క్రైమ్/లీగల్

బెంగళూరులో ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 8: కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, రాంనగర్ జిల్లా, కనకపురం బస్ట్ఫా వద్ద ఎల్.మధు అనే స్మగ్లర్‌ను చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి వెల్లడించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్‌పల్లి వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన గాజులమండ్యం పోలీసులు తమిళనాడు సేలం జిల్లా, అన్నైకడు గ్రామానికి చెందిన ఎస్.కుమార్ (34) అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతని వద్ద నుంచి 631.7 కేజీల బరువున్న 22 ఎర్రచందనం దుంగలు, ఏపీ21 టిఎక్స్ 2370 నెంబర్ గల లారీని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో పరారీలోవున్న ఎల్.మధు సమాచారం అందడంతో బెంగళూరు కనకపురం బస్ట్ఫా వద్ద అరెస్టు చేశామన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో దేగులమఠం రోడ్డులోని అతనికి చెందిన రంపుపు మిల్లులో దాచివున్న 2.25 టన్నుల బరువున్న 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బెంగళూరుకి చెందిన ప్రధాన స్మగ్లర్ అప్సర్ అలియాస్ అఫ్రోజ్ శేషాచల కొండల నుంచి ఎర్రచందనం వృక్షాలను నరికి పట్టుబడ్డ నిందితుడు దీపు రంపపు మిల్లులో దాచేవాడని ఎస్పీ వివరించారు. దీనిని ఎర్రచందనం దుంగలను దాచుకునే గోడౌన్‌గా వాడుకునేవాడన్నారు. ఈ కేసులో అప్సర్‌తోపాటు మరి కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్పీ అభిషేక్ మహంతి వివరించారు.

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పుత్తూరు, జూలై 8: పుత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సదాశివకోనలో శనివారం సాయంత్రం ఎస్టీ ఎఫ్ సిబ్బంది, ఫారెస్టు అధికారులు దాడులు చేసి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్ సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టుకున్న ఎర్రచందనం విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందన్నారు. వీటిని అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచారని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గంగాధర్, బీట్ ఆఫీసర్ అబ్దుల్ బాషా, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.