బిజినెస్

‘పతంజలి’ పరిశ్రమల ఊసేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పసుపు పంట సాగయ్యే నిజామాబాద్ జిల్లాలో సరైన ప్రోత్సాహం అందక ఈ పంటను సాగు చేసే రైతులు నీరసించిపోతున్నారు. ఓ వైపు మద్దతు ధర అందక, మరోవైపు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయని పరిస్థితుల్లో, కనీసం పసుపు ఆధారిత పరిశ్రమలైనా ఏర్పడితే తమకు ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుందని ఆశించిన స్థానిక రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్‌తో పాటు జగిత్యాల జిల్లాలలో రైతులు అధిక విస్తీర్ణంలో పసుపు పంటను సాగు చేస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటు విషయమై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతును కూడగట్టి కేంద్రానికి లేఖలు రాయించడం, పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం, అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞాపనలు అందించారు. ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి సుగంధ ద్రవ్యాల తరహాలోనే పసుపు బోర్డు ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన దృష్టికి తెచ్చారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం నుండి స్పష్టత కరువైంది. ఇకపై కూడా సమీప భవిష్యత్తులో దానిని ఏర్పాటు చేస్తారనే నమ్మకం రైతుల్లోనూ ఏ కోశానా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోమారు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన బాటలో పయనించాలని అన్నదాతలు సమాయత్తం అవుతున్నారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఓ వైపు పోరాటం కొనసాగిస్తూనే, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పసుపు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఎం.పీ కవిత, దేశంలోనే పేరెన్నికగన్న పతంజలి సంస్థచే స్థానికంగా పసుపు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయించాలనే ప్రయత్నాలు సైతం జరిపారు. రెండున్నరేళ్ల క్రితమే ఢిల్లీలో యోగా గురువు రాందేవ్‌బాబాను స్వయంగా కలిసి పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు నిజామాబాద్ జిల్లాలో ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, తద్వారా సంస్థ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవడమే కాకుండా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లవుతుందని ప్రతిపాదించారు. దీంతో కవిత అభ్యర్థన మేరకు పతంజలి సంస్థల సీఈఓ బాలకృష్ణ 2017 నవంబర్ మాసంలో ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఎంపీ కవితతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఉద్యానవన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు ఆయనతో సమావేశమై చర్చలు సైతం జరిపారు. ఏటా 25వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో పసుపు పండిస్తారని, దీనికి అనుగుణంగా స్థానికంగా పరిశ్రమలు నెలకొల్పితే అన్ని విధాలుగా బాగుంటుందని, ఇందుకోసం ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో తోడ్పాటును అందేలా చూస్తానని, సింగిల్ విండో విధానంలో అనుమతులు లభించేలా తానే స్వయంగా చొరవ చూపుతానని ఎంపీ కవిత హామీ ఇచ్చారు కూడా.. అన్నింటికీ మించి నందిపేటలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కింద సేకరించిన నాలుగు వందల పైచిలుకు ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఆ స్థలంలో పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని వెసులుబాటు కల్పించారు. ఇది జరిగిన కొన్ని నెలల అనంతరం యోగా శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు నిజామాబాద్‌కు హాజరైన యోగా గురువు రాందేవ్‌బాబా కూడా ఈ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలోనే స్థానికంగా పతంజలి సంస్థ ద్వారా పసుపు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే, ఇది జరిగి దాదాపు ఏడాది కాలం పూర్తి కావస్తున్నా, పతంజలి సంస్థ తరఫున పసుపు ఆధారిత పరిశ్రమలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఏర్పాటు చేసేందుకు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అరకొరగానే మద్దతు ధర లభిస్తున్న నేపథ్యంలో, అటు పతంజలి సంస్థ కూడా పరిశ్రమల ఏర్పాటు దిశగా ఎలాంటి ప్రకటన చేయకుండా మిన్నకుండిపోవడం పసుపు రైతులను ఉసూరుమనిపిస్తోంది.
చిత్రం.. నిజామాబాద్ మార్కెట్ యార్డుకు రైతులు తరలించిన పసుపు పంట