క్రైమ్/లీగల్

వ్యాపార లావాదేవీలతోనే హత్య?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హత్య కేసులో వీడిన చిక్కుముడి!
* కాళ్లు, చేతులు తీయమని సుపారి
* హంతకులను ఏర్పాటు చేసిన బేల్దారి మేస్ర్తీ
* త్వరలో మీడియా ముందుకు నిందితులు

=================================
నెల్లూరు, అక్టోబర్ 8: నగరంలో సంచలనం రేపిన బిల్డర్ శిరీష్ హత్య కేసులో పోలీసులు త్వరితగతిన పురోగతి సాధించారు. కేవలం అసూయ, వ్యాపార లావాదేవీలతోనే శిరీష్ హత్యకు రూపకల్పన జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న శిరీష్ వ్యాపార భాగస్వామి శోభన్‌తో పాటు బేల్దారి మేస్ర్తీ భూపతిలు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. నెల్లూరు శిరీష్‌కుమార్ (37)కు, విద్యానగర్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న శోభన్‌కుమార్ కుటుంబానికి గత కొనే్నళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ సత్సంబంధాలతో 2015 నుండి కోవూరు పంచాయతీ పరిధిలోని ఇంద్రలోక్ అవెన్యూలో వీరిద్దరూ భాగస్వామ్యంతో అపార్ట్‌మెంటు నిర్మాణాలు చేపట్టారు. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపడంతో ఎవరికి వారు వేర్వేరుగా భవన సముదాయాలను నిర్మిస్తూ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అప్పట్నుంచి వీరిద్దరి నడుమ విభేదాలు తలెత్తాయి. తాను నిర్మించే అపార్ట్‌మెంటులో ఇళ్లను కొనుగోలు చేసేందుకు వచ్చే వారిని శోభన్‌కుమార్ అబద్ధపు మాటలతో తనవైపు తిప్పుకుంటున్నారని భావించిన శిరీష్ నిర్మాణాల సమీపంలో ‘ఎవరి మాటలు వినవద్దు’ అంటూ పరోక్షంగా శోభన్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈక్రమంలో ఇటీవల శిరీష్ కడుతున్న నిర్మాణాలు నాణ్యంగా ఉంటుండడంతో అతని వ్యాపారం పుంజుకుంది. దీన్ని మనసులో ఉంచుకున్న శోభన్ ఎలాగైనా శిరీష్‌కు తానేంటో చూపించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం తాను నిర్మిస్తున్న భవనాలకు మేస్ర్తిగా వ్యవహరిస్తున్న భూపతి సహాయం కోరాడు. గతంలోనూ సుపారి తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసి పోలీసు కేసుల్లో ఉన్న భూపతి శోభన్‌తో శిరీష్ కాళ్లు, చేతులు తీసేందుకు రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుని రంగంలోకి దిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే శిరీష్ నిర్మిస్తున్న భవనాలకు కూడా బేల్దారి మేస్ర్తీగా భూపతి వ్యవహరిస్తుండడం గమనార్హం. తాను నిర్మిస్తున్న భవనాల యజమానిని అంతమొందించేందుకు తానే సుపారి తీసుకున్న భూపతి నేరచరిత్రపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. భూపతి పురమాయించిన నిందితులు శిరీష్‌పై బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. దీన్ని బైక్ యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని తొలుత ప్రయత్నించి చివరకు తాగిన మైకంలో ఏకంగా దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న శోభన్‌కుమార్, భూపతిలు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. మృతుడు శిరీష్ కుటుంబీకుల నుండి సరైన సహకారం రాకపోవడంతో ఈ కేసులో పురోగతి సాధించడంలో ఆలస్యం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో వీరిని కూడా పట్టుకుంటామని, రెండు, మూడు రోజుల్లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.