం లేదని, సహకారం అందించడం లేదని ఆరోపించారు. బ్యాంకులకు రుణం కోసం వచ్చే యువతీ, యువకులను బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారని, చిన్న చిన్న విషయాలను అడ్డుపెట్టుకుని రుణం ఇవ్వకుండా ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం తీసుకునే వారు సకాలంలో ఆ రుణాన్ని చెల్లించాలంటూ ప్రభుత్వం చెబుతూనే ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అయినా బ్యాంకర్ల ప్రవర్తనలో మార్పురావడం లేదన్నారు. బ్యాంకర్లు ధనికులకు రుణాలు ఇవ్వడానికి వారి ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తుంటారని, పేదలు బ్యాంకుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం వల్లనే సమాజంలో అంతరాలు తగ్గడం లేదన్నారు. బ్యాంకులు పెద్దలకు కోట్లాది రూపాయలు అప్పుగా ఇస్తున్నారని, ఒక వ్యక్తితో వెయ్యికోట్ల రూపాయలు నష్టపోతున్నారని, అదే వెయ్యికోట్లు పేదలకు రుణంగా ఇస్తే ఐదులక్షల కుటుంబాలు బాగుపడతాయన్నారు. అయితే ఈ కోణంలో కిందిస్థాయిలో పనిచేస్తున్న మేనేజర్లు ఆలోచించడం లేదని, బ్యాంకు ఉన్నతాధికారులు ఈ విషయంలో కిందిస్థాయి అధికారులు ఆలోచించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రుణాల వితరణకు సంబంధించి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో సమూల మార్పురావలసి ఉందని ఈటెల పేర్కొన్నారు. ప్రభుత్వం బ్యాంకులకు 17 వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ పేరుతో ఇచ్చిందని గుర్తు చేశారు. బ్యాంకు బ్రాంచీల స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై కూలంకషంగా చర్చలు జరపడం మంచి సాంప్రదాయానికి చిహ్నంగా చెప్పుకోవచ్చన్నారు. సమాజంలో ఆదాయం అంతరాలు బాగా తగ్గాలని, సమాజంలో సృష్టించబడుతున్న సంపద అందరి అవసరాలను తీర్చాలన్నలన్నదే తమప్రభుత్వ ఉద్దేశమన్నారు. బ్యాంకులు లాభనష్టాలను మాత్రమే చూస్తున్నాయని, పేదల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. సమాజంలో ఆదాయం బాగా పెరిగినప్పటికీ, ఎన్‌పిఎ లు కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సంఖ్య పెంచాలని గతంలో తాను కోరానని, ఈ అంశంపై సానుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు స్వయంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని, ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారన్నారు.
ఈ సమావేశంలో ఎస్‌ఎల్‌బిసి చైర్మన్ స్వామినాథన్, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ మణికందన్, ఆర్‌బిఐ జనరల్ మేనేజర్ సుబ్బయ్య, నాబార్డ్ ఆర్‌ఎం రాధాకృష్ణ, ఎస్‌బిఐ జిఎం మన్య తదితరులు పాల్గొన్నారు.