క్రైమ్/లీగల్

ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, డిసెంబర్ 25: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చిలకలూరిపేట మండలం యడవల్లి నుండి గుంటూరులోని గోరంట్లకు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న గర్భిణి వేజర్ల జయశ్రీ (19), ఆమె తల్లి అనసూయ (40) ప్రమాద స్థలంలోనే మరణించారు. సుంకర రమాదేవి (40), రమ్య (19), ఫ్రాన్సిస్, శ్రీకాంత్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు. గోరంట్లకు చెందిన జయశ్రీని సంవత్సరం క్రితం యడవల్లి గ్రామంలోని నాగరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. సోమవారం రాత్రి జయశ్రీకి సీమంతపు వేడుకలు నిర్వహించి అర్ధరాత్రి దాటాక గుంటూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. యడ్లపాడు-తిమ్మాపురం గ్రామాల నడుమ పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జయింది. ట్రాక్టర్ సైతం తునాతునకలై విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ట్రాక్టర్‌లో ఉన్న బూషి హనుమంతరావు, తలపల రమేష్‌లకు కూడా గాయాలయ్యాయి. వీరు గుంటూరులో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన వీరు శావల్యాపురంలో వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వెళ్తున్నట్టు సమాచారం. నర్సరావుపేట డీఎస్‌పీ కాలేషావలి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అత్తవారింట సీమంతపు వేడుకలు జరుపుకుని పుట్టింటికి వెళ్తున్న వేజర్ల జయశ్రీ ఈ ప్రమాదంలో మృతి చెందటం రెండు గ్రామాల వారిని కంటతడి పెట్టించింది.

చిత్రం..ప్రమాదంలో నుజ్జైన కారు