బిజినెస్

రంగుల కళ.. బతుకులు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజనర్ (రాజస్థాన్), మే 5: ఇంద్రధనస్సు రంగులన్నీ వారి కళలో ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా వస్త్రాలపై డిజైన్లను వంగపండు రంగుతో ప్రారంభించి ఎరుపురంగు షేడ్‌తో ముగించే వారి కళాకృతి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది. కాని వారి జీవితాల్లోనే నల్లటి నీడే తప్ప రంగన్నది మచ్చుకైనా కన్పించదు. ఇది రాజస్థాన్‌లోని అద్దక పరిశ్రమ కార్మికుల దుస్థితి. టై, డై పనిలో వీరి ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినా తమ భవిష్యత్ అంధకారంగా ఉందని వారు వాపోతున్నారు. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు, జీఎస్టీ వీరిని మరింత కృంగదీసింది. రాజస్థాన్‌లోని షేక్వాతి ప్రాంతంలోని ఈ చిన్ని పట్టణంలో వేలాది మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. వీరు చేసే ‘బందేజ్’ పని శతాబ్దాలుగా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా వీరు చీరలు, ఇతర వస్త్రాలపై వేసే డిజైన్లు అందరినీ అబ్బురపరుస్తాయి. అయితే ఎంతో కళానైపుణ్యం చూపే వీరి బతుకులు మాత్రం కళావిహీనంగా మారాయి. చేసిన పనికి సరైన ప్రతిఫలం రాక, రోజురోజుకు అప్పులు పెరిగిపోతుండటం వీరిని కృంగదీస్తోంది. ఈ ఎన్నికలతోనైనా తమ బతుకులు మారకపోతాయా అన్న ఆశతో వీరు ఎదురు చూస్తున్నారు. చురు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సుజనార్‌లో మే ఆరున ఎన్నికలు జరగనున్నాయి. తాము చేసే పనికి లాభాల మాట దేవుడెరుగు రెండు పూటలా నోట్లోకి వేళ్లు వెళ్లలేని పరిస్థితి దాపురించిందని, జీఎస్టీ విధించిన తర్వాత మెటీరియల్ కొనుగోలు మరింత భారంగా మారిందని మంగిలాల చిపా అనే వృద్ధుడు వాపోయాడు. తన ఏడేళ్ల వయసు నుంచి ఈ పనిని చేస్తున్నానని, తనపై ఆధారపడి 22 మంది కుటుంబ సభ్యులున్నారని, తమ ప్రాంతంలో 600 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి ఉన్నాయని అయితే తాము తయారు చేసిన ‘బందేజ్’ ఉత్పత్తులను అమ్ముకోవడం రోజురోజుకు కష్టసాధ్యంగా మారుతోందన్నారు. ఇక్కడ చాలామంది నిరక్షరాస్యులు ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారని, వారందరికీ ఈ జీఎస్టీ గందరగోళం ఏమాత్రం అర్థం కావడం లేదని, అలాగని వారంతా చార్టెర్డ్ అకౌంటెంట్లను ఆశ్రయించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ఇక్కడ బాగా చదువుకున్న వారంటే పదో తరగతి పాసైన వారేనని, వారికి ఈ జీఎస్టీ లెక్కలు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. దీనికి సంబంధించి ఎవరినైనా అకౌంటెంట్‌నో, చార్టెర్డ్ అకౌంటెంట్‌నో ఏర్పాటు చేసుకుందామనుకుంటే వారు నెలకు కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయలు అడుగుతున్నారని, అది తాము నెలంతా కష్టపడితే వచ్చే లాభమని స్థానికులు పేర్కొన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తమను తీవ్రంగా దెబ్బతీసిందని వారు చెప్పారు. సాధారణంగా ఇక్కడ జరిగే లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరుగుతాయి. దీంతో ఆ సమయంలో మెటీరియల్ కొనలేక, తయారు చేసిన సరుకును అమ్మలేక వీరు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో నగదు లావాదేవీలు జరగక తాము తీవ్రంగా నష్టపోయామని, బాకీదారులు ఎవరూ సొమ్ములు చెల్లించలేదని, ముడిసరుకును కొనడానికి డబ్బులు లేవని వారు వాపోయారు. చేతి వృత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ కార్డు పథకాన్ని 2003లో ప్రవేశపెట్టిందని, కాని వాటి గురించి తమకెవరూ చెప్పేవారు లేక దానిని వినియోగించుకోలేకపోయామని వౌలానా అనే చిన్న వ్యాపారి తెలిపాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బ్యాంకు రుణాలు, పెన్షన్ పథకాలు వంటి వాటి గురించి సైతం తమకు తెలియదని ఆయన వాపోయాడు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరిగే సామర్థ్యం ఇక్కడి నిరక్షరాస్యులకు ఎంతమాత్రం లేదని ఆయన తెలిపాడు. కాగా, ఇక్కడి చేతివృత్తిదారులు తమకు అవసరమైన బోల్ట్‌లు, వస్త్రాన్ని బివాండి, అహ్మదాబాద్ నుంచి, డైలు అహ్మదాబాద్, సికర్, జున్‌జున్ మార్కెట్ల నుంచి తీసుకువస్తారు. ఒక బందేజ్‌ను తయారు చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు వస్త్రాన్ని కట్ చేసి, బ్లీచింగ్ చేయాలి. తర్వాత దానిపై చిన్న డిజైన్లు మార్క్ చేయాలి, పలు రకాలుగా వాషింగ్, డైయింగ్ , టై ప్రక్రియలు చేపట్టాలి. ఇలా అన్ని ప్రక్రియలు చేపట్టే పనులపై సుమారు 20 వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అయితే మీ అభివృద్ధికి ప్రభుత్వం ఏమన్నా పాటుపడుతుందా? అన్న ప్రశ్నకు ‘లేదు’ అని వీరంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ఒక చిన్న వస్త్రం తయారు కావడానికి కనీసం వారం రోజులు పడుతుంది. దానిపై వచ్చే లాభం ఎంత అంటే కేవలం 10 నుంచి 20 రూపాయలు మాత్రమేనని భాటి అనే కార్మికుడు తెలిపాడు. మీరు ప్రభుత్వం నుంచి ఆశించేది ఏమిటి అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇస్తూ మొదట తాము చేసే పనిని ప్రభుత్వం పరిశ్రమగా గుర్తించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పరిశ్రమగా గుర్తించి భూమి, మూలధనం సమకూరిస్తే తాము పెద్దస్థాయిలో వీటిని తయారు చేస్తామని, తద్వారా ఈ కళను సంరక్షించడమే కాకుండా, ఆర్థికంగా తాము అభివృద్ధి సాధిస్తామని వారు చెప్పారు. ఈ కళ తమకు పురాతన కాలం నుంచి వారసత్వంగా వస్తోందని, దీనిని మిగిలిన వారెవరూ చేయలేరని, దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అస్లాం అనే వృద్ధుడు తెలిపారు. వచ్చే ప్రభుత్వమైనా తమ కష్టాలపై దృష్టి సారించి దీని అభివృద్ధికి కృషి చేస్తుందని తాము ఆశిస్తున్నట్టు ఆయన చెప్పాడు.