బిజినెస్

ఎరువు.. మరింత భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జనవరి 29: ఎరువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఎలాగోలా సాగును వెల్లదీస్తున్న కర్షకులకు పెరగబోయే ఎరువుల ధరలు మరింత బారం కానున్నాయి. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు..మరోవైపు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ఇంకోవైపు పంటలకు చీడ పీడలు, దోమపోటు వెరసి అరకొర పంటల చేతికి రావడం పరిపాటిగా మారగా, చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతన్న కుదేలవుతున్నాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరిగి తడిసిమోపెడవుతుండగా, ప్రతిసారీ అన్నదాతలు అవస్థలు పడాల్సి వస్తోంది.
ఈ క్రమంలో ఖరీఫ్‌పై ఆశలు పెట్టుకున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల ధర పెంపు నిర్ణయం ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. దీంతో అన్నదాత పరిస్థితి ‘మూలిగే నక్కపై తాటిపండు పడిన’ చందంగా మారింది. రబీ సీజన్‌లో అనుకున్నంతగా కలిసి రాకపోవడంతో రైతులు ఖరీఫ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు ఉపక్రమిస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఎరువుల ధరలు పెరుగుతాయని డీలర్లు చెబుతుండగా, ప్రభుత్వ పరంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్టు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. డీలర్లు చెబుతున్నట్టుగా ఎరువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగడం వల్ల ఎరువుల కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు, కాంప్లెక్స్ ఎరువుల ధరలను సుమారు పది శాతం మేర పెంచేందుకు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. డీఏపీ ధర ప్రస్తుతం రూ.1100 ఉండగా, ధరలు పెరిగితే రూ.1210లకు ఎగబాకనుంది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువు 20:20:00:13 ధర బస్తా రూ.900 ఉండగా, రూ.1000కి పెరిగే అవకాశం ఉంది. ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు పది శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టు డీలర్లు వారికి దగ్గరగా ఉండే రైతులకు ముందుగానే చెబుతున్నారు.
ఒకవేళ ధరలు పెరిగితే ఖరీఫ్ సాగుపై అదనపు భారం పడనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌలు రైతులు కలుపుకొని మొత్తం సుమారు ఆరు లక్షల మంది రైతులు ఉండగా, ప్రతీ సీజన్‌లో 4 నుంచి 5లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తుండగా, అందులో 60నుంచి 70శాతం వరకు రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే చివరి ఆయకట్టు రైతులు రబీపై ఆశలు వదులుకుంటుండగా, ఖరీఫ్ సాగుపై ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలో ఎరువుల ధరలు పెరిగితే రైతులకు మరింత అదనపు భారం తప్పదు. ఇప్పటికే అప్పులు చేసి సాగు చేస్తూ కుదేలవుతున్న రైతాంగానికి ఎరువుల ధరలు ‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డ’ చందంగా మారనుంది. ప్రతి సీజన్‌లో పెట్టుబడులకు కోసం నానా అవస్థలు పడుతుండగా, ఎరువుల ధరలు పెంచితే సాగు మరింత భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ఎరువుల ధరలపై మాత్రం అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కాగా, ధరలు పెరిగితే మాత్రం ప్రభుత్వం అందించే ఎకరానికి రూ.4వేలను రూ.6వేల వరకు పెంచితే కొంతమేర రైతులకు ఊరట కలుగుతుందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ఎరువుల ధరలు పెరుగుతాయో, పెరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూద్దాం.