క్రైమ్/లీగల్

డాక్టర్ శిల్ప మృతికి వైద్యుల లైంగిక వేధింపులే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 9: శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శిల్ప ఆగస్టు 7న ఆత్మహత్యకు పాల్పడటానికి లైంగిక వేధింపులే కారణమని సిట్ విచారణలో తేలిందని సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. డాక్టర్ శిల్ప పీలేరులోని స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. శిల్ప మరణంపై విచారణకోరుతూ అటు వైద్యులు, ఇటు మెడికోలు వివిధరకాలుగా ఆందోళన చేసిన నేపధ్యంలో వేసిన విచారణ కమిటీలు వాస్తవాలను నిగ్గు తేల్చడంలో జాప్యం చేశాయి. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విచారణకు సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విచారణ కూడా కొంత ఆలస్యం అవుతోందని, తిరిగి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ మెడికోలు మరోమారు ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకుని సిట్ బృందం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోందని, ఆవేశాలకు పోయి ఎస్వీ మెడికల్ కళాశాలకు అప్రతిష్ట తీసుకురావద్దని హితవు పలికారు. ఈ క్రమంలో సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి నేతృత్వంలో రెండు నెలలు పాటు పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. చివరకు డాక్టర్ రవికుమార్ మృతురాలు శిల్పను లైంగికంగా వేధించాడని, అందుకు డాక్టర్ కిరీటీ, డాక్టర్ శశికుమార్ మద్దతు ఇచ్చారని, ఈ వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేల్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఐడీ ఎస్పీ అమ్మిరెడ్డి తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బెల్లం శిల్ప ఆగస్టు 8వ తేదీన పీలేరులో తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె చెల్లెలు బెల్లం శృతి పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో పలు యాక్ట్‌ల కింద డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్‌లను ముద్దాయిలుగా చేర్చి కేసులు నమోదు చేశామన్నారు. డాక్టర్ శిల్ప ఎస్వీ మెడికల్ కళాశాలలో 2015లో పీడియాట్రిక్ విభాగంలో పీజీలో చేరిందన్నారు. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమెకు డాక్టర్ రూపేష్‌కుమార్‌తో వివాహం జరిగిందన్నారు. వారికి 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడన్నారు. పీడియాట్రిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ రవికుమార్ మరో ఇద్దరు డాక్టర్లు డాక్టర్ శిల్పను లైంగికంగా వేధించారన్నారు. తనపై వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు 2018 ఏప్రిల్‌లో ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో గవర్నర్ ఆదేశాల మేరకు ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమణయ్య విచారణ కమిటీని నియమించారన్నారు. ఈక్రమంలోనే డాక్టర్ శిల్ప అలిపిరి పోలీస్ స్టేషన్లో డాక్టర్ రవికుమార్‌పై ఫిర్యాదు చేసిందన్నారు. ఆ తరువాత కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేయడంతో డాక్టర్ శిల్ప అలిపిరి పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసును ఉపసంహరించుకుందన్నారు. కాగా డాక్టర్ శిల్ప ఇచ్చిన ఫిర్యాదులో పీజీ పరీక్షల్లో తనను ఉద్దేశ పూర్వకంగానే ముగ్గురు డాక్టర్లు కలిసి ఫెయిల్ చేయించారని పేర్కొందన్నారు. 8 మార్కులతో ఫెయిల్ అయిన డాక్టర్ శిల్ప రీవాల్యుయేషన్‌కు పెట్టుకున్నా ఫెయిల్ అయినట్లు చూపారన్నారు. తాను ఊహించినట్లుగానే డాక్టర్లు తనపై కక్ష సాధింపుచర్యల్లో భాగంగానే ఫెయిల్ చేసినట్లు డాక్టర్ శిల్ప నిర్ణయానికి వచ్చారన్నారు. మైగ్రెయిన్‌తో బాధపడుతున్న డాక్టర్ శిల్ప ఆగస్టు 7న ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అదే రోజున డాక్టర్ బృందంచే శవపరీక్ష కూడా జరిగిందన్నారు. డాక్టర్లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ దర్యాప్తు చేశారని చెప్పారు. సాక్షులను, నేరస్థలాన్ని పరిశీలించి మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆగస్టు 10న సీఐడీ డీఎస్పీ జీవీ రమణ, ఒక మహిళా సీఐతోపాటు మరో నలుగురు సీఐలతో సిట్ బృందం కేసును వేగవంతం చేసిందన్నారు. ఈ క్రమంలో ఫిర్యాది భర్త, బంధువులు, సహచర పీజీ విద్యార్థులు, బోధనా సిబ్బంది, ఎస్వీమెడికల్ కళాశాల పూర్వపు పీజీ విద్యార్థులను విచారించారన్నారు. వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను కూడా సిట్ బృందం పరిశీలించిందని, ఇందులో భాగంగానే ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ పరీక్షా విధానాన్ని కూడా పరిశీలించిందన్నారు. ఈ కేసులో ఏ1 ముద్దాయి అయిన డాక్టర్ రవికుమార్, శిల్పనే కాకుండా ఇతర పీజీ విద్యార్థినులను కూడా అసభ్యకర పదజాలంతో దూషించేవాడని, అవమానకరంగా హేళన చేసేవాడని తేలిందన్నారు. తన సహచర విద్యార్థినులను దూషించే విషయం తెలుసుకున్న డాక్టర్ శిల్ప డాక్టర్ రవికుమార్ తీరును తప్పుపట్టిందన్నారు. ఈక్రమంలో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయని, దీంతో ఆమె మానసిక ఒత్తిడికి లోనైందన్నారు. డాక్టర్ కిరీటి, డాక్టర్ శశికుమార్, డాక్టర్ రవికుమార్‌ను నియంత్రించకపోగా ప్రోత్సహించారని విచారణలో తేలిందన్నారు. మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడుతున్న డాక్టర్ శిల్ప బెంగళూరులోని నిమ్‌హాన్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడలను డాక్టర్లకు వివరించినట్లు తేలిందన్నారు. ఐసీయూలో పేషెంట్లు, సిబ్బంది ముందు కూడా ఏ1 ముద్దాయి డాక్టర్ రవికుమార్ ఆమెను అవమానించినట్లు కూడా విచారణలో తెలిసిందన్నారు. చివరకు ఆమెను ఏకాకి చేయడం, తన గోడును ఎవరూ పట్టించుకోకుండా చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వీటన్నింటిని పరిపూర్ణంగా పరిశీలించి డాక్టర్ రవికుమార్‌ను ఏ1గాను, సహకరించిన డాక్టర్లను ఏ2, ఏ3లుగా నిర్ధారించామన్నారు. శిల్ప మరణంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మరో దారిలేక ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందడానికి ప్రయత్నించారన్నారు. దీనిని సీఐడీ విభాగం తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. అయితే న్యాయస్థానం వారికి కండీషన్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. త్వరలోనే చార్జీషీట్ వేయనున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.