బిజినెస్

అందుబాటులోకి విద్యుత్ నిల్వ పరికరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 9: ఉత్పత్తి అయిన వెంటనే విద్యుత్ వినియోగించుకోవాల్సిన పరిస్థితి నుంచి నిల్వ చేసుకునే స్థాయికి సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈక్రమంలో విద్యుత్ నిల్వ చేసుకునే పరికరాలను తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో అందుబాటులో ఉన్న పరికరాలు ప్రస్తుతం రాష్ట్రానికి చేరుకోవడానికి ఖర్చు ఎక్కువ అవుతుందని వారు పేర్కొంటున్నారు. దీనిపై విద్యుత్‌రంగ నిపుణులు పూర్తిస్థాయి అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాల్సి ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుంచి విద్యుత్ నిల్వ పరికరాలు రాష్ట్రానికి చేరుకోవడానికి కొనుగోలు, పన్నులు వంటి ఖర్చులు ఉంటాయని వారు వెల్లడించారు. ప్రభుత్వ ఉపయోగం కోసం కొనుగోలు చేస్తే కేంద్రం దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తే ఖర్చు తగ్గుతుందని వారంటున్నారు. ఇక పరికరాల ఖర్చు కూడా ప్రస్తుతం ఎక్కువగా ఉందని ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నందున సహజంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. వీటన్నింటినీ పరిశీలించి పరికరాలు కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాలు స్పష్టం కావాల్సి ఉందన్నారు. ఇంతకాలం నీరు, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. తాజాగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందనీ దీని కారణంగా అవసరం మేరకు విద్యుత్ అందుబాటులోకి రావడంతో గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కోత నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని వెల్లడిస్తున్నారు. సౌర విద్యుత్ కేవలం పగటి వేళల్లో మాత్రమే ఉత్పత్తి అవుతుందని, పవన విద్యుత్ గాలి ఉంటే 24 గంటలూ ఉత్పత్తి చేసుకోవచ్చని వారంటున్నారు. ఈ రెండింటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ నిల్వ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నిల్వ చేసుకుంటే ఆ విద్యుత్‌ను అవసరమైన సమయాల్లో వినియోగించుకునే వెసులుబాటు వస్తుందని తెలిపారు. పవన విద్యుత్ 24 గంటల ఉత్పత్తి సమయం కాస్త తగ్గించి రోజుకు 12 నుంచి 15 గంటలు ఉత్పత్తి చేసి ఆ పరికరాలకు విరామం ఇవ్వవచ్చన్నారు. దీనివల్ల మరమ్మతులకు గురయ్యే అవకాశం, అందుకయ్యే ఖర్చు మొత్తం మీద ఉత్పత్తి వ్యయం తగ్గుతుందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరుగుతోందని వారు గుర్తుచేశారు. రానున్న మార్చికి కర్నూలు, మే, జూన్ నాటికి అనంతపురంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ రెండింటి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేసుకుంటే నీరు, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఖనిజ సంపద అయిన బొగ్గు, ప్రకృతి సంపద అయిన నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో తగ్గితే వాటిని మరో అవసరం కోసం వినియోగించుకోవచ్చన్నారు. ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గితే ఆ నీటిని పంటల సాగుకు రైతులకు ప్రస్తుతం అందజేస్తున్న దాని కంటే ఎక్కువగా అందించి పంటల ఉత్పత్తి పెంచేందుకు వినియోగించుకోవచ్చని తెలిపారు. బహుళ ప్రయోజనాన్ని ఇచ్చే విద్యుత్ నిల్వ పరికరాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి కసరత్తు చేస్తోందని తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే విద్యుత్ ఉత్పత్తికయ్యే ఖర్చు తగ్గి ఆ ఫలితం ప్రజలకు అందిస్తే విద్యుత్ చార్జీలను కూడా తగ్గించవచ్చన్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ చార్జీలు 20 శాతం వరకూ తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.