బిజినెస్

మధ్యంతర డివిడెండ్‌ను డిమాండ్ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: మధ్యంతర డివిడెండ్‌ను కోరడానికి, ఆ నిధులను అవసరమైన వాటికి ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఉర్జిత్ పటేల్ నిష్క్రమణ అనంతరం ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన దాస్ సైతం ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య ఉన్న విభేదాలను కొనసాగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంవత్సరానికి 6వేల రూపాయల వంతున 120 మిలియన్ల మంది పేద రైతులకు నగదు చెల్లింపులు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై అభిప్రాయం కోరగా ‘నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంద’ని దాస్ పేర్కొన్నారు. ఓవైపు రైతులకు నగదు బదిలీపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్న తరుణంలో గడచిన డిసెంబర్ నుంచే ఈ పథకం అమలయ్యేలా కేంద్రం నిర్ణయించడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే 20వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని పూడ్చుకునేందుకు కేంద్రం మధ్య తరగతిపై సుమారు రూ.22వేల కోట్లమేర పన్నుల బాదుడుకు పాల్పడే అవకాశాలున్నాయని విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఈ నిర్ణయం వల్ల పెద్దయెత్తున బడ్జెట్ లోటును సైతం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారని విలేఖరులు ఆర్బీఐ గవర్నర్ దృష్టికి తేగా ‘అదనపుమధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించడం ఆర్బీఐ చట్టంలో అంతర్భాగమే. అలా న్యాయ పరమైన అవకాశాలున్నప్పుడు మేము దాన్ని అతిక్రమించలేమ’ని దాస్ స్పష్టం చేశారు. కాగా 28వేల కోట్ల రూపాయలు మధ్యంతర డివిండెండ్‌గా ఆర్బీఐని కోరుతామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేయగా ‘ఈ నెల 18న జరిగే ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఆ విషయంపై చర్చించడం జరుగుతుంద’ని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. తాజా కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు దాస్ స్పందిస్తూ ‘రైతులు ఆర్థికంగా బలపడితే దేశ ఆర్థిక పరిస్థితి బలహీన పడుతుందని తాను భావించడం లేద’ని వ్యాఖ్యానించారు. బహుశా అది మేథావులు సృష్టించే ద్రవ్యోల్బణం కావచ్చన్నారు. అలాగే ఆర్థిక లోటును పూడ్చే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే అంశాలకు సైతం ఆర్బీఐ ప్రాధాన్యత నిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక బలోపేతానికి సంబంధించిన విషయంపై ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. అలాగే ఇప్పటికే తీసుకున్న ప్రభుత్వ విధాన నిర్ణయాల ప్రభావం ఆర్బీఐపై ఎలావుంటుందన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తూ వ్యవసాయ రుణాల మాఫీ వంటి ప్రయోజనకర అంశాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ యత్నిస్తుందని, అందులో భాగంగానే కీలక రేట్లలో 0.25 శాతం కోతపెట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఖర్చులు, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లు పెరుగుతాయని ఆర్బీఐ అంచనా వేస్తోందని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు, అలా పెరగడం సైతం ఆర్థికాభివృద్ధికి సంకేతమన్నారు. మూలధన నిల్వలను బలోపేతం చేయాలన్న ఆలోచనతోనే ఇప్పటికే మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి చర్యలు తీసుకోవడం జరిగిందని, మిగిలిన 8 బ్యాంకుల విషయంలో కూడా వాటి పనితీరు, బ్యాలెన్స్ షీట్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టడం జరుగుతుందని దాస్ స్పష్టం చేశారు.