బిజినెస్

వరంగల్‌లో టెక్ మహీంద్ర సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: దావోస్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు పర్యటన ఫలవంతమైంది. వివిధ కంపెనీలతో మంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న అవకాశాలను పలువురు పారిశ్రామికవేత్తలకు వివరించడంతో వారు సానుకూలంగా స్పందించారు. తాజాగా గురువారం టెక్ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రతో మంత్రి కెటిఆర్ సమావేశం కాగా వరంగల్ నగరంలో టెక్ మహీంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందుగా 500 మంది నిపుణులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత విస్తరించనున్నట్టు ఆనంద్ మహీంద్ర వివరించారు. తెలంగాణ రాష్ట్రం-మహీంద్ర సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షించారు. మహీంద్ర సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణలో రెండవ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించడానికి దోహదం చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగే అతిపెద్ద స్టార్ట్ అప్ అండ్ టెక్ కార్యక్రమాన్ని (స్లష్) హైదరాబాద్ తీసుకొస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. టిహబ్ ద్వారా నగరం ఇప్పటికే దేశ స్టార్ట్ అప్ కేపిటల్‌గా ఉందని, స్లష్ ఇక్కడ నిర్వహించడం వల్ల స్టార్ట్ అప్ ఇకో సిస్టమ్‌కు గొప్ప ఊతం లభించనుందన్నారు. వివిధ అంశాలపై చర్చించడానికి త్వరలోనే ఆనంద్ మహీంద్ర హైదరాబాద్‌కు వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశం కానున్నట్టు చెప్పారని మంత్రి తెలిపారు. సిఏ సంస్థ గ్లోబల్ సిఇవో మైక్ గ్రెగోరీతో మంత్రి కెటిఆర్ సమావేశం కాగా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. భవిష్యత్‌లో కంపెనీ విస్తరణలో హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టు కెటిఆర్ పేర్కొన్నారు. తమ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అనుకూలమైందని, ట్రాఫిక్, ఎయిర్‌పోర్ట్ కనెక్టీవిటి, వౌలిక వసతులు బాగున్నాయని మైక్ గ్రెగోరీస్ ప్రశంసించారు. ఎయిరో స్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రిచర్డ్ అంబ్రోస్‌తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సంస్థ ఇప్పటికే టాటా కంపెనీ భాగస్వామ్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తోందని, ఎయిరో స్పేస్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సినేషన్ మ్యాన్యూఫాక్చరింగ్ హబ్‌ల్లో ఒకటిగా ఉందని, ఫైజర్ సంస్థ వాక్సిన్ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిందిగా ఫైజర్ వాక్సిన్ అధ్యక్షురాలు సుసాన్ సిలబెర్మన్‌కు మంత్రి వివరించారు.

చిత్రం..దావోస్‌లో టెక్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్రతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్