బిజినెస్

బ్లాక్ మాఫియా ‘సినీ’మాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఆగస్టు 29: వందల కోట్ల రూపాయల వ్యయం.. అందులోనూ ప్రభాస్ నటిస్తున్న సినిమా.. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, భారీ అంచనాల నడుమ వస్తున్న సాహో సినీ మానియా ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించిన తరువాత అదే హీరో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో సినిమా చూడాలంటే టిక్కెట్ కోసం సాహసం చేయాల్సిందే. గంటలకొద్దీ క్యూలైన్లో నిలుచోవాలి. తీరా నుంచున్న తరువాత టిక్కెట్టు దొరుకుతుందనే గ్యారంటీ మాత్రం లేదు. దొరికినా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. అభిమాన నటుడి సినిమాను తొలిరోజు మొదటి షో చూడాలనుకునే ఫ్యాన్స్‌తో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా ప్రతీసారిలా ఇలానే నిరాశ మిగులుతుంది. ఇంకా తెరచుకోని కౌంటర్లు, ఆన్‌లైన్‌లో అన్నీ ఫుల్ బోర్డులు సగటు ప్రేక్షకుడిని వెక్కిరిస్తున్నాయి. 30న శుక్రవారం ప్రక్షకుల ముందుకొస్తున్న సాహో సినిమా టికెట్ల కోసం ఫ్యాన్స్ నగరంలోని థియేటర్ల ముందు తెల్లవారుజాము నుండే ఎదురుచూస్తున్నారు. ఒకవైపు టిక్కెట్ల ధర పెంచవద్దంటున్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సినిమాను ప్రదర్శిస్తున్న అన్ని థియేటర్ల వద్ద ధర మాత్రం కంగుతినిపిస్తోంది. భారీ అంచనాలు, భారీ వ్యయంతో నిర్మించిన సాహో సినిమా టిక్కెట్ ధర కూడా భారీగానే ఉంది. ఆరు షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో మొదటి షో చూసేందుకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో ఎగబడుతున్నారు. టిక్కెట్టు ధర చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే, అభిమాన నటుడి సినిమా చూసేందుకు ఎంతైనా చెల్లిచేందుకు మరికొందరు ముందుకొస్తున్నారు. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్న థియేటర్ యాజమాన్యాలు టిక్కెట్టును రూ. 500 నుండి 1500 రూపాయలకు అమ్ముతున్నారు. కౌంటర్లలో కొన్ని టిక్కెట్లు మాత్రం రూ.250 నుండి రూ.300లకు అమ్ముతున్న యాజమాన్యాలు, పనిలోపనిగా కార్పొరేట్ దోపిడీకి శ్రీకారం చుట్టాయి. ఒకవైపు టిక్కెట్టు ధరను సాధారణం కంటే అధికంగానే వసూలు చేస్తున్న వీరు స్పెషల్ టిక్కెట్ల పేరుతో జంబో టిక్కెట్లను రూ. 600కు పైనే ధరకు అమ్ముతున్నారు.
బెనిఫిట్ షో పేరిట బాదుడు
ప్రపంచవ్యాప్తంగా సుమారు 10వేల థియేటర్లలో విడుదలవుతున్న సాహో సినిమా బెనిఫిట్ షో టిక్కెట్టు ధర చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొదటి వారంలోనే భారీ కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్న నిర్మాతలు, పంపిణీదారులు బెనిఫిట్ షోతో పాటు సాధారణ షో టిక్కెట్టు ధరను కూడా అమాంతం పెంచేశారు. వారం రోజుల పాటు టిక్కెట్లను బ్లాక్ చేసిన యాజమాన్యాలు నచ్చిన ధరకు అమ్ముతున్నాయి. బెనిఫిట్ షో టిక్కెట్టు ధర రూ.500 నుండి ప్రారంభమై రూ. 2వేల వరకు పలుకుతోందని ఫ్యాన్స్ చెబుతున్నారు. టిక్కెట్టు ధర పెంచవద్దని చెప్పిన ప్రభుత్వం అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు మాత్రం అనుమతులు మంజూరు చేసింది. సాధారణంగా టిక్కెట్ ధర రూ.100 నుండి 150లుగా ఉండాల్సి ఉంటే, సాహో ధర రూ. 250 నుండి ప్రారంభం అవుతోంది. ఇక, బ్లాక్ మాఫియా సంగతి చెప్పనే అక్కర్లేదు. థియేటర్ యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్న వీరు అన్ని షోలకు సంబంధించిన టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసి, ప్రేక్షకులకు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ క్యాష్ చేసుకుంటున్నాయి. నగరంలోని అన్ని థియేటర్లు, మాల్స్, మల్టీఫ్లెక్స్‌లలో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. భారీగా బ్లాక్ టిక్కెట్లు పోగుచేసుకుంటున్న మాఫియా టిక్కెట్‌ను రూ.800 పైనే విక్రయిస్తున్నారు. వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే.. వారికి కూడా సాహో మొదటి షో, లేదా మొదటిరోజు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు టిక్కెట్లు కావాలి కదా! యాజమాన్యాలు, పంపిణీదారుల వద్ద తీసుకోవాలి కదా మరి!!