అక్షర

అసామాన్య ప్రతిభకు అక్షర నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ
- డా.పి.శంకరరావు,
పుటలు: 500;
వెల: 350-00
దొరుకు స్థలం:
రచయిత, 103ఎ,
అట్లాంటిక్ సిటీ
అపార్ట్‌మెంట్స్,
దీప్తిశ్రీనగర్, మియాపూర్,
హైదరాబాదు- 500 049
సెల్: 9885898297
**
తెలుగు కవి పండిత లోకానికి తలమానికంగా నిలచి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన అవధాన శిరోమణి, మహాకావ్యప్రణేత, పూసపాటి నాగేశ్వరరావు (1920-1994). కట్టమంచి రామలింగారెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జమ్మలమడక మాధవరాయశర్మ, వివియల్ నరసింహరావు, ఎర్రోజు మాధవాచార్యులు, ఏటుకూరి వెంకట నరసయ్య లాంటి మహామహుల ప్రశంసలకు పాత్రమైనవారు. వీరి అవధాన కవిత్వ వైశిష్ట్యాన్ని, కావ్య నిర్మాణ కౌశలాన్ని విశే్లషిస్తు పూసపాటి శంకరరావు రాసిన గ్రంథమిది. ఇందుకుగాను శంకరరావుకు మైసూరు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టంతో సత్కరించింది. శంకరరావు గణిత శాస్త్ధ్య్రాపకులుగా అనేక పాఠశాలల్లో పనిచేసినవారు. రిటైర్ అయిన తర్వాత తెలుగు ఎం.ఏ.లో కృతార్థులై ఈ సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఇది మన యువ పరిశోధకమ్మన్యులు గుర్తించి స్ఫూర్తి పొంది పరిశోధకమాన్యులుగా పరిణమించవలసిన అంశం.
పరిశోధితుడైన పూసపాటి నాగేశ్వరరావుగారిదీ, పరిశోధకుడైన శంకరరావుదీ గుంటూరు జిల్లా రావెల గ్రామం. అందుకోసం పరిశోధకులు రావెల గ్రామం పుట్టుపూర్వోత్తరాలు, రాజులు, కవులు, ఆధునిక ప్రముఖుల గురించి తారీఖులు దస్తవేజుల ప్రదర్శనతో ప్రామాణికంగా రెండు అధ్యాయాలు రాశారు.
నాగేశ్వరరావు రచించిన శిల్పసుందరి, ఆదర్శపద్మిని, శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్రము, వాసవీ కన్యక చరిత్రము మొదలైన కావ్యాలను, విశ్వబ్రాహ్మణ సంస్కృతి- సాహిత్య చరిత్ర, సాహిత్య జగత్తులో విశ్వకర్మ, దేవాలయాలు బూతుకొంపలా? లాంటి పరిశోధనాత్మక రచనల వైశిష్ఠ్యాన్ని శంకరరావు సాకల్యంగా సమీక్షించారు. పద్యశిల్పం, చిత్రకవితా విన్యాసం, వర్ణనా చమత్కృతి, కవిత్వ విశే్లషణ, అవధాన సమాలోచనం, బిరుదులు, సత్కరాలు, ప్రసంగాలు, ప్రముఖుల కవి పండితులతో పరిచయాలు వివరించి చివరికి నాగేశ్వరరావుమీద ఆయన రచనల మీద అభిప్రాయాలను సమీక్షలను, ఉత్తరప్రత్యుత్తరాలను పొందుపరిచారు.
ఇవన్నీ స్వీకృత పరిశోధనాంశంపట్ల పూసపాటి శంకరరావుకు ఉన్న శ్రద్ధాసక్తులకు, పరిశోధనానురక్తికి దర్పణంగా నిలిచి అనివార్యంగా అభినందన పాత్రుని చేస్తున్నాయి.
ఒక భేద భావాంధునకు నేఁడు శిల్పుల
వంశంబులే కనుపట్టఁబోవు
ఒక సంకర మతస్థునకు శిల్పుల మతంబు
కడు విరుద్ధంబుగాఁగానుపించు
ఒక కువిమర్శకునకు శిల్పుల చరిత్ర
మవధరింపఁగఁ సంశయములు గల్గు
ఒక యసూయావేశునకు శిల్పుల గురుత్వ
మనినఁజాలు దురాగ్రహంబు పుట్టు.
వేదశిల్పుల నిందించి వెడఁగు బుద్ధి
లేనిపోనివి కొన్ని కల్పించినంత
తెల్లవాఱినదా? పిల్లపిల్లతరము
కట్టి కుడిపింపదా పాపకర్మఫలము! (శిల్పసుందరి-4-9) జీవం, జవం కలిగిన వైజ్ఞానిక కళయైన ‘‘శిల్ప’’కళలో పారంగతులైనవారు సృజించిన అజంతా, ఎల్లోరా, హంపీ, సింహాచలం, అమరావతి, రామప్పగుడి, కోణార్క లాంటి శిల్పాలను- వాటి స్రష్టల కళానైపుణ్యాన్ని పూసపాటి నాగేశ్వరరావు వేనోళ్ళ స్తుతించారు. కట్టమంచి రామలింగారెడ్డి శిల్పసుందరి కావ్యాన్ని సుందర కావ్యంగా అభివర్ణించి ఆశీర్వదించారు. అల్లావుద్దీన్ ఖిల్జి కాముకదృష్టి నెదిరించి వీరమరణం పొందిన చిత్తోడు పట్టపురాణి పద్మిని వీరగాథను ఆదర్శపద్మిని పేరుతో స్ఫూర్తిమంతమైన కావ్యంగా మలిచారు.
పూసపాటి నాగేశ్వరరావును చరితార్థుని చేసింది వారి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మహాకావ్యం. ఇది 1161 గద్యపద్యాల కావ్యం. ఇటువంటి మహాకావ్యాలు రాయగల్గినవారు ఏ కొందరో ఉన్నారు. వాటిని అర్థం చేసుకొని ఆస్వాదించ గలిగిన భావుకులు మరీ తక్కువ. కథా నిర్మాణ కౌశలం, ప్రౌఢి, వర్ణనా వైలక్షణ్యం అసామాన్యం అని విశ్వనాథ కవి సమ్రాట్టులే ప్రస్తుతించారు. విశ్వనాథ అధ్యక్షతలో పోకూరి కాశీపత్యవ ధానులు, జమ్మలమడక రాయశర్మ, ఎర్రోజు మాధవాచార్యులు, వివియల్ నరసింహరావు లాంటి విద్వద్వరేణ్యులు నాగేశ్వరరావుగారిని గంఢపెండేరంతో సత్కరించారు.
ఒక మహాకవి ప్రతిభా వ్యుత్పత్తులను, కావ్య నిర్మాణ దక్షతను మనసారా ఆస్వాదించి ప్రశంసించే ఉత్తమాభిరుచి తెలుగువారిలో మరింత కలగాలని. దానికి కులమత ప్రాంత వాద వివక్షల కళంకాలు అంటకూడదని కోరుకుందాం. నవ్యసంప్రదాయ పద్యకవిగా, విద్యార్థులలో జ్ఞాన సౌశీల్యాలు ప్రోదిచేసిన ఆదర్శోపాధ్యాయునిగా, పండితునిగా, గ్రంథపరిష్కర్తగా అవధానిగా బహుముఖ ప్రతిభను వెలార్చిన పూసపాటి నాగేశ్వరరావు సాహిత్య జీవిత వ్యాసంగాలను ఆయన స్థాయికి తగిన రీతిగా నిశిత దృష్టితో పరిశీలించి రాసిన శంకరరావు అభినందనీయులు.

-వెలుదండ నిత్యానందరావు