బిజినెస్

‘ఫ్రీడమ్-251’ వచ్చేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: దేశంలో కారు చౌకగా స్మార్ట్ఫోన్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించి ఐదు నెలల క్రితం పెను దుమారంలో చిక్కుకున్న నోయిడా సంస్థ ‘రింగింగ్‌బెల్స్’ శుక్రవారం నుంచి ఈ ఫోన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గురువారం స్పష్టం చేసింది. ‘ఫ్రీడమ్-251’ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ ఫోన్‌ను అత్యంత కారు చౌకగా కేవలం 251 రూపాయలకే అందజేస్తామని ‘రింగింగ్ బెల్స్’ ఫిబ్రవరిలో ప్రకటించడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు వెర్రిగా ఎగబడి దాదాపు 30 వేల మంది అడ్వాన్సులు చెల్లించగా, మరో 7 కోట్ల మందికి పైగా ఈ ఫోన్ల కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ‘ఫ్రీడమ్-251’ ప్రోటోటైప్ (నమూనా)ను మీడియాకు పంపగా, మరో కంపెనీ తయారు చేసిన ఈ ఫోనుపై ‘రింగింగ్ బెల్స్’ తన లోగోను ముద్రించుకున్నట్లు తేలడంతో కొనుగోలుదారులు గగ్గోలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసు, ఆర్థిక శాఖ అధికారులు దర్యాప్తునకు ఉపక్రమించడంతో ఫ్రీడమ్-251 ఫోన్ల అమ్మకాలను నిలిపివేయడంతో పాటు ఈ ఫోన్లను బుక్ చేసుకున్న కొనుగోలుదారులకు డబ్బు వాపసు ఇచ్చేస్తామని ‘రింగింగ్‌బెల్స్’ ప్రకటించాల్సి వచ్చింది.
అయితే లాటరీ ద్వారా ఎంపిక చేసిన కొనుగోలుదారులకు త్వరలో 2 లక్షల ఫ్రీడమ్-251 స్మార్ట్ఫోన్లను అందజేస్తామని గత వారం ప్రకటించిన రింగింగ్‌బెల్స్ సంస్థ డైరెక్టర్ మొహిత్ గోయల్ శుక్రవారం నుంచి ఈ ఫోన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు తాజాగా స్పష్టం చేశాడు. 9,990 రూపాయల ధర నిర్ణయించిన ఎల్‌ఇడి టెలివిజన్‌తో పాటు మరికొన్ని కొత్త ఫోన్లను ఆవిష్కరించేందుకు గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. వాస్తవానికి జూన్ 30వ తేదీ నుంచి 2 లక్షల ఫ్రీడమ్-251 హ్యాండ్‌సెట్ల పంపిణీని ప్రారంభిస్తామని గత నెలలోనే ప్రకటించిన ‘రింగింగ్‌బెల్స్’ తొలి విడతగా రాష్ట్రాల్లోని వినియోగదారులకు తొలి విడతగా 10 వేల ఫోన్లను అందజేస్తామని పేర్కొంది. అయితే ప్రస్తుతం తొలి విడతలో అందజేయనున్న హ్యాండ్‌సెట్ల సంఖ్యను ఆ సంస్థ 5 వేలకు కుదించింది. ‘జూలై 8వ తేదీన మొదటి బ్యాచ్‌లో 5 వేల ఫ్రీడమ్-251 ఫోన్లను పంపిణీ చేస్తామని, ఈ ఫోన్లను కొనుగోలు చేయదల్చుకున్నవారు 40 రూపాయల బట్వాడా రుసుము (డెలివరీ చార్జి) సహా మొత్తం 291 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని మొహిత్ గోయల్ తెలిపాడు. తైవాన్ నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలతో ఈ ఫోన్లను రూపొందించడం జరిగిందని, 1,180 రూపాయలకు అమ్మాల్సిన ఈ ఫోన్‌ను కేవలం 251 రూపాయలకే అమ్ముతుండటం వలన తమ సంస్థ ప్రతిఫోన్‌పై 930 రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటోందని, అయితే అప్లికేషన్ డెవలపర్లతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయ రూపంలో 700 నుంచి 800 రూపాయల మేరకు నష్టాన్ని భర్తీ చేసుకోగలుగుతామని ఆయన వివరించాడు. అయితే ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే తాము ఇంతకుముందు ప్రకటించినట్లుగా 2 లక్షల ఫ్రీడమ్-251 స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పాడు. ప్రభుత్వం నుంచి సహకారం అందకకపోయినా కూడా రిజిస్టర్ చేసుకున్న ప్రజలకు 2 లక్షల హ్యాండ్‌సెట్లను అందజేస్తామని, అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపాడు.
ఆరు కొత్త ఫోన్ల ఆవిష్కరణ
ఇదిలావుంటే, రింగింగ్‌బెల్స్ సంస్థ 699 రూపాయల నుంచి 999 రూపాయల ధరతో నాలుగు కొత్త ఫీచర్‌ఫోన్లను, 3,999 నుంచి 4,499 రూపాయల ధరతో మరో రెండు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను గురువారం ఆవిష్కరించింది. అలాగే మూడు పవర్ బ్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సంస్థ ఆగస్టు 15వ తేదీన రూ.9,900 ధరతో హైడెఫినిషన్ ఎల్‌ఇడి టీవీని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

చిత్రాలు.. ఫ్రీడమ్-251,స్మార్ట్ ఫోన్‌
ఫ్రీడమ్-9900 ఎల్‌ఇడి టీవీని ఆవిష్కరిస్తున్న రింగింగ్‌బెల్స్ ప్రతినిధులు