బిజినెస్

‘హద్దు’ల్లేని వడ్డీ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఆగస్టు 11: మధ్య తరగతి ప్రజల అవసరాలే ఆసరాగా చేసుకొని, వారికి ఉన్న కొద్దిపాటి ఆస్తులనే తనఖాగా పెట్టుకొని జరుగుతున్న వడ్డీ వ్యాపారం సరిహద్దుల ఎల్లలు చెరిపివేస్తూ, జగిత్యాల నుంచి రాష్టమ్రంతా విస్తరిస్తున్నది. అంతర్ రాష్ట్ర వ్యాపారంగా మారింది. పిల్లల చదువుకోసం కొందరు.. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం మరి కొందరు.. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పొట్టచేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు బతుకుజీవనం కోసం వెళ్లే యువకులు కూడా ఏజెంట్లకు సొమ్ము చెల్లించేందుకు మరో మార్గం లేక వడ్డీ వాపారుల వద్దకే వెళుతున్నారు. గృహ అవసరాలుసహా రకరకాల ఆర్థిక సమస్యలతో సామాన్యుడు అప్పులు చేయక తప్పడం లేదు. కానీ, ఒకసారి వడ్డీకి అప్పుతీసుకున్న తర్వాత ఆ ఊబి నుంచి బయట పడడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. వడ్డీలు కట్టలేక, ఆస్తులను విడిపించుకోలేక అల్లాడుతున్న వారే అధికం. బ్యాంకుల్లో రుణాలు పొంద డానికి సవాలక్ష నిబంధనలు పెడుతుండడంతో గత్యంతరం లేకనే పలువురు మధ్య తరగతి వారు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నది కఠోర వాస్తవం. వీరి అవసరాలే ఆసరాగా నెలకు మూడు నుంచి పది రూపాయల వడ్డీని వ్యాపారులు వసూలు చేస్తున్నారు. అసలు మాట పక్కకు ఉంచి, వడ్డీ కట్టడం కూడా అనుకున్నంత సులభం కాదని తెలిసినప్పటికీ, మరో మార్గం లేకపోవడంతో మధ్య, దిగువ, పేద వర్గాలకు వీరిని ఆశ్రయించక తప్పని పరిస్థితి. తీసుకున్న రుణం అసలుతోపాటు వడ్డీ చెల్లించలేక, తనఖా పెట్టిన ఆస్తులు తిరిగి పొందలేక సతమతవౌతున్న వారి సంఖ్యకు అంతే లేదు. కాగా, జగిత్యాల కేంద్రంగా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతూ, రాష్ట్ర, అంతర్-రాష్ట్ర స్థాయికి విస్తరించడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీస్‌లు మెరుపుదాడులు చేసినట్టు తెలిసింది. జిల్లాలోని కోరుట్లలో అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురి అదుపు లోకి తీసుకోవడంతోపాటు రికార్డులు, ప్రామిసరీ నోట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, భారీ నగదును స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే, జగిత్యాల జిల్లా నుండి అంతర్ రాష్ట్ర స్థాయి వరకు వడ్డీ వ్యాపారాన్ని కొంత మంది జోరుగా సాగుతున్నారన్న సమాచారం వెలుగుచూసింది. వడ్డీ వ్యాపారుల నుండి తీసుకున్న అప్పులకు భారీ వడ్డీలు కట్ట లేక ఎందరో బాధితులు అన్ని విధాలా నష్టపోతున్న సంఘటనలు బహిర్గతం కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారని, వారి సూచనలతోనే వడ్డీ వ్యాపారులపై దాడులు చేస్తున్నామని పేరు పోలీస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. బాధితులకు కొంతవరకైనా విముక్తి కల్పించేందుకే పోలీసులు దాడులు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే, అడపా దడపా దాడులు జరిగినప్పుడు సద్దుమణిన వడ్డీ వ్యాపారం మళ్లీ పురుడుపోసుకుంటూ జోరుగా సాగడం ఆనవాయితీగా మారింది. గత కొనే్నళ్లుగా జరుగుతున్న ఈ వడ్డీ వ్యాపారానికి ఆద్యులైన వారు తమ ఏజెంట్లతో వ్యాపారాన్ని జోరుగా సాగిస్తూ, సామాన్యులపై మోయరాని భారాన్ని మోపుతున్నారన్నది వాస్తవం. రుణ గ్రహీతల నుంచి ఏడాది లోపు డబ్బు చెల్లించేట్లుగా దస్తావేజులు రాయించుకోవడం, అవసరం ఉన్నవారు ఆ సమయంలో చేసేదేమీ లేక గండం నుంచి గట్టెక్కితే చాలు అన్నట్టుగా ఒప్పుకుంటూ అధిక వడ్డీకి వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకోవడం సర్వసామాన్యం. కానీ, ఆతర్వాత ఆర్థికంగా చితికిపోయి, వడ్డీ కూడా కట్టలేని స్థితికి వారు చేరుకున్నప్పుడు, తమ వద్ద తనఖా కింద ఉన్న ఆస్తులను తమ పేరిటే వడ్డీ వ్యాపారులు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. నిర్దేశించిన గడువులోపు తీసుకున్న సొమ్మును అసలు, వడ్డీతో సహా చెల్లించకపోతే, వారి ఆస్తులను వడ్డీ వ్యాపారులు స్వాధీనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సమస్యల తో వివాదాలు తలెత్తడం వల్లనే బాధితులు పోలీసుల ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితికి తెరపడి, సామాన్యుడు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి. నిబంధనలను ఎంతోకొంత సరళీకృతం చేయాలి. లేకపోతే, వడ్డీ వ్యాపారంతో నడ్డి విరిగిన సామాన్యుడు దిక్కుతోచని స్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు.