బిజినెస్

ఉత్తర భారత్‌లో కాలుమోపిన ‘ట్రంప్ టవర్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: రియల్ ఎస్టేట్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘ట్రంప్ టవర్స్’ తొలిసారిగా ఉత్తర భారత్‌లో తన వ్యాపార లావాదేవీలను ప్రారంభిస్తోంది. ‘ఎం3ఎం ఇండియా’, ట్రైబెకా డెవలపర్స్ పేరిట అత్యంత విలాసవంతమైన గృహసముదాయాలను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ వద్ద ‘ట్రంప్ టవర్స్’ నిర్మిస్తుంది. ఇందుకు సుమారు 1,200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ నిర్వహిస్తున్న ‘ది ట్రంప్ ఆర్గనైజేషన్’ నుంచి అనుమతి పొందిన ‘ఎం3ఎం ఇండియా’, ట్రైబెకా డెవలపర్స్ సంస్థలు అత్యంత ఖరీదైన 250 భవంతులను నిర్మిస్తాయి. ఈ బహుళ అంతస్థుల భవనాల్లో మూడు, నాలుగు పడక గదుల ఇళ్లను నిర్మిస్తారు. వీటి ధర 5 నుంచి 10 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని, 3,500 చదరపు అడుగులు, 6,000 చదరపు అడుగుల్లో భవంతులను నిర్మిస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘ట్రంప్ టవర్స్’ ఇప్పటికే ముంబయి, పూణె, కోల్‌కత నగరాల్లో తన ప్రాజెక్టులను ప్రారంభించగా, ఉత్తర భారతానికి సంబంధించి గుర్గావ్‌లో తొలి ప్రాజెక్టును చేపడుతున్నట్టు ‘ఎం3ఎం ఇండియా’ డైరెక్టర్ పంకజ్ బన్సాల్ తెలిపారు.
తమ హౌసింగ్ ప్రాజెక్టులపై కస్టమర్లలో అవగాహన కలిగించేందుకు ట్రంప్ టవర్స్ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. వందమంది ఫ్లాట్ కొనుగోలుదారులను అమెరికా తీసుకువెళ్లి జూనియర్ ట్రంప్ సమక్షంలో ఘనంగా ఆతిథ్యం ఇస్తారు. విస్మయం కలిగించే ఆకృతులు, విస్తృతమైన సౌకర్యాలు, అందచందాలు ఉట్టిపడే నిర్మాణం చూసి కస్టమర్లు కచ్చితంగా ఆకర్షితులవుతారని ‘ట్రంప్ టవర్స్’ భరోసా ఇస్తోంది. దేశ రాజధాని ప్రాంతంలో తాజా ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సుమారు 50 అంతస్థుల్లో నిర్మించే ఈ భవంతుల్లో విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటుచేసి అయిదేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేస్తారు. భూమి ఖరీదు కాకుండా, ఈ ప్రాజెక్టుకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ భవనాలను విక్రయించడం ద్వారా 2,500 కోట్ల రూపాయల లాభం ఉంటుందని అంచనా. భారత్‌లో చేపట్టిన తమ ప్రాజెక్టుల్లో ఇది అత్యంత ఖరీదైనదని ‘ట్రైబెకా డెవలపర్స్’ ప్రతినిధి కల్పేష్ మెహతా తెలిపారు. వీటిని విక్రయించేందుకు ఎన్‌ఆర్‌ఐల సేవలను కూడా వినియోగించుకుంటామన్నారు. 2014లో భారత్‌లో అడుగుపెట్టిన ‘ట్రంప్ టవర్స్’ ఇప్పటికే పూణె, ముంబయి, కోల్‌కత నగరాల్లో 8 ప్రాజెక్టులను పూర్తి చేసింది. మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.