బిజినెస్

రెండోరోజూ రికార్డుల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీ లు వరుసగా రెండో రోజు శుక్రవారం పుంజుకొని, సరికొత్త గరిష్ఠ స్థాయి రికార్డులను నెలకొల్పాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆదాయ వృద్ధి పడిపోయినప్పటికీ, మదుపరులు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలపై ఆశాజనకంగా ఉండటంతో శుక్రవారం కూడా కీలక మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 88.90 పాయింట్లు పుంజుకొని, 34,592.39 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 30.05 పాయింట్లు పెరిగి, 10,681.25 పాయింట్ల వద్ద స్థిరపడింది.
నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం అసాధారణ రీతిలో మీడియా సమావేశంలో సమస్యలను ఏకరవు పెడుతూ ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేయడంతో సెషన్ మధ్యలో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పడిపోయి, అనిశ్చితిలో కొట్టుమిట్టాడాయి. అయితే, తరువాత కొద్దిసేపటికి మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు ప్రారంభం కావడంతో కీలక సూచీలు సరికొత్త రికార్డు స్థాయిలకు ఎగబాకాయి. కీలక సూచీలు లాభపడటం ఇది వరుసగా ఆరో వారం. ఈ వారంలో సెనె్సక్స్ 438.54 పాయింట్లు (1.28 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 122.40 పాయింట్లు (1.15 శాతం) పెరిగింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో పాలనపై మదుపరులలో నెలకొన్న ఆందోళన వల్ల శుక్రవారం ఇంట్రా-డేలో సూచీలు కనిష్ట స్థాయికి దిగజారినప్పటికీ, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణులు, దేశీయ కార్పొరేట్ కంపెనీల తృతీయ త్రైమాసిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలు మార్కెట్‌కు వెన్నుదన్నుగా నిలవడంతో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి.
అయితే డిసెంబర్ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలు, పెరిగిన ముడి చమురు ధరలు కలిసి సమీప భవిష్యత్తుల్లో స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులను సృష్టించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పటిష్ఠమైన స్థితిలో ప్రారంభమైన సెనె్సక్స్ దేశీయ ఫండ్‌లు, రిటెయిల్ మదుపరులు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో మరింత పుంజుకొని ఇంట్రా- డేలో సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన 34,638.42 పాయింట్లను తాకింది. అయితే నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన తరువాత 34,342.16 పాయింట్లకు పడిపోయింది. కొద్ది సేపటి తరువాత మళ్లీ పుంజుకొని చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 88.90 పాయింట్ల (0.26 శాతం) లాభంతో 34,592.39 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం నాటి సరికొత్త జీవనకాల గరిష్ఠ రికార్డు 34,503.49 పాయింట్లను అధిగమించింది.
50 షేర్లతో కూడిన నిఫ్టీ శుక్రవారం ఇంట్రా-డేలో ఆల్‌టైమ్ హై 10,690.40 పాయింట్లను తాకింది. అయితే తరువాత స్వల్పంగా తగ్గి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 30.05 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 10,681.25 పాయింట్ల వద్ద స్థిరపడింది. గురువారం నాటి రికార్డు ముగింపు 10,651.20 పాయింట్లను నిఫ్టీ అధిగమించింది. ఇదిలా ఉండగా, గురువారం దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 770.02 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 623.63 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
మూడో త్రైమాసికంలో నికర లాభం వృద్ధి రేటు 3.6 శాతం పడిపోయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్ ధర శుక్రవారం నాటి లావాదేవీల్లో 0.56 శాతం పడిపోయింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో ప్రైవేటు బ్యాంకు ఐసీఐసీఐ అత్యధికంగా 2.63 శాతం లాభపడింది. మారుతి సుజుకి 1.27 శాతం లాభపడింది. లాభపడిన ఇతర కంపెనీలలో ఓఎన్‌జీసీ, రిల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం ఉన్నాయి. వీటి షేర్ల ధర 1.26 శాతం వరకు పెరిగింది.