అక్షర

అభ్యుదయాన్ని కాంక్షించే కవిత్వం ‘ఈ లోకం...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ లోకం నా కౌగిట్లో
-డా.ఆచార్య భావన్
ప్రతులకు: విజయభావన
డా.అ.గోపాలరావు,
ప్రధాన కార్యదర్శి
25-5-15, శారదా మందిరం
సుబ్రహ్మణ్యంపేట
విజయనగరం-02
94404 35262

మినీ కవిత్వం విప్లవోద్యమంగా ఊపందుకున్న దశకంలో అక్షరాలకు జవసత్వాల్ని అందించి కవిత్వ రంగాన్ని పరిపుష్ఠం చేసిన అగ్రగణ్య కవుల్లో ఆచార్య భావన్ ఒకరు. ‘కెరటం నా ఆదర్శం’ కవితతో తెలుగు నాట లబ్దిప్రతిష్ఠునిగా వాసికెక్కి, ప్రత్యేక గుర్తింపు పొందిన మినీకవి. తుదిశ్వాస విడిచేదాకా కలంతో జతకట్టి సాహిత్య వ్యక్తిత్వంతో గుబాళించిన నిరాడంబర స్నేహశీలి. ‘విజయభావన’ సాహితీ సంస్థతో పెనవేసుకున్న అనుబంధంతో ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపిన నిర్వహణా కార్యదక్షుడు. వక్త. విమర్శకుడు. పరిశోధకుడు. చిత్రకారుడు. ‘అక్షర లక్షలు’ ‘విశ్వవిపంచి’ ‘అక్షరం’ మినీ, దీర్ఘ, కవితా సంపుటులతో సాహిత్య లోకంలో సుస్థిరమైన స్థానాన్ని పొందిన అభ్యుదయవాది. మరణానంతరం అతని సన్నిహిత మిత్రుడు ప్రసాదవర్మ చొరవతో స్వదస్తూరిలో వెలుగు చూసిన మరో మినీ కవితా సంపుటి ‘ఈ లోకం నా కౌగిట్లో’. 116 కవితా ఖండికలు ఉన్న ఈ పుస్తకంలో మేధస్సుకి పదునుపెట్టే అక్షరాయుధాలు అనేకం తొంగి చూస్తాయి. సామాజికాభ్యుదయాన్ని కాంక్షించే మనస్తత్వ సంభాషణలు ఈ సంపుటి నిండా ధారగా ప్రవహిస్తాయి.
‘వెదురు ముక్కలో/ వేదనాదాలు/ వెలుతురు చుక్కలో/ వేల నినాదాలు’ అని ‘నాద నినాదాలు’ కవితలో ధ్వనించడం వెనుక చెప్పలేనంత వేదనార్తి దాగి ఉంది. ఆదిమ స్వరంలో ప్రగతి జ్యోతిని వెలిగించడానికి కవి ఆచార్య భావన్ పడే తాపత్రయం మాటల్లో చెప్పలేనిది. వౌన సంఘర్షణలోంచి వినిపించే వేణువు రాగాలాపన ప్రగతికి సంకేతమైన వెలుతురు చుక్కలో ప్రతిధ్వనిస్తుంది. కవిత్వ రచనలో చెయ్యి తిరిగిన కవే ఈ పోలికను చెప్పగలడు. గాఢాభివ్యక్తితో అనుభూతిని పంచగలడు.
‘గుడి తలుపులు మూసి/ బయటనే వుండి పొమ్మని/ వాళ్లు నిన్ను శాసిస్తే/ గుండె తలుపులు తెరిచి/ లోపలికి రమ్మని/ వాళ్లని నువ్వు ఆహ్వానిస్తే/ నువ్వు కాదు/ వాళ్లూ అస్పృశ్యులు’ అంటారు కవి ఆచార్య భావన్ ‘ఎవరు’ కవితలో. అంటరానితనం మనుషుల్ని మనసుల్తో వేరుచేసి దూరాల దారుల్ని మనిషితనంగా పరుస్తున్న వేళ, సంస్కార గుణంతో అగ్రకులాల మాలిన్యాన్ని కడిగి పునీతం చెయ్యగల పరుసవేది విద్యను ఇందులో ప్రదర్శిస్తారు. చెంపపెట్టు సమాధానంతో నిమ్నజాతుల చైతన్య శక్తిని మానవత్వంతో అంతర్లీనంగా తడిమి మేల్కొలిపే కవితా పాదాలివి. కవి సమయస్ఫూర్తిని అద్దం పట్టిస్తాయి.
‘బొమ్మ-బొరుసు’ శీర్షికలో కవి అంతర్మథనం వేదనతో కొట్టుమిట్టాడుతుంది.
‘టైట్ షర్టులో వున్న/ అమ్మాయి ఛాతీ/ నాగరికతతో పోటీ/ చిరుగుల జాకెట్టులో వున్న/ అమ్మి ఛాతీ/ పేదరికంతో భేటీ’ అని అన్నపుడు నవనాగరిక వ్యవస్థలో సంపన్న వర్గం అమ్మాయి ధనికత్వం, బీదరికంలో మగ్గుతున్న చిరుగుల బతుకుకు ప్రతిరూపమైన పేదమ్మాయి లేమితనంతో పోటీ పడుతుంది. సమసమాజ స్థాపనలో వెనకడుగు వేస్తున్న వర్తమాన సామాజిక విషాద దృశ్య చిత్రానికి నిలువుటద్ద ప్రతిబింబమిది. పేద- ధనిక వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాస చిత్రీకరణకు సమగ్ర రూపమిది. కవి ఆచార్య భావన్ లోచూపు విశే్లషణకు దర్పణం పట్టిస్తుంది.
‘ఆకాశాన్ని నా గుప్పిట్లో/ బిగించాలని ఉంది/ సముద్రాన్ని నా గుండెల్లో/ బంధించాలని ఉంది/ నాకేమో స్వేచ్ఛ కావాలి/ అవును మరి/ నేను మనిషిని’ అంటూ వ్యక్తీకరించడంలో అపరిమితమైన స్వేచ్ఛని అనుభవించే మనిషి అంతరంగం బయటపడుతుంది. పంచభూతాలకూ అతీతమైన విశాల ఊహా భావనా శక్తిని తన ఆలోచనా పరిధిలోంచి విస్తృత పరచడానికి కవి పడే ఆరాటం వర్ణనాతీతమైనది. ఆంక్షలు లేని స్వతంత్ర స్వేచ్ఛని పొందాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఆచార్య భావన్.
‘విశ్వ శ్రేయ్స తైలంగా/ మానవ కల్యాణమే వత్తిగా/ వెలిగే కవితా దీపిక/ అజ్ఞాన తిమిరాన్ని ఛేదిస్తుంది/ నూత్న చైతన్య సమరాన్ని సృష్టిస్తుంది’ అని ఎలుగెత్తి చాటడం వెనుక విశ్వ మానవ ప్రపంచాన్ని ఏకతాటిపై నడిపించే అవసరాన్ని గుర్తెరిగి కర్తవ్య బోధనతో తన భుజస్కంధాలపై వేసుకుంటాడు కవి. ఈ పిలుపులో జడత్వాన్ని పోగొట్టి చైతన్యపూరితమైన సమాజాన్ని అంతర్జాతీయంగా తట్టిలేపాలనే ధ్వని వినిపిస్తుంది. లోక కల్యాణానికి కవితా శంఖారావాన్ని పూరించి అజ్ఞాన తిమిరాన్ని ఛేదించాలనే భావన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ స్ఫూర్తిని అన్ని వర్గాలకీ వర్తింపజెయ్యడమే దీనిలోని అంతర్లీన సందేశం.
జాషువా, దాశరథి, శ్రీశ్రీల కవితావేశంతోపాటు, రుబారుూల్లోని తాత్త్వికత, గాఢత, సరళత, ఆచార్య భావన్ కవితల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తాయి. వాక్య నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర కనబడుతుంది. ఆశావహ దృక్పథం, అంత్యప్రాసలపై మమకారం, క్లుప్తతలోని భాషా సౌందర్యం, భావ చైతన్యం, సహజత్వ పరిమళం, అలంకార ప్రియత్వం కవిత్వం పొడుగునా దర్శనమిస్తాయి. మానవ సంబంధాల పట్ల అవగాహన, సామాజిక రుగ్మతలపై విముఖత, తార్కిక సత్యాల అనే్వషణ, మధ్యతరగతి మానవుల జీవన సంఘర్షణ, ఆధునికత ముసుగులో దాగిన బీభత్స చిత్రణ, స్వేచ్ఛా పిపాస, ఆదర్శాభ్యుదయం, హేతువాద చూపు, పంచభూతాల స్పర్శ వంటి కవితా వస్తువుల సమాహారంతో ఈ సంపుటి నిండుదనాన్ని సంతరించుకుంది. ఇలా బహుముఖ పార్శ్వాల్లో తనదైన విలక్షణ ముద్రతో ఆకట్టుకున్న కవిగా ఆచార్య భావన్ చేసిన సాహిత్య ప్రయాణం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.

-మానాపురం రాజా చంద్రశేఖర్