బిజినెస్

ఐడిఎస్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయడం కోసం తమ ప్రభుత్వం తెచ్చిన ఆదాయ ధ్రువీకరణ పథకం (ఐడిఎస్) గొప్ప విజయం సాధించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 1997లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చంధ ఆదాయ ప్రకటన పథకం (విడిఐఎస్) కంటే ఇది ప్రభావవంతంగా పనిచేసిందని, నాటితో పోల్చితే నేడు మూడు రెట్లు అధికంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఐడిఎస్‌లో 64,275 మంది తమ వద్దనున్న 65,250 కోట్ల రూపాయల నల్లధనాన్ని బహీర్గతం చేశారన్న ఆయన దీనివల్ల పన్నుల రూపంలో ఖజానాకు 29,362.5 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందన్నారు. విడిఐఎస్‌లో 4.72 లక్షల మంది ప్రకటించిన నల్లధనం విలువ 33,697 కోట్ల రూపాయలుగానే ఉందని, పన్నుల ద్వారా దీనిపై వచ్చిన ఆదాయం 9,729 కోట్ల రూపాయలుగానే ఉందని గుర్తుచేశారు. కాబట్టి విడిఐఎస్ కంటే ఈ ఏడాది తాము తెచ్చిన ఐడిఎస్ భారీ విజయానే్న సాధించిందని స్పష్టమైందన్నారు. కాగా, ఈ సెప్టెంబర్ 30తో ముగిసిన ఐడిఎస్ క్రింద ప్రభుత్వం.. పన్నుల ఎగవేత ద్వారా పోగేసిన అక్రమ సంపదను సక్రమ సంపదగా మార్చుకునేందుకు ఓ అవకాశం కల్పించినది తెలిసిందే. అయితే ప్రకటించిన బ్లాక్‌మనీలో 45 శాతాన్ని పన్నులు, జరిమానా రూపంలో ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మిగతా 55 శాతం సొమ్ము వైట్‌మనీ అయిపోతుందన్నమాట. కానీ విడిఐఎస్‌లో పన్ను రేటు 10 శాతం దిగువనే ఉందన్న జైట్లీ.. అది పూర్తిగా క్షమాబిక్ష పథకమేనని, ఐడిఎస్ మాత్రం అలా కాదని పేర్కొన్నారు. నిరుడు కూడా ఇలాంటిదే ఓ పథకాన్ని భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం వెలికితీత కోసం నరేంద్ర మోదీ సర్కారు తీసుకురాగా, 644 మంది తమ అక్రమ సంపద వివరాలను వెల్లడించారు. దీంతో పన్నుల రూపంలో 2,428 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. లక్షల కోట్ల రూపాయల్లో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మోదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలనే చేస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా 500, 1,000 రూపాయల నోట్లను ఏకంగా రద్దు చేసేసింది కూడా. దీని ద్వారా నల్లధనం వెలికితీతలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం వెనుకాడబోయేది లేదని మోదీ స్పష్టమైన సంకేతాలిచ్చినట్లైంది.
నకిలీ కరెన్సీ పట్టివేత
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు 28 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని పట్టుకున్నామని జైట్లీ తెలిపారు. ఇందులో 27.79 కోట్ల రూపాయల విలువైన 5.74 లక్షల నోట్లుండగా, మరో 6.37 లక్షల రూపాయల విలువైన 5, 10 రూపాయల నాణేలున్నట్లు లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా జైట్లీ వివరించారు. జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం 2015లో 8.86 లక్షలకుపైగా నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించారని, వీటి విలువ 43.83 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. అలాగే 2014లో 40.58 కోట్ల రూపాయల విలువైన 8 లక్షలకుపైగా నకిలీ నోట్లను పట్టుకున్నట్లు చెప్పారు.
రూ. 76,685 కోట్లు
తీసుకున్న రుణాలను కావాలనే ఎగ్గొట్టేవారి (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) సంఖ్య గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 16 శాతం పెరిగిందని ప్రభుత్వరంగ బ్యాంకులు పేర్కొన్నాయి. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అలాగే ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8,167 మంది విల్‌ఫుల్ డిఫాల్టర్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) విలువ 76,685 కోట్ల రూపాయలుగా ఉందని వివరించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇది 59,656 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇక 21,509 కోట్ల రూపాయల విలువైన మొండి బకాయిల వసూళ్లలో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1,724 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ఈ కేసుల్లో నేర నిర్ధారణ రేటు కేవలం 1.14 శాతంగానే ఉందన్నారు.
మరోసారి సహారా ఆస్తుల వేలం
న్యూఢిల్లీ, నవంబర్ 18: సుబ్రతారాయ్ నేతృత్వంలోని సహారా గ్రూప్‌నకు చెందిన ఆస్తులను వేలం వేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సిద్ధమైంది. వచ్చే నెల నిర్వహించే ఈ-వేలం కోసం ఐదు స్థలాలను సమాయత్తం చేసింది. వీటి రిజర్వ్ ధర 130 కోట్ల రూపాయలు. ఇంతకుముందు అక్టోబర్‌లోనూ వేలం జరపగా, ఇందులో వేసిన ఆస్తుల రిజర్వ్ ధర దాదాపు 1,400 కోట్ల రూపాయలు. అంతకుముందు జూలైలో వేలం వేసిన ఆస్తుల రిజర్వ్ ధర సుమారు 5,000 కోట్ల రూపాయలు. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించిందన్న కేసులో సహారా ఆస్తులను సెబీ అమ్మేస్తున్నది తెలిసిందే. ఇదే కేసులో రాయ్ చాలాకాలం తీహార్ జైళ్లో ఉన్నదీ విదితమే.