బిజినెస్

70 లక్షల ఉద్యోగాలుండవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: రోజుకు 550 ఉద్యోగాలు పోతున్నాయని మీకు తెలుసా? గత నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అంటే మీరు నమ్మగలరా? ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి 70 లక్షల ఉద్యోగావకాశాలు చేజారుతాయని ఊహించగలరా?.. వినడానికి ఒకింత ఆశ్చర్యకరంగా, మరింత ఆందోళనకరంగా ఉన్నా.. ఇదంతా నిజమని చెప్పక తప్పదు. మరో మూడున్నర దశాబ్దాల్లో నిరుద్యోగం భారత భావి పౌరులను వేధిస్తుందన్నది ముమ్మాటికి నిజం మరి. ఢిల్లీకి చెందిన సివిల్ సొసైటీ గ్రూప్ ప్రహర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం గత నాలుగేళ్లుగా రోజుకు 550 ఉద్యోగాల చొప్పున తగ్గిపోతున్నాయి. ఇదే విధంగా ఇకముందూ జరిగితే 2050 నాటికి మనకు దూరమయ్యే ఉద్యోగాల సంఖ్య అక్షరాల 70 లక్షలు. రైతులు, చిరు వ్యాపారులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్మాణరంగ కూలీలు మునుపెన్నడూ లేనివిధంగా నేడు దేశంలో బ్రతుకుపై భరోసా కరువై జీవిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది ఆరంభంలో లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం నిరుడు 1.35 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి. 2013లో ఈ సంఖ్య 4.19 లక్షలుగా ఉంటే, 2011లో 9 లక్షలు. అంటే రానురాను ఉద్యోగ కల్పన క్షీణిస్తుందన్నమాట. ‘ఈ అధ్యయనం సందర్భంగా జరిగిన లోతైన విశే్లషణ ద్వారా వెల్లడైనదేమిటంటే.. భారత్‌లో నానాటికీ వృద్ధి మందగిస్తోంది. జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దేశంలో రోజూ కనుమరుగవుతున్న ఉద్యోగాల సంఖ్య కనీసం 550. గడచిన నాలుగేళ్లూ ఇంతే. ఇకముందూ ఇలాగే జరిగితే 2050 నాటికి భారత్ కోల్పోయే ఉద్యోగావకాశాలు 70 లక్షలు. ఇదే సమయంలో దేశ జనాభా మాత్రం 60 కోట్లు పెరుగుతుంది.’ అని ప్రహర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏదిఏమైనా భారత్‌లో ఉద్యోగ సృష్టి గణనీయంగా పడిపోతోందని, ఇది ప్రమాద ఘంటికలుగా భావించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రాయపడింది. దేశంలో అత్యధికులకు ఉపాధినిస్తున్న రంగం వ్యవసాయమే. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నవారు దేశ జనాభాలో 50 శాతం ఉంటారు. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం 1994లో 60 శాతంగా ఉంటే, 2013లో 50 శాతానికి తగ్గింది. ఇక మరో 49 శాతం మంది చిరు వ్యాపారులు, చిన్న, మధ్యతరహా సంస్థల్లో పనిచేస్తున్న వారున్నారు. బడా సంస్థలతో పోల్చితే చోటా సంస్థలే ఎక్కువమందిని పోషిస్తుండగా, భారీ సంస్థల ఉద్యోగుల వాటా కేవలం 1 శాతమే. ఇక సంఘటిత ఉద్యోగులు 3 కోట్లుంటే, అసంఘటిత రంగ ఉద్యోగులు సుమారు 44 కోట్లున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ‘మేక్ ఇన్ ఇండియా వీక్’లో వివిధ బహుళజాతి సంస్థలు రాబోయే ఐదేళ్లలో 225 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని ప్రకటించాయి. దీంతో ఈ పెట్టుబడులు 60 లక్షల ఉద్యోగాలను సృష్టించే వీలుంది. అయితే అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, దేశంలో నెలకొనే విపత్కర పరిస్థితులతోపాటు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల్లో యాంత్రికీకరణ మానవ వనరులను మరుగున పడేస్తున్నాయని, దీంతో ఉద్యోగాల సృష్టి మరింత వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 100 మంది.. 100 రోజులు చేసే పని కూడా ఒక్క యంత్రం.. ఒక్క రోజులో చేస్తున్న విషయం మరువకూడదంటున్నారు. కాబట్టి మానవ వనరుల వినియోగాన్ని పెంచేలా చట్టాలు తీసుకురావాలన్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం దేశంలో 99 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయం, చిరు వ్యాపారం, చిన్న, మధ్యతరహా సంస్థల ప్రగతికి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాల్సిందే. కనుక ఈ 21వ శతాబ్దంలో భారత్‌కు కావాల్సింది స్మార్ట్ విలేజ్‌లే తప్ప, స్మార్ట్ సిటీలు కాదని తాజా అధ్యయనం బలంగా అభిప్రాయపడింది. ఎందుకంటే అసలైన భారతం.. గ్రామీణ భారతమే.