బిజినెస్

ఆక్వాలో ఏపీ హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధిలో ఆక్వారంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి ఈ రంగమే జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.37,871 కోట్లు విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా ఒక్క ఏపీ నుంచే రూ.17 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్వా రంగం ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. ఆక్వా రంగంలోని కీలకమైన రొయ్యల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రం వాటా 60.1 శాతంగా ఉంది. మన దేశం నుండి ఏటా 4.97 లక్షల టన్నుల రొయ్యలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుండగా ఒక్క రాష్ట్రం నుంచి 3.02 లక్షల టన్నుల ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో పశ్చిమ గోదావరి జిల్లా వాటా 1,20,926 టన్నులుగా ఉండటం విశేషం. ఇక చేపల ఉత్పత్తిలో రాష్ట్రం ఆది నుంచీ ప్రథమ స్థానంలోనే నిలుస్తోంది. రాష్ట్రంలో ఏటా 37.41 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 7,06,300 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతుండటం విశేషం.
విభజన నేపథ్యంలో కీలకమైన సాఫ్ట్‌వేర్ రంగమంతా హైదరాబాద్‌లోనే నెలకొనివుండటంతో ఏపీకి ఒకవిధంగా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనే చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెంచుకునే అవకాశం లేకపోవడంతో వేల కోట్ల రూపాయల ఎగుమతులకు అవకాశమున్న ఆక్వా రంగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ రంగంలో ఇప్పటికే ఏపీ గణనీయమైన ప్రగతి సాధిస్తుండటంతో దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని పట్టించుకున్న నాథుడే లేడని చెప్పడం అతిశయోక్తికాదు. అయితే కొద్దిపాటి శ్రద్ధచూపిస్తే ఈ రంగం నుండి అనూహ్య ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించారు. దీంతో ఆక్వారంగంపై దృష్టిసారించారు. గత రెండేళ్లుగా బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
రానున్న బడ్జెట్‌లో కూడా కేటాయింపులు మరింతగా పెంచనున్నట్టు సమాచారం. అలాగే రొయ్యల సాగును చట్ట పరిధిలోకి తీసుకురావడం, ఆక్వా రంగంతో కాలుష్యం పెరగకుండా చర్యలు తీసుకోవడం, ఈ రంగంలోని సన్న, చిన్నకారు రైతులకు ప్రోత్సాహకాలు అందివ్వడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.
రానున్న రోజుల్లో ఆక్వా రైతులకు నికర ఆదాయం సమకూర్చేలా ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆక్వా రైతుల పరిస్థితి సైతం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారుతోంది. గతంలో ఆర్థికంగా కునారిల్లిపోయిన ఆక్వా రైతాంగం మళ్లీ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతోంది.