క్రైమ్/లీగల్

సినీఫక్కీలో భారీ చోరీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండేపల్లి, అక్టోబర్ 9: గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన అరుణకుమార్ హోటల్ వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు కోటిన్నర విలువైన నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలను చోరులు అపహరించారు. విశాఖ నుండి తిరుపతికి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆభరణాలున్న బ్యాగ్‌ను బస్సులో ఉంచి, అల్పాహారం చేయడానికి దిగినపుడు, వెనక సీటులో ఉన్న వ్యక్తి ఆ బ్యాగ్‌ను కిటీకీ నుండి మరొకరికి అందించి, పరారవ్వడం విశేషం.
పోలీసుల కథనం ప్రకారం బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహించే నెల్లూరు స్వర్ణాప్యాలెస్‌కు చెందిన వినోద్, రఘురాజా విక్రయం నిమిత్తం నాలుగున్నర కిలోల బంగారు నగలతో విశాఖపట్నం వచ్చారు. అక్కడ కొనుగోలు జరగకపోవడంతో సోమవారం విశాఖ నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తిరుపతి బయల్దేరారు. మార్గమధ్యంలో గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కనగల హోటల్ వద్ద బస్సు ఆగింది. బస్సులోని ప్రయాణీకులతో వినోద్ కూడా కిందకు దిగి, అల్పాహారంచేశాడు. తర్వాత రఘురాజాను అల్పాహారం చేయడానికి రమ్మని బస్సు డోరు వద్ద నిలబడి పిలిచాడు. రఘురాజా నగల బ్యాగును బస్సులోనే వదిలి, కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ఈలోగా ముందస్తు పథకం ప్రకారం వెనుక సీటులో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు బంగారు వస్తువులు ఉన్న బ్యాగ్‌ను బస్సు కిటికీలో నుంచి బయట అప్పటికే కారులో వచ్చిన వారి మనుషులకు అందజేశారు. అనంతరం వారు కూడా కిటికీలో నుంచి దూకి కారెక్కి ఉడాయించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అది చూసి కేకలు వేయటంతో తమ బ్యాగ్ చోరీకి గురైందని వినోద్, రఘురాజా గగ్గోలు పెట్టారు. విశాఖ నుండి నగలతో బయలుదేరిన వీరిని ముందుగానే గమనించిన వారే పథకం ప్రకారం వెంబడించి, ఈ చోరీకి పాల్పడి వుంటారని భావిస్తున్నారు.
హోటల్ యజమాని అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పెద్దాపురం డీఎస్పీ రామారావు, సీఐ జి యువకుమార్, ప్రత్తిపాడు సీఐ ఎ శ్రీనివాసరావు, పెద్దాపురం క్రైం సీఐ ఎస్‌జి వలీ, క్రైం ఎస్సై ఎస్ సూర్యనారాయణ, జగ్గంపేట ఎస్సై ఎం ఏసుబాబు, గండేపల్లి ఏఎస్సై వరహాలరాజు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ రామారావు తెలిపారు.