బిజినెస్

అందరూ పన్నులు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: పన్ను ఎగవేతలున్నప్పుడు తక్కువ పన్నుల విధానం సరిపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పన్నుల రేట్లు తగ్గాలంటే అందరూ పన్నులు చెల్లించాలని, అప్పుడే పన్నులను తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేటుపై ఊహాగానాల మధ్య జైట్లీ పైవిధంగా స్పందించారు. శనివారం ఇక్కడ జరిగిన సొంత పార్టీ అయిన బిజెపి కార్యకర్తల సమావేశంలో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పన్నులు, పన్ను ఎగవేతలు కలిసి ఉండవన్నారు. పన్ను ఎగవేతలున్నప్పుడు పన్ను రేటు అధికంగానే ఉంటుందని, పన్ను రేటు తగ్గాలంటే పన్ను ఎగవేతలూ తగ్గాలని అన్నారు. ‘ఒకవేళ పన్ను చెల్లింపుదారులందరూ తమ పన్నులను సక్రమంగా చెల్లిస్తే.. అది పన్ను రేట్లను మరింత తగ్గించడానికి దోహదపడుతుంది. అలాకాకుండా పన్ను ఎగవేతలు, మినహాయింపులు అధికంగా ఉంటే పన్ను రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అంతా పన్నులు సక్రమంగా చెల్లించాలి.’ అని అన్నారు. ప్రతిపాదిత జిఎస్‌టి రేటును 17 శాతానికి తేవాలని ముంబయి బిజెపి విభాగం అధ్యక్షుడు ఆశిష్ షేలర్ చేసిన డిమాండ్‌పై జైట్లీ స్పందిస్తూ పన్ను చెల్లింపుదారుల్లో అధికులు పన్నులను ఎగ్గొడితే పన్నుల విధానాల్లో ఊహించని మార్పులకు ఆస్కారముంటుందన్నారు. జిఎస్‌టితోసహా ఇతరత్రా పన్నుల రేట్ల తగ్గుదల పన్ను చెల్లింపుదారుల నిజాయితీపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. మొత్తం దేశాన్ని ఒకే మార్కెట్‌గా జిఎస్‌టి మారుస్తుందని, దేశవ్యాప్తంగా వస్తు, సేవలు వినియోగదారులకు ఒకే ధరకు అందుతాయని అన్నారు. జిఎస్‌టి అమలుతో పన్నుల రేట్లు తగ్గుముఖం పట్టగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇది వ్యాపార నిర్వహణనూ సులభతరం చేస్తుందన్నారు. అందుకే తమ తొలి ప్రాధాన్యత జిఎస్‌టి అమలుకు ఇస్తున్నామన్నారు. నిజానికి దుబాయ్, సింగపూర్ మినహా మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో పన్నులు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని జైట్లీ తెలిపారు. ఇక మలి ప్రాధాన్యత దేశంలోని బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించడం నేర్చుకోవాలన్నారు. మొండి బకాయిలు ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ పైవిధంగా మాట్లాడారు. కాగా, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జిఎస్‌టి బిల్లుకు పలు మార్పుల అనంతరం ఈ నెలే రాజ్యసభ, లోక్‌సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినది తెలిసిందే. నిజానికి బిజెపికి మెజారిటీ ఉన్న లోక్‌సభలో బిల్లుకు ఎప్పుడో ఆమోదం లభించినా, మార్పులు చోటుచేసుకోవడంతో మరోసారి లోక్‌సభకు ఆమోదం కోసం వెళ్లాల్సి వచ్చింది. ఇక ఈ బిల్లుకు రాజ్యాంగ హోదా లభించాలంటే దేశంలోని రాష్ట్రాల్లో కనీసం 19 రాష్ట్రాల మద్దతు అవసరం. ఇప్పటికే అస్సాం, బీహార్‌ల మద్దతు లభించగా, మరో 17 రాష్ట్రాల అసెంబ్లీల్లో 2/3 మెజారిటీతో బిల్లుకు మద్దతు రావాల్సి ఉంది. జిఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి (2017-18 ఆర్థిక సంవత్సరం మొదలు) అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రాష్ట్రాల స్థాయి పన్నులు ఇక ఉండవు. వ్యాపారులకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్‌టి మండలి.. జిఎస్‌టి రేటును నిర్ణయించనుంది. ఇప్పటికే కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు జిఎస్‌టి రేటును 18 శాతంగా ప్రతిపాదించినది తెలిసిందే.
పివి చేసిందేమీ లేదు!
మాజీ ప్రధాని పివి నరసింహరావును ఆర్థిక దైవంగా భావించవద్దని అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు, విధానాలకు ఆధ్యుడిగా పివిని అభివర్ణిస్తున్నది తెలిసిందే. ఆయన నిర్ణయాలే దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయన్నది మెజారిటీ నిపుణుల వాదన కూడా. అయితే రావు చేసినది ఏమీ లేదని 1991లో దివాళా కారణంగా సంస్కరణలు ప్రవేశపెట్టారని, ఆ తర్వాత షరామామూలేనన్నారు. అలాగే స్వాతంత్య్రం అనంతరం నెహ్రూ అవలంభించిన విధానాలూ దేశ అభివృద్ధికి ఏమంత దోహదపడలేదని అన్నారు. జైట్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆర్థికంగానేగాక, రాజకీయంగానూ సంచలనం సృష్టిస్తుండగా, కాంగ్రెస్, బిజెపి మధ్య మరో కొత్త యుద్ధానికి దారితీసేలా ఉంది.

చిత్రం.. .బిజెపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ