బిజినెస్

రూ. 65,250 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఈసారి భారీ మొత్తంలో 65,250 కోట్ల రూపాయల లెక్క చూపని ధనం వెలుగులోకి వచ్చింది. దీంతో ఖజానాకు 29,362 కోట్ల రూపాయల పన్ను రూపేణా లభించనుంది. ఆన్‌లైన్‌లో కాని మాన్యువల్‌గా కాని నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడానికి ప్రభుత్వం ఇచ్చిన నాలుగు నెలల కాలపరిమితి సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోయింది. వెలుగు చూసిన నల్లధనం నుంచి సుమారు 14,700 కోట్ల రూపాయలు కాని, బకాయి ఉన్న పన్నుల్లో నుంచి సగం కాని ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్ను రూపంలో లభించనుంది. ఆదాయం ధ్రువీకరణ పథకం (ఐడిఎస్) కింద 64,275 మంది తమ ఆదాయాలను వెల్లడించారని, వాటి మొత్తం 65,250 కోట్ల రూపాయలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. కొంతమంది సమర్పించిన ఆదాయాల వివరాలను ఇంకా పట్టిక రూపంలో పొందుపరచలేదని, అయితే ఆ ప్రక్రియ పూర్తయితే వెలుగులోకి వచ్చిన నల్లధనం మొత్తం పెరుగుతుందని ఆయన వివరించారు. ఇలాంటి నల్లధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తూ ఆ మొత్తంలో 45 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పట్టిక రూపంలో పొందుపరచిన డిక్లరేషన్ల ప్రకారం ప్రభుత్వానికి 29,362.5 కోట్ల రూపాయలు పన్ను, జరిమానా రూపంలో లభించనుంది. అయితే ఆస్తులు వెల్లడించిన వారు చెల్లించవలసిన మొత్తాన్ని 2017 సెప్టెంబర్ 30లోగా రెండు కిస్తులలో చెల్లించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇందులో సగం 14,681.25 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించనుంది. గత సంవత్సరం ఇలాంటి పథకం కింద విదేశాలలో నల్లధనం కలిగి ఉన్న వారు 644 మంది స్వచ్ఛందంగా వెల్లడించిన విదేశాలలోని ఆదాయం, ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి కేవలం 2,428 కోట్ల రూపాయలే పన్ను రూపంలో లభించింది. ఐడిఎస్ పథకం కింద వచ్చిన డిక్లరేషన్లను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని జైట్లీ తెలిపారు. వీటి ద్వారా సమకూరిన పన్ను మొత్తాన్ని భారత సంఘటిత నిధికి జమచేసి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించడం జరుగుతుందని ఆయన వివరించారు. కాగా, ఒక్కో డిక్లరేంట్ సగటున ఒక కోటి రూపాయలని వెల్లడించారు. 1997లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ ధ్రువీకరణ పథకం (విఐడిఎస్) కింద అప్పట్లో ప్రభుత్వానికి 9,760 కోట్ల రూపాయలు పన్ను రూపంలో లభించింది. అయితే విడిఐఎస్, ఐడిఎస్‌లు రెండు వేర్వేరు పథకాలని, వాటిని పోల్చజాలమని జైట్లీ అన్నారు. ఇదిలావుంటే గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వం లెక్కలు చూపనివారి ధనాన్ని వెలికితీసిన వివరాలను కూడా జైట్లీ ఈ సందర్భంగా వెల్లడించారు. తనిఖీలలో 56,378 కోట్ల రూపాయలను, టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయనివారి నుంచి 16 వేల కోట్ల రూపాయలను వెలికితీసినట్లు ఆయన వివరించారు. అయతే ఐడిఎస్ వినియోగించుకోని వారిపట్ల ఆదాయపు పన్ను శాఖ తన నిబంధనల ప్రకారం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తుందన్నారు. కాగా, గడచిన రెండేళ్లలో దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ సోదాల్లో 56,378 కోట్ల రూపాయల అప్రకటిత ఆదాయం వెలుగులోకి వచ్చిందని, దాదాపు 2,000 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నామని జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే నిరుపేదల కోసం ప్రభుత్వం రాయితీలో అందిస్తున్న కిరోసిన్ దుర్వినియోగమవుతోందన్న జైట్లీ.. కేవలం అర్హులకే దాన్ని అందించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే ప్రభుత్వ తదుపరి అజెండా అని స్పష్టం చేశారు. ఇదిలావుంటే కెనడా, అమెరికాల్లో 7 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జైట్లీ ఆదివారం బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి వార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

చిత్రం.. శనివారం న్యూఢిల్లీలో ఒఆర్‌ఎఫ్ ‘బెటర్ దేన్ క్యాష్’ కార్యక్రమంలో పాల్గొన్న అరుణ్ జైట్లీ