బిజినెస్

‘అనంత’ కీర్తి కిరీటంలో ‘కియా’ కలికితురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే తొలిసారిగా దక్షిణ కొరియా కార్ల దిగ్గజం ఏర్పాటు చేసి కియా కంపెనీ జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి కాబోతోంది. ఈ కంపెనీ ఇండియాలో తయారుచేసిన తన తొలికారును ఈ నెల 29వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. జిల్లాలోని అమ్మవారుపల్లిలో 535.5 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో కియా మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(కేఎంఐపీఎల్) పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియాలోని సియోల్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన కియా 1944 నుంచి వాణిజ్యపరమైన కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టును అమ్మవారుపల్లి వద్ద ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ మార్చి నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తికి శ్రీకారం చుట్టి, అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో కార్లను ఉత్పత్తి చేయబోతోంది. సాంకేతికంగా కార్ల తయారీకి కియా ఇండియా యూనిట్ సిద్ధం అవుతుండటంతో ట్రయల్ ప్రొడక్షన్‌లో తొలికారును సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం కియాలో జిల్లా కలెక్టర్ జీ.వీరపాండ్యన్ పర్యవేక్షణలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు అదే కారులో ప్రయాణించడంతో పాటు స్వయంగా నడపనున్నారు. కాగా 2017 ఏప్రిల్ 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కియా(కేఐఏ) మోటార్స్ కార్పొరేషన్(ప్రస్తుత కేఎంఐపీఎల్) మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. ఈ కంపెనీ ఏర్పాటుకు మొత్తం రూ. 13వేల కోట్లు(400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నారు. ఈ యూనిట్‌లో ప్రాథమికంగా ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం కాగా, అన్ని హంగులూ సమకూర్చుకున్న అనంతరం ఏడాదికి 4 లక్షల కార్ల ఉత్పత్తి స్థాయికి పెంచేందుకు కంపెనీ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 4వేల శాశ్వత ఉద్యోగాలతో పాటు అదనంగా 7 వేల మందికి టెంపరరీ ఉద్యోగాలు కల్పించనున్నామని సీఎం చంద్రబాబు ఇది వరకే ప్రకటించారు. కాగా స్థానిక జిల్లా వాసులకే 100 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ తెలిపారు. తొలికారు ఆవిష్కరణ సందర్భంగా స్థానికంగా భూములిచ్చిన రైతు కుటుంబాలతో పాటు ఐటీఐ చేసిన ఉద్యోగార్థులను నియమించారు. అవసరమైన ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. కాగా మెయిన్ ప్రాజెక్టు 535.5 ఎకరాలు, టౌన్ షిప్ 36 ఎకరాలు, శిక్షణ కేంద్రం 11.2 ఎకరాలు, హిల్‌లాక్ 91.22 ఎకరాలు, అప్రోచ్ టు హిల్ లాక్ 1.65 ఎకరాలు కేటాయించారు. అలాగే కియాకు సంబంధించి 40 అనుబంధ పరిశ్రమలకు 250 ఎకరాలు గుడిపల్లి, అమ్మవారుపల్లి గ్రామాల్లో సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్లైడింగ్‌కు 100 ఎకరాలు, ట్రక్ టెర్మినల్ కోసం 48.47 ఎకరాలు కేటాయించే పనులు పురోగతిలో ఉన్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ వీ.గోపీకృష్ణ నివేదిక సమర్పించారు.
నాలుగు రంగుల్లో కియా కార్లు
అందిన సమాచారం మేరకు కియా కారును 4 రంగుల్లో ఉత్పత్తి చేయనున్నారు. మెటాలిక్ ఆరెంజ్, ఎస్పీ-2ఐ, ఎస్‌యువీ కార్లను సీఎం చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. అయితే ఇక్కడ ఉత్పత్తి అయ్యే కార్ల ధరలను కియా సంస్థ ఇంకా నిర్ణయించలేదు. వేరియంట్, ఫీచర్స్ వంటివి కూడా గోప్యంగానే ఉంచారు. సాంకేతిక పరమైన అంశాలను ఈ నెల 29వ తేదీ కారు విడుదల సందర్భంగా బహిర్గతం చేయనున్నట్లు సమాచారం. కాగా ఒక్కో కారు ధర సుమారు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. భారత విపణిలో స్పోర్ట్స్ యుటిలిటీ కార్ల పోటీని తట్టుకునేలా మేడిన్ ఏపీగా కియా కారు మార్కెట్లోకి రానుంది. కాగా ప్రతి 6 నెలలకో కొత్త మోడల్ కారు మార్కెట్లోకి విడుదల చేసేలా విధి విధానాలు రూపొందించినట్లు ఇప్పటికే కియా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.