రాష్ట్రీయం

కాల్‌మనీపై సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: రాష్టవ్య్రాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కాల్‌మనీ లైంగిక వేధింపులపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో కేబినెట్ సమావేశమైంది. ముందుగా కాల్‌మనీ లైంగిక వేధింపుల అంశంపై తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. ఓ దశలో డిజిపి జెవి రాముడు, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌లను పిలిపించుకుని వారినుంచి పలు వాస్తవిక పరిస్థితులను రాబట్టింది. రాష్ట్రంలో మనీ లెండింగ్‌పై నూతన చట్టాన్ని తీసుకురావడానికి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోడానికి తక్షణం నమూనా ప్రతి సిద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రజల ఫిర్యాదులు, పోలీసు శాఖ దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకోవాలని, ఎంతటి వారైనా ఉపేక్షించరాదని కేబినెట్ ఆదేశించింది. ఫిర్యాదుదారులెవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ మంత్రివర్గం భరోసా ఇచ్చింది. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం పెంపునకు రాష్ట్రం కనీసం రూ.1200 కోట్లు భరించాల్సి ఉన్నందున ముందుగా కేంద్రంతో చర్చించి ఆపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మంత్రివర్గ ఉప సంఘం గతంలో పలు దఫాలు చర్చించి మూడు కేటగిరిల్లో వేతనాల పెంపునకు రూ.329 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేయటం జరిగింది. గతంలో 90 శాతం కేంద్ర గ్రాంట్, మిగిలిన 10 శాతం రాష్ట్ర వాటాగా ఉండేది. అయితే నీతి అయోగ్ కింద 60 శాతం కేంద్ర వాటా, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేట్ వర్శిటీల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇందుకోసం దేశంలోని 20 అత్యున్నత, ప్రపంచంలోని 15 అత్యున్నత వర్శిటీలు దరఖాస్తులు ఆహ్వానించి ఉన్నత ప్రమాణాలు కల్గిన వాటికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించాలని, నిరుపేద బీసీ విద్యార్థులకు ఆర్థిక చేయూత నందించాలని నిర్ణయించారు. ప్రైవేట్ వర్శిటీల ద్వారా రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్‌గా మార్చే మార్గదర్శకాలపై కమిటీ వేసి ఎప్పటికప్పుడు చర్చించాలని నిర్ణయించారు. పంచదార ఫ్యాక్టరీల నుంచి వసూలు చేస్తున్న వ్యాట్, సిఎస్‌టిలను తొలగించే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో భాగంగా దీర్ఘకాలిక భూ కేటాయింపుల లీజ్ పరిమితిని 99 ఏళ్లకు పెంచుతూ గతంలో జారీ అయిన ఆర్డినెన్స్‌పై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకురాలని కూడా నిర్ణయించారు.
కాల్‌మనీ కేసులో వైకాపా నేతలే అధికం!
మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ సంఘటనలో ఇప్పటికీ 80మందిని పోలీసులు గుర్తించారని వారిపై విచారణ కొనసాగుతుందన్నారు. వీరిలో వైకాపాకు చెందిన వారు 27 మందికాగా తెదేపా 6, సిపిఐ 3, ఇతరులు 44మంది ఉన్నట్లు తెలిపారు. ఒకవైపు కొత్తగా మనీ లెండింగ్ చట్టాన్ని తీసుకువస్తూనే, సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మూడు నాలుగు రాష్ట్రాల్లో మనీ లెండింగ్ చట్టం అమల్లో ఉందని వాటిని అధ్యయనం చేసి ఉత్తమమైన రీతిలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

చిత్రం... విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు