బిజినెస్

ఆహారం భారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని 6 శాతాన్ని మించనివ్వబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణానికి సంబంధించి నూతన లక్ష్యాన్ని 4 శాతంగా నిర్దేశించుకున్న నేపథ్యంలో పేదవాడి కంచాన్ని ఖరీదు కానివ్వబోమని చారిత్రక ఎర్రకోట సాక్షిగా మోదీ హామీ ఇచ్చారు. మూడు పూటలా తినేలా చూస్తామని, అందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటానన్నారు. సోమవారం 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఇక్కడ ప్రసంగించిన ప్రధాని.. దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రెండంకెల స్థాయిలో ద్రవ్యోల్బణం కదలాడిందని గుర్తుచేశారు. కానీ తమ పరిపాలనలో ఏ రకంగానూ ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటబోదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)తో ద్రవ్యవిధాన ఒప్పందం లో భాగంగా రాబోయే ఐదేళ్లలో ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 4 శాతంగా నిర్దేశించుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో గరిష్ఠ పరిమితిని 6 శాతంగా పేర్కొన్న సర్కారు.. కనిష్ట పరిమితిని 2 శాతంగా చెప్పింది. కాగా, గత నెల జూలైలో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.07 శాతంగా నమోదవగా, దాదాపు గడచిన రెండేళ్లలో ఇదే అత్యధికం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వస్తే ఇది మరింత పెరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై మోదీ లక్ష్యం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా, జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, జిడిపి వృద్ధిరేటు పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. సుధీర్ఘకాలం అనంతరం మార్పులు, చేర్పులతో ఈ చారిత్రాత్మక బిల్లుకు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం పలికినది తెలిసిందే. జిఎస్‌టితో ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఆచరణలో ఉంటుం ది. ఫలితంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద సింగిల్ మార్కెట్‌గా అవతరించింది. ఈ క్రమం లో జిఎస్‌టి బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సమానమైన పన్నులకు నాంది పలికే జిఎస్‌టి బిల్లు.. దేశ ఆర్థిక వ్యవస్థ తలరాతను మార్చుతుందని అభివర్ణించారు.
ఇక ఎల్‌ఇడి బల్పులతో 1.25 లక్షల కోట్ల రూపాయల విద్యుత్ వ్యయం ఆదా అవుతుందని మోదీ చెప్పా రు. ఎల్‌ఇడి బల్బుల వినియోగం పెరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలను చేపడుతున్నామన్న ఆయన ఇందులోభాగంగానే ప్రభుత్వ జోక్యంతో 350 రూపాయలుగా ఉన్న ఎల్‌ఇడి బల్బు ధర.. ప్రస్తుతం 50 రూపాయలకు వచ్చిందన్నారు. ఇప్పటికే 13 కోట్లకుపైగా ఎల్‌ఇడి బల్బులను పంపిణీ చేశామని, 77 కోట్ల బల్బుల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. తద్వారా 20,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గుతుందని, ఇది 1.25 లక్షల కోట్ల రూపాయలతో సమానమన్నారు. ఎల్‌ఇడి బల్బుల వాడకంతో ఆర్థిక ప్రయోజనాలేగాకుండా, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని చెప్పారు. వీటి వినియోగంతో వాతావరణంలో కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుందని, గృహ వినియోగం, వీధి దీపాల వినియోగంలో విద్యుత్‌ను 50 నుంచి 90 శాతం వరకు ఆదా చేయవచ్చన్నారు.
మరోవైపు రాబోయే మూడేళ్లలో పేదలకు ఉచితంగా 5 కోట్ల వంటగ్యాస్ (ఎల్‌పిజి) కనెక్షన్లను అందించే దిశగా ముందుకెళ్తున్నట్లు మోదీ చెప్పారు. ఇప్పటికే గడచిన 100 రోజుల్లో దాదాపు 50 లక్షల గ్యాస్ కనెక్షన్లను అందించినట్లు తెలిపారు. నిరుపేదలకూ వంటగ్యాస్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్న ఆయన గత 60 ఏళ్లలో సుమారు 14 కోట్ల మందికే ఎల్‌పిజి కనెక్షన్లు ఉంటే, తాము గడచిన 60 వారాల్లోనే 4 కోట్ల మందికి కొత్తగా ఎల్‌పిజి కనెక్షన్లు ఇచ్చామని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా పేదల ఇళ్లలో గ్యాస్ ఆధారంగానే వంట జరగాలన్న లక్ష్యంతో ఈ ఏడాది మే 1న 8,000 కోట్ల రూపాయలతో ఉచిత ఎల్‌పిజి కనెక్షన్ల కార్యక్రమానికి మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో కనెక్షన్‌కు చమురు సంస్థలకు ప్రభుత్వం 1,600 రూపాయలను ఇస్తుంది. ఇలా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లను అందివ్వాలనుకుంటోంది.
ఖతార్‌తో కొత్తగా గ్యాస్ దిగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా భారత్‌కు కనీసం 20,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని మోదీ తెలిపారు. ఖతార్ నుంచి ఏటా 7.5 మిలియన్ టన్నుల ద్రవరూప సహజవాయువు (ఎల్‌ఎన్‌జి)ని భారత్ కొనుగోలు చేస్తుందని చెప్పారు. అయితే 13 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగానే ఇప్పటికీ ధరలను చెల్లిస్తున్నామని, కొత్త ఒప్పందంతో ధరలు బాగా తగ్గుతాయని వివరించారు. 2004లో ఖతార్‌కు చెందిన రాస్‌గ్యాస్ భారత్‌కు 25 ఏళ్లపాటు ఎల్‌ఎన్‌జిని సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది. దీన్ని ఇప్పుడు మార్చాలని ప్రభుత్వం ఖతార్‌తో సంప్రదింపులు జరుపుతోంది.
ఇకపోతే దేశంలో ప్రాజెక్టులకు అనుమతులను వేగవంతం చేస్తున్నామని, 7.5 లక్షల కోట్ల రూపాయల విలువైన 118 ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తున్నామని మోదీ చెప్పారు. అలాగే 10 లక్షల కోట్ల రూపాయల విలువైన 270 నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను పునరుద్ధరించే దిశగా వెళ్తున్నామని తెలిపారు. పలు కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చామని, 24 గంటలపాటు షాపుల నిర్వహణకు అనుమతిచ్చామని గుర్తుచేశారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వరంగ సంస్థలు ఎయిరిండియా, బిఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణపరమైన లాభాల్లోకి వచ్చాయని గుర్తుచేశారు. ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) పోర్టబిలిటీతో ఉద్యోగులకు లాభం చేకూర్చామని, ఉద్యోగ సంస్థలు మారినా, స్థాన చలనం కలిగినా ఒకే పిఎఫ్ ఖాతా ఉండేలా చేశామని చెప్పారు. ఈ కారణాలతో నిరుపయోగంగా ఉన్న 27,000 కోట్ల రూపాయలను వాడుకలోకి తెచ్చామన్నారు. మొత్తంగా తమ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలకు వెనుకాడేదీ లేదని మోదీ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

చిత్రం.. సోమవారం ఎర్రకోట నుంచి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ