బిజినెస్

సైరస్ మిస్ర్తికి ఉద్వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తి ఉద్వాసనకు గురయ్యారు. భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగంలో బహుళ వ్యాపార దిగ్గజంగా పేరున్న టాటా సన్స్ ఉత్పత్తులు.. సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు, హెయిర్ పిన్ను నుంచి ఏరోప్లేన్ వరకు ఉన్నాయి. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా సన్స్‌కు నాలుగేళ్ల క్రితం 2012, డిసెంబర్ 29న రతన్ టాటా స్థానంలో మిస్ర్తి ఎన్నికై ఆశ్చర్యం కలిగించారు.
అయితే ఆయన ఎన్నిక ఎంతైతే ఆశ్చర్యానికి గురిచేసిందో.. అంతే ఆశ్యర్యాన్ని ఆయన ఉద్వాసన రేకెత్తించింది. సోమవారం టాటా సన్స్ విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలోని వివరాల ప్రకారం ‘టాటా సన్స్ బోర్డులో చైర్మన్‌గా సైరస్ మిస్ర్తిని తొలగిస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.’ అని ఉంది. అయితే 100కుపైగా సంస్థలున్న టాటా సన్స్ గ్రూప్‌లో మిస్ర్తిని మినహా మరే సంస్థ సిఇఒలనుగానీ, ఎండీలనుగానీ తాజా బోర్డు సమావేశం మార్చలేదు.
కాగా, నాలుగు నెలల్లో కొత్త సారథిని ఎంపిక చేస్తామని ప్రకటించిన టాటా సన్స్.. అంతవరకు సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాకు బాధ్యతలు అప్పగించింది. అలాగే నూతన చైర్మన్ నియామకానికి ఓ సెలక్షన్ ప్యానెల్ కూడా ఏర్పాటవగా, ఇందులో రతన్ టాటాతోపాటు రోనెన్ సేన్, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, లార్డ్ కుమార్ భట్టాచార్య సభ్యులుగా ఉన్నారు.
నష్టాల్లో సంస్థలు
పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో భారత్‌ను ప్రపంచ దేశాలకు విస్తరించిన ఘనత టాటా గ్రూప్‌ది. ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ సంస్థల కార్యకలాపాలున్నాయి. అయితే రతన్ టాటా నాయకత్వంలో అంచలంచెలుగా ఎదిగిన గ్రూప్.. మిస్ర్తి అధ్యక్షతన మాత్రం దిగజారుతూ వచ్చిందనే చెప్పాలి.
2014-15 ఆర్థిక సంవత్సరంలో 108 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్న టాటా సన్స్.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 103 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రుణ భారం కూడా 23.4 బిలియన్ డాలర్ల నుంచి 24.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయితే ఈ టెక్నాలజీ యుగంలో పెరిగిన పోటీని తట్టుకోవడం కష్టమే అయినప్పటికీ, వాటిని అధిగమించినవాడే నాయకుడన్నది కార్పొరేట్ ప్రపంచం విశ్వసించే ఫార్ములా. దీంతో ఇది మిస్ర్తి వైఫల్యంగానే టాటా సన్స్ భావించిందని, అందుకే ఈ వేటు అని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఇక టాటా గ్రూప్‌లోని ప్రధాన సంస్థల్లో టిసిఎస్ మినహా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ ప్రదర్శన ఏమంత బాగోలేదు. వీటి ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా నమోదవుతున్నాయి.
ముఖ్యంగా టెలికామ్ వ్యాపారమైతే నష్టాల్లోనే నడుస్తోంది. జపాన్‌కు చెందిన ఎన్‌టిటి డొకొమోతో టాటా ఏర్పాటుచేసిన జాయింట్ వెంచర్ బెడిసికొట్టింది. అయితే టైటాన్, టాటా గ్లోబల్ బేవరేజెస్, ఇండియన్ హోటల్స్, ట్రెంట్, ర్యాలీస్ ఇండియా ఫలితాలు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, వాటి వృద్ధి గడచిన ఐదేళ్లలో కేవలం 4 శాతంగానే నమోదైంది. మొత్తంగా చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉన్న 27 టాటా గ్రూప్ సంస్థల్లో గత ఆర్థిక సంవత్సరం (2015-16) తొమ్మిది నష్టాలనే నమోదు చేశాయి. మరో ఏడు సంస్థల లాభాలు క్షీణించాయి. టాటా పవర్, టాటా కెమికల్స్ మాత్రమే ఆశించిన స్థాయిలో లాభాలను అందుకున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం నుంచే ఇవికూడా లాభాల్లోకి వచ్చాయి.
మార్కెట్ విలువ రెండింతలు
అయితే మిస్ర్తి నేతృత్వం వహించిన ఈ నాలుగేళ్లలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు రెండింతలు కావడం గమనార్హం. 2012 డిసెంబర్‌లో టాటా సన్స్ సారథ్య బాధ్యతలను మిస్ర్తి చేపట్టినప్పుడు స్టాక్ మార్కెట్లలోని టాటా గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ సుమారు 4.6 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడది 8.5 లక్షల కోట్ల రూపాయల దరిదాపుల్లో ఉంది. ఇందులో దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ వాటానే 4.8 లక్షల కోట్ల రూపాయలుగా ఉండటం విశేషం. కాగా, రతన్ టాటా హయాంతో పోల్చితే వృద్ధిరేటు మాత్రం తక్కువే. 1991లో టాటా సన్స్‌కు రతన్ టాటా అధిపతి అవగా, అప్పుడు గ్రూప్ మార్కెట్ విలువ 8,000 కోట్ల రూపాయల దిగువే. నాడు స్టాక్ మార్కెట్‌లో ఉన్న టాటా సంస్థల్లో టాటా స్టీల్ మార్కెట్ విలువ అధికం. అయితే 2012 డిసెంబర్‌కల్లా టాటా సన్స్ మార్కెట్ విలువ 57 రెట్లు పెరిగి 4.6 లక్షల కోట్ల రూపాయలకు చేరగా, 2004లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన టిసిఎస్ ఆధిపత్యం నేటికీ కొనసాగుతూ వస్తోంది. ఏదిఏమైనా ఐర్లాండ్‌లో జన్మించిన 48 ఏళ్ల మిస్ర్తి నాయకత్వంపై టాటా సన్స్ నాలుగేళ్లలోనే విశ్వాసాన్ని కోల్పోయిందన్నది నిజం. అయతే టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కలిగిన మిస్ర్తి కుటుంబ సంస్థ షాపూర్జి పల్లోంజి గ్రూప్.. తాజా నిర్ణయాన్ని అన్యాయంగా భావిస్తోంది. ఆకస్మిక తొలగింపుపై మండిపడుతోంది. దీనిపై న్యాయ పోరాటం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయ. మరోవైపు సంస్థ ప్రయోజనా లు, సుస్థిరత కోసం కొత్త బాధ్యతలను స్వీకరిస్తున్నానని టాటా గ్రూప్ సంస్థల ఉద్యోగులకు రతన్ టాటా సోమవారం ఓ లేఖను రాశారు.

రతన్ టాటాతో సైరస్ మిస్ర్తి (పాత చిత్రం)