బిజినెస్

నడిరేయి రాక్..తెల్లవారకముందే పోక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 26: ‘తెల్లవారకముందే వెళ్లిపోతోందీ.. అందరు పడుకున్నాక మళ్లీ వస్తోందీ’ అంటూ రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై నిట్టూరుస్తున్నారు. నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సునాయాసంగా రాకపోకలు నిర్వహించడానికి దక్షిణ మద్య రైల్వే ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లింగంపల్లి చివరి స్టేషన్‌గా ఉన్న ఎంఎంటీఎస్ సేవలను పొడిగించడానికి రామచంద్రాపూర్‌ను కేంద్రంగా ఎంపిక చేసి కోట్లు వెచ్చించి ఆధునిక వసతులతో కూడిన రైల్వే స్టేషన్‌ను నిర్మించి, రెండు బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేసారు. వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వేస్టేషన్‌కు గడచిన నెలన్నర రోజులుగా ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. రెండు రైళ్లు వచ్చిపోతున్నా అవి ప్రయాణికులకు మాత్రం ఏమాత్రం అందుబాటులో ఉండటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఎంతోకాలంగా ఎదురు చూసినా స్థానికులకు మాత్రం ఫలితం లేకుండా పోయింది. ఉదయం 5 గంటలకు 47126 నంబరు గల ఎంఎంటీఎస్ రైలు రామచంద్రాపురం నుండి హైదరాబాద్ బయలుదేరి వెళుతోంది. ఉదయం 6.01 గంటలకు 47213 నంబరు గల ఎంఎంటీఎస్ రామచంద్రాపురం నుండి ఫలక్‌నుమా వరకు బయలుదేరుతోంది. రాత్రి 11.10 గంటలకు 47220 నంబరు గల ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నుమా నుండి రామచంద్రాపురం చేరుకుని బస చేస్తోంది. రాత్రి 11.30 గంటలకు 47170 నంబరు గల రైలు ఫలక్‌నుమా నుండి రామచంద్రాపురం స్టేషన్‌కు చేరుకుని సేద తీరుతోంది. ప్రయాణికులకు ఏ మాత్రం అందుబాటులో లేని సమయాల్లో రైళ్లను నడపటం వల్ల సంస్థకు నష్టమే చేకూరుతుందని, లాభం ఎంత మాత్రం లేదన్న విమర్శలు ఉన్నాయి. లింగంపల్లి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వరకు రామచంద్రాపురం నుండి ప్రత్యేక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయకుండా సాధారణ రైల్వే లైనుకు లింకు చేయడం వల్ల పగటిపూట రామచంద్రాపురం వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపటం సాధ్యపడటం లేదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రాపురం వరకు ఎంఎంటీఎస్ రైళ్లు వస్తున్నాయన్న ప్రచారంతో ఎంతో మంది ప్రయాణికులు స్టేషన్‌కు వచ్చి రైళ్ల రాకపోకల సమయాలను తెలుసుకుని నిరాశ చెందుతున్నారు. మెట్రో రైలు మియాపూర్ వరకు, ఎంఎంటీఎస్ లింగంపల్లి వరకు మాత్రమే ఉండటంతో పటాన్‌చెరు, రామచంద్రాపూర్ ప్రాంతాలకు చెందిన వారు గత్యంతరం లేక బస్సులు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ టాక్సీల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుని అనేక అవస్థలకు గురవుతున్నారు. మెట్రో సేవలు అందుబాటులో లేకపోయినా కనీసం ఎంఎంటీఎస్ ద్వారా తమ ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని సంతోషించిన ప్రయాణికులకు మాత్రం రైళ్ల రాకపోకల సమయాలు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. ఉదయం 6 గంటల రైలు వెళ్లినప్పటి నుండి రామచంద్రాపురం రైల్వేస్టేషన్ ప్రయాణికులు లేక బోసిపోతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలు బస్సులో ప్రయాణించలేక అనేక అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖల మద్య సమన్వయ లోపం కారణంగా రైల్వే సేవలు పూర్తి స్థాయలో ప్రయాణికులకు అందుబాటులోకి రాలేకపోయాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరమైన నిధులు సమకూరితే లింగంపల్లి వరకు ప్రత్యేక రైలు మార్గం నిర్మిస్తే ప్రయాణికులు వేగవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఖర్చు తగ్గడమే కాకుండా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే ఇబ్బందులు కూడా తొలగిపోతాయని, అధికారులు స్పందించి పగటిపూట రామచంద్రాపురం వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.

చిత్రం... ప్రయాణికులు లేక బోసిపోయిన రామచంద్రాపురం ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్