బిజినెస్

ఇసుక కొరతతో ఆగిన నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం : ప్రస్తుతం గోదావరి ఇసుక సామాన్యులకు అందుబాటులో లేదు.. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి దాదాపు నెల రోజులు కావొస్తోంది. అయితే సరైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకుంటున్న సామాన్యులు ఇసుక లేక మధ్యలో పనులు నిలిపేసుకోవాల్సివస్తోంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త ప్రభుత్వం అమలు చేసే కొత్త ఇసుక విధానం అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అప్పటివరకు ఎలా అనే సామాన్యుని ప్రశ్నకు సమాధానం లభించడంలేదు.
తాజాగా రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి నదిలోని కాటన్ బ్యారేజికి ఎగువన నావల ద్వారా నది నుంచి ఇసుక బయటకు తీసే విధానంలో నాలుగు ర్యాంపులను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ర్యాంపుల ద్వారా క్రెడయ్ సంస్థ అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఆ సంస్థకు, ప్రభుత్వ పనులకు ఆటంకం లేకుండా ఇసుకను సరఫరా చేసే విధంగా ర్యాంపులకు అనుమతి ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ర్యాంపుల వద్ద క్రెడయ్ సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ పనులకు సంబంధించి వీఆర్వోల ఆధ్వర్యంలో ఇసుక కేటాయిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని గాయత్రి ర్యాంపు, కోటిలింగాలపేట 1, 2, 3 ర్యాంపులను అనుమతిస్తూ ఇసుక కేటాయింపులు చేశారు. కోటిలింగాలపేట-3ని స్థానిక సుబ్బారావుపేట ఫీల్డ్ లేబర్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో 21 నావల ద్వారా ఇసుకను నది నుంచి వెలికితీసి సరఫరా చేసే విధంగా అనుమతిచ్చారు. ఈ ర్యాంపుల వద్ద లోడింగ్ చార్జి రూ.300, రూ.60 బాటచార్జీతో పాటు రెండు యూనిట్లు ఇసుకకు రూ.1600 చొప్పున వసూలు చేస్తూ కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం ఇసుక పూర్తి స్థాయిలో సరఫరా లేకపోవడం వల్ల నిర్మాణ రంగం మందకొడిగా సాగుతోంది. క్రెడయ్ సంస్థకు ఇసుకను కేటాయించడం వల్ల కాస్తంత నిర్మాణ రంగ పనులు జరుగుతున్నాయి. అయితే సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు మాత్రం ఇసుక లభించడం లేదు. పనులు అర్ధాంతరంగా నిలుపేసుకోవడం తప్ప గత్యంతరం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నిల్వచేసిన ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రవాణా చేస్తూ, ఇసుక పట్టుబడిన సంఘటనలు ఈ కోవలోనివే. గోదావరి నదికి వరద వస్తే నావల ద్వారా ఇసుక తీయడం కూడా నిలుపు చేయాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. సామాన్యులు ఇసుక కోసం ప్రస్తుతం వెంపర్లాడుతున్నారు.