క్రైమ్/లీగల్

స్వలింగ సంపర్కం నేరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: స్వలింగ సంపర్కం నేరం కాదని, ప్రస్తుతం అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 377 సెక్షన్ భారత రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. బ్రిటిష్ పాలనలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించారు. ఆ చట్టాలే స్వతంత్ర భారత దేశంలోనూ అమలవుతున్నాయి. 158 సంవత్సరాల క్రితం స్వలింగ సంపర్కం నేరమంటూ చేసిన చట్టానికి సుప్రీం కోర్టు తీర్పుతో కాలంచెల్లింది. సమాజంలో అందరూ సమానమేనని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తుండగా, ఐపీసీ 377 చట్టం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెల్లడించింది. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జండర్ అండ్ క్వీర్ (ఎల్‌జీబీటీక్యూ)లకు కూడా సాధారణ పౌరుల మాదిరిగానే అన్ని రకాల హక్కులు ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. శారీరక సంబంధం అనేది ప్రకృతి సహజమని, దీనికి ఆంక్షలు పెట్టడంలో అర్థం లేదని పేర్కొంది. ఐపీసీ 377 చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని 14, 15, 19, 21 అధికరణలకు పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను కాలరాసే ఎలాంటి చట్టానికైనా విలువ ఉండదని వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కం అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందని 493 పేజీల తీర్పులో వివరించింది. ఎల్‌జీబీటీక్యూకి చెందిన ఎంతోమందికి గత ఒకటిన్నర శతాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నదని, వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ధర్మాసనంలో సభ్యురాలు జస్టిస్ ఇందూ మలోత్రా అభిప్రాయపడ్డారు. ఈ రకానికి చెందిన వారిని 377 సెక్షన్‌ను అడ్డం పెట్టుకొని నానారకాలుగా హింసిస్తున్నారని, చిన్నచూపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కేవలం ఈ సెక్షన్ కారణంగానే ఎల్‌జీబీటీక్యూ సమూహం మన సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవితాలను వెల్లదీస్తున్నారని ధర్మాసనంలోని మరో సభ్యుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వారికి కూడా అన్ని రకాల హక్కులు ఉంటాయని, కానీ, 377 సెక్షన్ కారణంగా వారికి వారి హక్కుల దక్కకుండా పోతున్నాయని అన్నారు. సంపర్కం కేవలం మహిళలు, పురుషుల మధ్యే ఉండాలన్న నిబంధ లేదని, ఇద్దరి పురుషుల మధ్య (గే) లేదా ఇద్దరు మహిళల మధ్య (లెస్బియన్) కూడా ఉండవచ్చని పేర్కొన్నారు. శారీరక సంబంధం కేవలం స్ర్తి, పురుషుల మధ్యే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా సూచించలేదని చంద్రచూడ్ గుర్తుచేశారు. ధర్మాసనంలో ఉన్న మరో ఇద్దరు సభ్యులు జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, ఏఎం ఖన్వీల్కర్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే వెల్లడించారు. స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చిచెప్పారు. రాజ్యాంగంలో పౌరులకు లభించిన హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఐపీసీ 377 సెక్షన్‌ను ఎత్తివేయాలన్నారు.
25 దేశాల సరసన భారత్..
స్వలింగ సంపర్కం నేరం కాదని, సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఇప్పటికే స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేసిన 25 ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటికీ 72 దేశాల్లో స్వలింగసంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. అసహజమైన లైంగిక సంపర్కం నేరమంటూ ఐపీసీ 377 సెక్షన్ కింద విధించిన ఆంక్షలు చెల్లనేరవని, కేవలం లింగపరమైన కారణంతో ఎవరిపై వివక్ష చూపడం వీలుకాదని, సుప్రీం కోర్టు గురువారం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో భారత్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్స్‌వల్, ట్రాన్స్ అండ్ ఇంటర్ సెక్స్ అసోసియేషన్ (ఐఎల్‌జీఎ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎనిమిది దేశాల్లో స్వలింగ సంపర్కానికి మరణశిక్ష విధిస్తున్నారు. 12కు పైగా దేశాలు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నాయి. ఇలావుండగా స్వలింగ వ్యక్తుల మధ్య సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ అమలవుతున్న చట్టాలపై భారత్‌కు చెందిన హక్కుల సంస్థలు సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తూ వచ్చాయి. స్వలింగ సంపర్కులను సమాజంలోని ఇతర పౌరులతో భిన్నంగా చూడటం తగదని జూలై 2009న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారు మొదటి విజయం సాధించారు. అయితే 2012న సుప్రీం కోర్టు దానిని కొట్టివేసింది. చట్టబద్ధంగా అది సాధ్యం కాదని పేర్కొంది. 2015లో లోక్‌సభలో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఎన్డీఏ వ్యాఖ్యానిస్తూ ఇప్పటికిప్పుడు స్వలింగసంపర్కాన్ని చట్టబద్ధం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ తిరస్కరించింది. తర్వాత ఎల్‌జిబిటి ఏక్టీవిటిస్టులు ఎన్‌ఎస్ జవహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, చెఫ్ రిత్ దాల్మియా, అమన్‌నాథ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆయేష్ కుమార్ తదితరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇష్టమైన వారితో లైంగిక సంబంధం కలిగి ఉండటం, లైంగిక స్వతంత్రం, లైంగిక భాగస్వామిని ఎన్నుకోవడం, గౌరవం, సమానత్వం అన్నవి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని, వీటిని భంగం కలిగించేలా సెక్షన్ 377 ఉందని పేర్కొంటూ వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారి వాదనకు ఏకీభవిస్తూ ఈ విషయాన్ని పునః పరిశీలించడానికి ఆగస్టు 2017న సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై జరిగిన వాదోపవాదాల అనంతరం 377 సెక్షన్ కొందరి పౌరుల సమానత్వం, గౌరవంగా జీవించే హక్కులను కాలరాస్తోందని భావించి దానిని కొట్టివేసింది.
చీకటి అధ్యాయానికి తెర: అమ్మెస్టీ
స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రపంచ మానవహక్కుల సంస్థ అమ్మెస్టీ హర్షం వ్యక్తం చేసింది. న్యాయం, సమానత్వం కోసం ఎవరైనా పోరాటం చేయవచ్చున్య ధైర్యా న్ని ఈ తీర్పు కల్పించిందని సంస్థ ప్రోగ్రామ్ డైరెక్టర్ అస్మితా బసు వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో సుప్రీం కోర్టు భారత చరిత్రలోని చీకటి అధ్యాయానికి తెరదించుతూ కోట్లాది ప్రజలకు నూతన శకాన్ని ఆవిష్కరించిందని అన్నారు. ఇంతకాలం వివక్షకు గురైన ఎల్‌జిబిటిఐ వర్గానికి ఈ విజ యం మైలురాయి అని ఆమె వ్యాఖ్యానించారు. వివాహం, దత్తత లాంటి అంశాల్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక తెరపడనుందన్నారు. ఇది కేవలం స్వలింగ సంపర్కులకు మాత్రమే సం తోషం కలిగించే తీర్పు కాదని, సమాజంలో వివక్షకు గురైన ఏ వర్గం వారైనా తమకు న్యాయం, సమానత్వం కోసం పోరాడవచ్చునని సందేశాన్ని స్పష్టంగా ఇచ్చిందని ఆమె అన్నారు.