క్రైమ్/లీగల్

ఘరానా దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 14: జిల్లా వ్యాప్తంగా పలు ఇళ్లల్లో దొంగతనాలు చేసి భారీగా దోపిడీకి పాల్పడుతున్న ఘరానా దొంగను షేక్ మహ్మద్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టుచేశారు. శుక్రవారం సాయంత్రం అదనపు ఎస్పీ శ్రీనివాసులురెడ్డి జిల్లాపోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో, అరెస్టుచేసిన దొంగను, స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి,నగదులను పాత్రికేయుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ మహ్మద్ హుస్సేన్ కడప నగరంలోని కుమ్మరికుంట వీధిలో నివాసం ఉంటాడని తెలిపారు. నగరంలో బంగారు షాపుల్లో బంగారుపని చేస్తుండేవాడని అన్నారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనంతో అప్పులపాలయ్యాడని, అప్పుల వత్తిళ్లు తట్టుకోలేక దొంగతనాలకు అలవాటుపడ్డాడని తెలిపారు. ఇతను చాలా వ్యూహాత్మకంగా దొంగతనాలు చేసే వాడని తెలిపారు. పగలు సమయంలో రెక్కీ నిర్వహిస్తాడని, ఏఏ ఇల్లు తాళాలువేసి వున్నాయి, చుట్టుపక్కల వారు ఆ ఇంటికి ఎంత దూరంలో ఉన్నారు తదితర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తాడని ఆయన అన్నారు. ఆ తర్వాత తనకు అనుకూలంగా ఉన్న ఇంటికి దగ్గరలో దర్గా, మసీదులు ఉంటే అక్కడ అర్ధరాత్రి వరకు పడుకుని, దర్గా టోపీ పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా లక్ష్యంచేసుకున్న ఇళ్లకు ఆరోజు రాత్రి వెళ్లి చాకచక్యంగా తాళాలు పగులకొట్టి దొంగతనానికి పాల్పడతారని అదనపు ఎస్పీ తెలిపారు. గత ఆరేళ్లుగా నగరంలో టుటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 32, తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో 14, చిన్నచౌకు పోలీసుస్టేషన్ పరిధిలో 3, వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 4, మొత్తం 53 దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. కడప నగరంలోని మాసాపేట దొరల గోరీలవద్ద వాహనాల తనిఖీలో హోండా డియో స్కూటిలో అనుమానాస్పదంగా వెళ్తున్న మహ్మద్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలన్నీ బయటకు వచ్చాయని ఏఎస్పీ తెలిపారు. ఇతన్ని అరెస్టు చేసిన సమయంలో రూ.55.45 లక్షల విలువైన 2కేజీల 54గ్రాముల బంగారు, రూ.1.90లక్షలు విలువచేసే 4కేజీల 743 గ్రాముల వెండి, నగదు ఒక రూ. 1.47 లక్షలు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనం సమయంలో అతను ఉపయోగించే ఇనుపరాడ్డు తదితర పరికరాలు, అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ మాసూంబాషా, క్రైమ్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, కడప వన్ సీఐ పివి సత్యనారాయణ, టుటౌన్ ఎస్‌ఐ జి.అమరనాధరెడ్డి, టుటౌన్ హెడ్‌కానిస్టేబుల్ చాన్‌బాషా, తదితర కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ కేసును చేధించిన వీరందర్నీ అడిషనల్ ఎస్పీ అభినందించారు.