బిజినెస్

జీఎస్‌టీతో సత్ఫలితాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విపక్షాలు ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నప్పటికీ, వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ) సత్ఫలితాలనిస్తుందని కేంద్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. ‘ఒకే దేశం.. ఒకే పన్ను’ అనే నినాదంతో 2017 జూలై ఒకటిన కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈ చట్టం ప్రకారం పన్ను లెక్కింపు, చెల్లింపుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో విపక్షాలు నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు సంధించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని జీఎస్‌టీని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా అభివర్ణించారు. బాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన షోలే సినిమాలో విలన్ గబ్బర్ సింగ్ ఇష్టానుసారంగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తుంటాడు. కేంద్రం కూడా జీఎస్‌టీ పేరుతో అదే తరహాలో పన్నులు వసూలు చేస్తున్నదని కాంగ్రెస్‌తోపాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు దుయ్యబడుతున్నాయి. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలన్నీ జీఎస్‌టీని ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. ఒకే పన్ను అని చెప్తూనే, నాలుగు రకాల స్లాబ్‌లను అమలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే, జీఎస్‌టీ విధానాన్ని అర్థం చేసుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, గత ఏడాది నుంచి పకడ్బందిగా అమలు చేస్తుండడంతో, క్రమంగా అంతా జీఎస్‌టీని అర్థం చేసుకుంటున్నారని కేంద్రం భావిస్తున్నది. భారత్‌లో జీఎస్‌టీని అమలు చేయడానికి ముందు, ప్రపంచ దేశాల్లో చివరిగా దీనిని చట్టంగా తీసుకొచ్చిన దేశం మలేసియా. దేశ వ్యాప్తంగా జీఎస్‌టీని అమలు చేసేందుకు అప్పటి సర్కారుకు రెండేళ్లు పట్టింది. అయితే, జీఎస్‌టీ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని, అక్కడి కొత్త సర్కారు దీనిని రద్దు చేసింది. మలేసియా తర్వాత జీఎస్‌టీని మన దేశమే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం తెరపైకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నది. ఎన్నో అద్భుత ఫలితాలను రాబట్టడానికి, పన్నుల విధానం సంక్లిష్టంగా కాకుండా, సరళంగా ఉండడానికి జీఎస్‌టీ చట్టం అత్యవసరమని కేంద్రంలోని ఎన్టీఏ సర్కారు నమ్ముతోంది. యూకే, సింగపూర్ వంటి దేశాల్లో జీఎస్‌టీ అమల్లో ఉంది. ఆ రెండు దేశాల్లోనూ ఎక్కడైనా ఒకే పన్ను ఉంటుంది. అలాంటి విధానమే మన దేశంలోనూ ఉండాలన్నది విపక్షాల వాదన. కానీ, భౌగోళికంగా, ఆర్థికంగా తీవ్ర వ్యత్యాసాలున్న భారత్ వంటి పెద్ద దేశాల్లో, అంతటా ఒకే పన్ను సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేస్తున్నది. అందుకే, వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని, నాలుగు స్లాబ్స్‌లో జీఎస్‌టీని వసూలు చేస్తున్నది. మొదట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, క్రమంగా అవి కుదుటపడుతున్నాయని కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పన్ను చెల్లింపు విధానం గాడిలో పడుతున్నదని, గతంతో పోలిస్తే పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగిందని వారు అంటున్నారు. ఈశాన్య ప్రాంతాలుసహా కొన్ని చోట్ల జీఎస్‌టీని వసూలు చేయడం లేదని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు స్లాబ్స్ ఉన్నాయని, గత ఏడాది నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రావడంతో, పరిస్థితి సానుకూలంగా మారుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు. పరోక్ష పన్ను విధానం స్థిరపడుతున్నది గణాంకాలను ఉటంకిస్తున్నారు. సుమారు దశాబ్దకాలం పార్లమెంటులో చర్చలకే పరిమితమైన జీఎస్‌టీ ఎట్టకేలకు రెండున్నర ఏళ్ల క్రితం ఆమోద ముద్ర వేయించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జీఎస్‌టీ ఒక చర్చాంశంగా మారిపోయింది. అయితే, పన్ను ఎగవేతదారులు ఎక్కువగా ఉన్న దేశంలో జీఎస్‌టీ వల్లే మార్పు సాధ్యమైందని నిపుణులు సైతం అంటున్నారు. గత ఏడాది నుంచి పన్ను చెల్లింపు గాడిలో పడుతున్నది. పన్ను చెల్లింపుదారులు పెరిగారు. జీఎస్‌టీ కమిటీ పదేపదే సమాశాలను నిర్వహించి, లోటుపాట్లను సవరించుకుంటూ వస్తున్నది. ఇటీవల కూడా కొన్ని వస్తుసేవలపై పన్నును తగ్గించింది. ఫలితంగా, ప్రస్తుతం 28 శాతం పన్ను విధించే వస్తుసేవల జాబితాలో సుమారు డజను మాత్రమే ఉన్నాయి. ఇలావుంటే, భారీ మొత్తాల్లో లావాదేవీలు జరిగే లేదా అత్యధిక శాతం పన్ను చెల్లించాల్సి వచ్చే ఇంధనం, విద్యుత్, భూమి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు ఇప్పటికీ జీఎస్‌టీ పరిధిలోకి రాలేదు. వీటిని కూడా జాబితాలో చేర్చాలన్న డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తున్నది. ప్రత్యేకించి పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలని అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఇటు సామాన్య ప్రజలు కోరుతునే ఉన్నారు. కానీ, ప్రభుత్వ ధోరణి మాత్రం మరో విధంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన ఆర్థిక అంశాల కారణంగా ప్రజల డిమాండ్‌కు మోక్షం లభించడం లేదన్న వాదన కూడా ఉంది. ఇలావుంటే, స్థూల జాతీయోత్పత్తిపై జీఎస్‌టీ ప్రభావం పెద్దగా కనిపించడం లేదన్నది వాస్తవం. ఆర్థిక మాంద్యం సమస్యకు జీఎస్‌టీ సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నది. వస్తుసేవల వినియోగంపై పన్ను సరళంగా ఉండాలేగానీ, మరింత గందరగోళ పరిస్థితులను తెచ్చేదిగా ఉండకూడదని ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం వంటి కొన్ని వస్తువులపై గతంలో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధించినప్పటికీ, రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు మరికొంత మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేసేవి. జీఎస్‌టీ వల్ల ఈ విధానానికి తెరపడిందా? అంటే, లేదనే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఇంకా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో ప్రశ్నలకు జవాబులు రావాలి. అప్పటి వరకూ జీఎస్‌టీలో మార్పులుచేర్పులు జరుగుతునే ఉండాలి. క్రమంగా మంచి ఫలితాలనిస్తున్న జీఎస్‌టీ ద్వారా త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని కేంద్ర ఉన్నతాధికారులు ఆశాభావంతో ఉన్నారు. మొత్తం మీద వివాదాలకు మారుపేరుగా మారిన జీఎస్‌టీ ఎప్పటికి అనుకున్న స్థాయిలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతుందనే ప్రశ్నకు సమాధానం కోసం మరికొంత సమయం వేచి ఉండక తప్పదు.