బిజినెస్

జెట్ వాటా అమ్మకానికి రుణదాతలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ గత వైభవాన్ని సంపాదించే మార్గం కనిపించకపోవడంతో, 75 శాతం వాటాలను అమ్మేయాలని రుణదాతలు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆర్బీఐ ఈనెల 10వ తేదీలోగా బిడ్స్ దాఖలు చేయాలని ఆసక్తిగల పార్టీలకు సూచించింది. 11 ఏళ్ల క్రితం ప్రారంభమైన జెట్ ఎయిర్‌వేస్ మొదట్లో సజావుగానే నడిచినప్పటికీ, ఆతర్వాత పెరిగిన పోటీని తట్టుకోలేక, క్రమంగా నష్టాల్లోకి దిగజారింది. తొమ్మిదేళ్లుగా భారీ నష్టాలను మూటగట్టుకుంది. తెచ్చిన రుణాలను, కిరాయికి తీసుకున్న వివిధ స్థలాలు, భవనాల యజమానులకు అద్దెను చెల్లించలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నది. ఆస్తులు కూడా క్రమంగా తరిగిపోయాయి. ఒకప్పుడు 124 విమానాలు ఉండగా, ఈ ఏడాది జనవరి నాటికి కేవలం 25 విమానాలు మాత్రమే మిగిలాయి. అన్ని రకాలుగా నష్టపోయిన జెట్ ఎయిర్‌వేస్‌కు భారీగా రుణాలు సమకూర్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర రుణదాతలు ప్రత్యామ్నాయ మార్గాన్ని అనే్వషించారు. అందులో భాగంగానే 75 శాతం వాటాలను అమ్మేయాలని తీర్మానించించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జెట్ ఎయిర్‌వేస్ మళ్లీ గతంలో మాదిరి సేవలు అందించాలంటే, సుమారు 8,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆ మొత్తాన్ని సమకూర్చడానికి 75 శాతం వాటాలను అమ్మేయాలని రుణదాతలు నిర్ణయించడంతో, పదో తేదీలోగా బిడ్స్‌ను కోరుతూ ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరాంతానికి కనీసం 1,000 కోట్ల రూపాయల స్థూల విలువ కలిగి ఉండి, ఎయిర్‌లైన్ వ్యాపారంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థలు మాత్రమే బిడ్స్ వేయాలని స్పష్టం చేసింది. దేశ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా లిమిటెడ్‌కు ఉన్న గుత్త్ధాపత్యానికి గండికొట్టిన ఘనత జెట్ ఎయిర్‌వేస్‌కే దక్కుతుంది. అంతేగాక, దేశంలో రెండో అతి పెద్ద విమానయాన సంస్థగా పేరు సంపాదించింది. ఆరంభంలో అద్భుత ఫలితాలు అందుకున్న ఈ సంస్థ క్రమంగా నష్టాల్లోకి పడిపోయింది. 11 సంవత్సరాల వ్యాపారంలో ఏకంగా తొమ్మిది సంవత్సరాలు నష్టాలను ఎదుర్కోవడంతో రుణదాతలకు చెల్లింపులను దాదాపుగా నిలిపివేసింది. స్టాక్ మార్కెట్‌లోనూ జెట్ ఎయిర్‌వేస్ వాటాల విలువ దారుణంగా పడిపోయింది. గత ఏడాది 9.1 శాతం పతనమైందంటే, ఈ సంస్థపై మదుపరులకు ఎంతమాత్రం నమ్మకం ఉందో స్పష్టమవుతుంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లోనూ 1.5 శాతం పతనమైన జెట్ ఎయిర్‌వేస్ వాటా ధర 252.30 రూపాయలకు పడిపోయింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే, సంస్థకు పునరుద్ధరించడం అసాధ్యమవుతుందన్న అభిప్రాయానికి వచ్చిన రుణదాతలు వాటాల అమ్మకానికి ముందుకొచ్చారు. అబూదబీకి చెందిన ఇతిహాద్ ఎయిర్‌వేస్‌కు జెట్ ఎయిర్‌వేస్‌లో కొంత భాగస్వామ్యం ఉంది. ఈ సంస్థ మూతపడితే, 23,000 మంది తమ ఉద్యోగాలును కోల్పోతారు. ఈనెల 11 నుంచి మొదలై, ఐదు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం కోసం పోటీపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకీ జెట్ ఎయిర్‌వేస్ అంశం కీలకంగా మారింది. ఇప్పటికే, గత ఎన్నికల సమయంలో కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ చేసిన హామీని మోదీ గాలికొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్ దివాలాతీసి, మూతపడితే, వేలాది మంది ఉపాధి కోల్పోతారు. అందుకే, ఈ సంస్థలను నిలబెట్టడానికి కేంద్రం పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నదని సమాచారం. అత్యధిక వాటాలను అమ్మడం ద్వారా వచ్చిన మొత్తంలో రుణాలను చెల్లించమేడగాక, మళ్లీ సంస్థను గాడిలో పెట్టడానికి వీలు ఉంటుంది. ఈనెల 10వ తేదీలోగా బిడ్స్ వేయాలని ఎస్‌బీఐ ప్రకటించడం వెనుక, సార్వత్రిక ఎన్నికల నేపథ్యం కూడా ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది.

చిత్రం.. ముంబయిలోని ఓ మురికివాడ పక్కనే నిలిపిన జెట్ ఎయిర్‌వేస్ విమానం