బిజినెస్

ఈ-వే బిల్లుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఎలక్ట్రానిక్ వే బిల్లులను (ఈ-వే బిల్లులను) జారీ చేసే పద్ధతిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి శనివారం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఈ-వే బిల్లులు తప్పనిసరి. అయితే, వ్యాపార సంస్థలకు పన్ను రిటర్న్‌లు సమర్పించే ప్రక్రియను సరళతరం చేసే అంశంలో ఏకాభిప్రాయానికి రావడంలో జీఎస్‌టీ మండలి విఫలమయింది. పన్ను రిటర్న్‌లు సమర్పించే ప్రక్రియను సరళతరం చేసే అంశంపై రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ప్రస్తుత ఫైలింగ్ పద్ధతినే మరో మూడు నెలల పాటు కొనసాగించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. అయితే, పన్ను రిటర్న్‌ల ఫైలింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి మంత్రుల బృందం కసరత్తు చేస్తుంది.
పన్ను రిటర్న్‌లు సమర్పించే విధానం సరళతరంగా ఉండాలని కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులు కోరారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పన్ను ఎగవేతను నిరోధించాలని కూడా వారు కోరారని మంత్రి చెప్పారు. ‘పన్ను రిటర్న్‌లపై విస్తృతమైన చర్చ జరిగింది. ప్రతి నెల ఒకే రిటర్న్ ఉండాలని జీఎస్‌టీ మండలి అభిప్రాయపడింది. అది కూడా సరళతరంగా, పన్ను ఎగవేయడానికి వీలు లేకుండా ఉండాలని భావించింది. అయితే, దీనిని మరింత సరళతరం ఎలా చేయాలనే అంశంపై చర్చలు జరగాల్సి ఉంది. అందువల్ల, ఈ రోజు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మరో మూడు నెలలు కొనసాగించడం జరిగింది’ అని జీఎస్‌టీ మండలి సమావేశానంతరం జైట్లీ విలేఖరులకు చెప్పారు. దీంతో వ్యాపార సంస్థలు జూన్ నెల వరకు సమ్మరి సేల్స్ రిటర్న్స్ జీఎస్‌టీఆర్-3బీ, ఫైనల్ సేల్స్ రిటర్న్స్ జీఎస్‌టీఆర్-1లు సమర్పించవలసి ఉంటుంది. రాష్ట్రాల మధ్య వస్తు రవాణాకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ-వే బిల్లు పద్ధతిని అమలు చేయడం జరుగుతుందని జైట్లీ తెలిపారు. అయితే, రాష్ట్రం లోపల వస్తు రవాణాకు ఈ-వే బిల్లు పద్ధతిని అమలు చేయడం ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుందని, అన్ని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించి దశలవారీగా దీనిని అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మొదటి దశలో ఏప్రిల్ 15నుంచి అమలు చేయనున్న రాష్ట్రాలను ఏప్రిల్ ఏడో తేదీన నిర్ణయించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అయితే, అన్ని రాష్ట్రాలు జూన్ ఒకటో తేదీ నాటికి రాష్ట్రం లోపల వస్తు రవాణాకు ఈ-వే బిల్లు పద్ధతిని అమలు చేయవలసి ఉంటుందని జైట్లీ తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పక్కన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా, ఆర్థిక శాఖ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా