బిజినెస్

ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ సంస్థలే ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 8: భారత ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలే వెనె్నముకని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విశాఖలో జరిగే సమీక్షను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు సాలీనా రూ.18.54 లక్షల కోట్ల టర్నోవర్ సాధిస్తూ, రూ.1.15 లక్షల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు. ఇదే సందర్భంలో భారీ పరిశ్రమల్లో స్వతంత్ర డైరెక్టర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. గతంలో ప్రపంచాన్ని కుదిపేసిన లెహ్‌మన్ బ్రదర్స్ సంక్షోభం, మన దేశంలో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వంటి అంశాలు కంపెనీల ప్రత్యేక డైరెక్టర్ల పనితీరుకు ప్రాధాన్యతను తెచ్చిపెట్టిందన్నారు. 2013 కంపెనీ చట్టం మేరకు ప్రత్యేక డైరెక్టర్ల నియామకం మొదలైందన్నారు. ఇదే సందర్భంలో వీరి పనితీరును మరింత మెరుగు పరచడమే కాకుండా, సంస్థల ఆర్థిక ప్రగతి, అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించేలా చూసేందుకు ఇటువంటి సమీక్షలు ఎంతో అవసరమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ జాతీయ స్థాయి సదస్సును నిర్వహించేందుకు విశాఖను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్ల పాత్ర, విధులపై మధింపు జరుగుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే కీలక, విస్తృత స్థాయి సదస్సులో స్వతంత్ర డైరెక్టర్ల సామర్థ్యాన్ని మరింత పెంచి, వారి పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు ఇదొక మంచి అవకాశం అన్నారు. సమావేశానికి భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి మధుకర్ గుప్త నేతృత్వం వహించగా, దేశ వ్యాప్తంగా పలు సంస్థలకు చెందిన స్వతంత్ర డైరెక్టర్లు పాల్గొన్నారు.
సదస్సు ప్రారంభోత్సవం ముగిసిన అనంతరం హరిబాబు విలేఖరులతో మాట్లాడుతూ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)లో నూరుశాతం వాటాల విక్రయంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. డీసీఐపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. లాభాల్లో ఉన్న డీసీఐ ప్రైవేటీకరణపై ఆయన వివరణ ఇచ్చారు. గత ఏడాది డీసీఐ వార్షిక నివేదిక పరిశీలిస్తే లాభాల శాతంలో క్షీణత కన్పిస్తుందన్నారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తావనలోనే లేదన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం హామీ ఇచ్చిందని, దీనిలో భాగంగా ఆర్థిక సంస్థల నుంచి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ప్యాకేజీ కాల పరిమితిని పెంచడంతో పాటు మిగిలిన ప్రాజెక్టులనూ దీని పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన ఉందన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇప్పటికీ కేంద్రం పరిశీలనలోనే ఉందన్న విషయాన్ని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.

చిత్రం.. స్వతంత్ర డైరెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న ఎంపీ హరిబాబు