బిజినెస్

పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట్, జనవరి 19: తెలంగాణాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ వెల్లడించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లి సెజ్‌లో 108 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా ఫుడ్‌పార్క్‌ను కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్ తేలితో కలిసి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ పరిశ్రమల ద్వారా సాంకేతికపరమైన ఉత్పత్తులతో పాటు రైతులకు మేలు జరుగుతుందని, స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర పొంది వ్యవసాయాన్ని బలోపేతం చేయడమే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ముఖ్య ఉద్దేశమన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన రైతులకు, స్వయం సహాయక సంఘాలకు, ఆసక్తి గల వారికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, అందుకు ఐదు కోట్ల రూపాయల వరకు సబ్సిడీ అందించనున్నట్టు ఆమె తెలిపారు. ప్రధానమంత్రి రైతులకు పెట్టుబడి కోసం ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులందరికీ యేడాదికి 6,000 రూపాయల ఆర్థికం సహాయం అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోనే లక్కంపల్లి ఫుడ్‌పార్క్ అతి పెద్దదని, తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం ప్రతిపాదనలు పంపితే మంజూరుకు కృషి చేస్తానన్నారు. లక్కంపల్లి మెగా ఫుడ్‌పార్క్ పరిశ్రమల వల్ల నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల రైతులతో పాటు సరిహద్దులోని మహారాష్ట్ర రైతులకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు.
ఈ పార్కులో 25వేల మందికి లబ్ధి చేకూరడంతో పాటు ఐదు వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె చెప్పారు. 10 ఎకరాల స్థలం చూపించినా కూడా, మినీ పరిశ్రమల యూనిట్ నెలకొల్పేందుకు సహకరిస్తామని మంత్రి చెప్పారు. కేంద్ర సహాయమంత్రి రామేశ్వర్ తేలి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యూనిట్ అంచనాల్లో 50శాతం వరకు పెట్టుబడి సహాయం అందిస్తుందని, మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవాలని చెప్పారు.
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే, తాను సమన్వయంతో అభివృద్ధికి పాటుపడతామని, రైతులకు మేలు జరిగే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవ తీసుకుని ఫుడ్‌పార్క్ మంజూరు చేయించారని, 2015లో కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో శంకుస్థాపన చేయించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు లక్కంపల్లి సెజ్‌లో ఎలాంటి పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోయాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పరిశ్రమల ఏర్పాటు జరిగిందని అన్నారు. నిర్మల్ జిల్లా, సరిహద్దు మహారాష్ట్ర జిల్లాలకు కూడా మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో గోదావరి నదిపై 110 కోట్లతో బ్రిడ్జి నిర్మించినట్టు చెప్పారు. అలాగే యూరియా కొరత లేకుండా అధిక మొత్తంలో రాష్ట్రానికి వచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి రాకేష్ సర్వల్, మెగాపార్క్ డైరెక్టర్ కిషోర్‌కుమార్, సీఈవో వైభవకృష్ణ, జడ్పీటీసీ ఎర్రం యమున, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బస్వా లక్ష్మినర్సయ్య, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్‌రెడ్డి, స్థానిక ఎంపీపీ వాకిడి సంతోష్, లక్కంపల్లి సర్పంచ్ సుమలత, మండల బీజేపీ అధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, తెరాస మండల అధ్యక్షుడు నక్కల భూమేష్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
తెరాస, బీజేపీ కార్యకర్తల
పోటాపోటీ నినాదాలు
ఇదిలాఉండగా, కేంద్ర మంత్రుల సమక్షంలో తెరాస, బీజేపీ కార్యకర్తలు ఎవరికివారు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పోటాపోటీగా నినాదాలు ఇవ్వడం సభలో ఒకింత రభస సృష్టించినట్టయ్యింది. తెరాసకు చెందిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీకి చెందిన కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్ అని పెద్దపెట్టున నినాదాలు చేయగా, బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రసంగిస్తున్న సమయంలో కేసీఆర్‌కు అనుకూలంగా తెరాస కార్యకర్తలు నినాదాలు చేయడం గందరగోళ వాతావరణం సృష్టించింది. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.